Begin typing your search above and press return to search.

శృంగార సమస్యలకు మధుమేహం కారణమా..?

By:  Tupaki Desk   |   25 Dec 2022 2:30 AM GMT
శృంగార సమస్యలకు మధుమేహం కారణమా..?
X
మధుమేహం నియంత్రణలో లేని వాళ్లలో అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా గుండె సమస్యలు, నాడులు దెబ్బతినడం వంటివి చుట్టుముడుతాయి. అయితే తాజాగా తేలిన పరిశోధన ప్రకారం మధుమేహం అధికంగా ఉన్న ఆడ, మొగవారిలో శృంగార సమస్యలు కూడా ఉంటున్నాయి. మధుమేహం నియంత్రణ కోల్పోవడం వల్ల మగవారిలో టెస్టోస్టీరాన్ మోతాదులు తగ్గుతాయి. ఆడవారిలో శారీరకంగా, మానసికంగా కోరికలు లోపిస్తాయి. దీంతో వీరిలో శృంగారానికి అనుకూల వాతావరణం ఉండదు. అయితే ఇలాంటి సమస్యలు ఎదురుకాకుండా ఉండడానికి కొన్ని జాగ్రత్తలు, సరైన ఆహారం తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

సాధారణంగా మధుమేహం మోతాదుకు మించి ఉన్న మొగవారిలో రకరకాల సమస్యలు ఉత్పన్నమవుతాయి. అతిమూత్రం, బరువు పెరగడం లేదా సన్నబడడం, కండరాల నొప్పి వంటివి ఏర్పడుతాయి. కానీ పురుషుల్లోని టెస్టోస్టీరాన్ మోతాదులు తగ్గడంతో వారిలో శృంగార వాంఛ విపరీతంగా తగ్గుతుంది.

టెస్టోస్టీరాన్ మోతాదు తగ్గడం వల్ల నీరసం ఏర్పడుతుంది. అలాగే చిన్న విషయానికే కుంగిపోవడం, నిస్సత్తువ ఉంటుంది. దీంతో ఏ పని సరిగా చేయలేకపోతారు. ఒకవేళ ఇలాంటి ఎఫెక్ట్ ఉన్నవాళ్లు శృంగారంలో పాల్గొన్న వారిలో సంతానోత్పత్తి సమస్యలు ఎదురవుతాయి.

ఇక ఆడవారిలోనూ అనేక కొత్త సమస్యలు పుట్టుకొస్తాయి. వీరిలో మధుమేహం శృతి మించితే శారీరకంగా, మానసికంగా సమస్యలు వస్తాయి. సంభోగ సమయంలో మూత్ర ఇన్ఫెక్షన్ ఏర్పడుతుంది. సాధారణ మహిళలతో తో పోలిస్తే ఇలాంటి వారి అండాశయాల్లో నీటితిత్తులు ఎక్కువగా ఉంటాయి. పీసీఓఎస్ బారినపడ్డ వారిలో కణాలు ఇన్సులిన్ ను గ్రహించకపోవడం, రక్తంలో ఇన్సులిన్ మోతాదు పెరిగి గర్భధారణకు విఘాతం కలగడం వంటి సమస్యలు ఏర్పడుతాయి.

అయితే ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే సరైన ఆహారంతో పాటు కొన్ని జాగ్రత్తలు పాటించాలని అంటున్నారు. క్రమం తప్పకుండా మెడిసిన్ వాడుతూనే ఆకుకూరలు, క్యారట్లు, చిక్కులు, బఠానీలు, గింజలు ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు. పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలని మరీ మంచిదంటున్నారు.

అలాగే రోజూ వ్యాయామం చేయడంతో పాటు యోగాను కూడా అలవర్చుకోవాలి. ఇక ఎక్కువ సేపు కంప్యూటర్, ల్యాప్ ల ముందు కూర్చోకుండా.. పొగ, అతిగా మద్యం సేవించకుండా జాగ్రత్తపడాలి. అయితే శృంగార సమస్యలు ఏవైనా ఎదురైతే వెంటనే ఆందోళన పడకుండా వాటిని నివృత్తి చేసుకోవడం మంచిది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.