Begin typing your search above and press return to search.

ఢిల్లీ పిలుస్తోందా...కేసీయార్... ?

By:  Tupaki Desk   |   8 Nov 2021 12:30 PM GMT
ఢిల్లీ పిలుస్తోందా...కేసీయార్... ?
X
రాజకీయాల్లో లేనిది సంతృప్తి. ఒక పదవి వస్తే దానికి మించి మరోటి రావాలి. ఒక హోదాతో సరిపుచ్చుకుంటే అది నగుబాటు నామార్దాగా భావించే రోజులు ఇవి. ఎమ్మెల్యే మంత్రి కావాలి. ఆ మీదట ముఖ్యమంత్రి కావాలి. ఇక అక్కడితో ఆగుతారా అంటే ఢిల్లీ వైపు చూపు సాగుతుంది. నాడు చంద్రబాబు అయినా నేడు కల్వకుంట చంద్రశేఖరరావు అయినా కూడా హస్తినలో చక్రం తిప్పాలని తెగ బలాటపడ్డవారే. కేసీయార్ అయితే 2019 ఎన్నికల ముందు ఫెడరల్ ఫ్రంట్ పేరుతో బాగానే హడావుడి చేశారు. పొరుగున జగన్ తోడుంటే ఢిల్లీ కోటను బద్ధలు కొట్టవచ్చు అనుకున్నారు. అదే ఊపులో ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ ని, పశ్చిమ‌ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని కలిసి కాంగ్రెస్, బీజేపీకి ఆల్టర్నేషన్ అంటూ భారీ ప్రకటనలే చేశారు.

అయితే 2019 ఎన్నికల్లో తెలంగాణాలో మొత్తం 19 లోక్ సభ సీట్లకు టీయారెస్ కి కేవలం తొమ్మిది మాత్రమే దక్కడం, దేశాన బీజేపీ అంతకు ముందు కంటే ప్రభంజనం సృష్టించి ఏకంగా 303 సీట్లను సొంతం చేసుకోవడంతో కేసీయార్ కేరాఫ్ హైదరాబాద్ గా స్థిరపడిపోయారు. ఇపుడు కేంద్రంలో మోడీ క్రేజ్ మెల్లగా తగ్గుతోంది అన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. మరో వైపు చూస్తే వరసబెట్టి ఎక్కడ ఎన్నికలు జరిగినా రాష్ట్రాల ఎన్నికలు జరిగినా బీజేపీకి ఓటమి షరా మామూలుగా అయిపోతోంది. దీంతో పాటు బీజేపీకి వ్యతిరేకంగా రైతుల ఆందోళన ఈ రోజుకీ బలంగా సాగుతోంది. మోడీని ఢీ కొట్టాలని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కసరత్తు చేస్తున్నారు.

సరిగ్గా ఇదే సమయం అని కేసీయార్ కి అర్ధమై ఉంటుంది. అందుకే ఆయన ఒక వ్యూహం ప్రకారమే బీజేపీ మీద పెద్ద నోరు చేశారని అంటున్నారు. ఆయన తాజా ప్రెస్ మీట్ తీసుకుంటే అనేక లోతైన విషయాలు కనిపిస్తాయి. ఈ దేశంలో మరోసారి మోడీ వచ్చే చాన్సే లేదన్న ధీమా బాగా కేసీయార్ లో కనిపిస్తోంది. మీరు గల్లీలో చేసేదేంటి. మేము ఢిల్లీ వచ్చి ఆందోళన చేస్తాం, బరాబర్ ఢీ అంటే ఢీ కొడతాం అంటూ కేసీయార్ చేసిన సవాల్ ని మామూలుగా చూడడానికి వీలు లేదు. కేసీయార్ అంటేనే వ్యూహాల పుట్ట. ఆయన ఒక మాట అన్నారూ అంటే వేయి అర్ధాలు అందులో వెతుక్కోవాలి. ఆయన కేవలం హుజూరాబాద్ ఎన్నికల్లో బీజేపీ గెలుపును ఉద్దేశించి అసహనంతో చేసిన మాటలుగా వీటిని చూడలేమని కూడా అంటున్నారు.

మొత్తానికి ఢిల్లీ పిలుపు గట్టిగానే కేసీయార్ కి వినిపిస్తోంది. అందుకే ఆయన అర్జంటుగా మోడీ సార్ మీద ఆగ్రహిస్తున్నారు. దేశానికి ఏడేళ్లలో ఏం చేశారంటూ గర్జిస్తున్నారు. మీ చేతగానితనాన్ని మాకు రుద్దుతారా అంటూ మండుతున్నారు. ఒక్క పని అయినా చెప్పుకునేందుకు మీకు ఉందా అంటూ మోడీ మాస్టార్ కే చాలేంజి చేస్తున్నారు. ఇక లాభం లేదు, కేసీయార్ ఢిల్లీ వెళ్ళి తీరాల్సిందే అంటున్నారు అంతా. దానికి రెడీ అయ్యే ఆయన ఈ విధంగా ఫోకస్డ్ గానే బీజేపీ మీద ఫైర్ అయ్యారని చెబుతున్నారు.

అయితే కేసీయార్ గతంలో ఒకసారి ఇలాగే తిరిగి కాడె పడేశారని, ఈసారి ఆయన ఆవేశం అంతేనని కొందరు భావించవచ్చు కాక, కానీ కేసీయార్ ఈసారి పక్కా ప్లాన్ తోనే ఉన్నారని అంటున్నారు. ఆయన ఇక మీదట ఢిల్లీ టూర్లు వరసబెట్టి ఉంటాయని కూడా అంటున్నారు. అయితే దీని మీద మరింత స్పష్టత రావాలీ అంటే మాత్రం 2022 లో జరిగే అయిదు రాష్ట్రాల ఎన్నికల వరకూ ఆగాల్సిందే. అప్పుడు కనుక బీజేపీకి ఘోర పరాభవం జరిగిందా కేసీయార్ దూకుడుని ఎవరూ అసలు ఆపలేరంతే అంటున్నారు. ఆయన ఈసారి ఢిల్లీలో చక్రం పట్టే చక్రధారి అవుతారని కూడా బల్ల గుద్దుతున్న వారూ ఉన్నారు. ఇవన్నీ చూడాలంటే వెయిట్ చేయాల్సిందే.