Begin typing your search above and press return to search.

డీకేని నిజంగానే వేధిస్తున్నదా ?

By:  Tupaki Desk   |   3 Oct 2022 5:07 AM GMT
డీకేని నిజంగానే వేధిస్తున్నదా ?
X
తనకు బద్ధశతృవులుగా ఉన్న నేతలను కేంద్రప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని బీజేపీ వేధింపులకు గురిచేస్తోందనే ఆరోపణలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. మిగిలిన వారి విషయంలో ఈ ఆరోపణలు ఎలాగున్నా కర్నాటకలో కాంగ్రెస్ ప్రముఖ నేత డీకే శివకుమార్ విషయంలో మాత్రం కరెక్టే అనిపిస్తోంది. ఈనెల 7 వ తేదీన ఢిల్లీలో విచారణకు హాజరుకావాలని ఎన్పోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా నోటీసులు జారీచేసింది.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధి మొదలుపెట్టిన 'భారత్ జోడో' పాదయాత్ర సందర్భంగా నోటీసులు జారీచేయటం గమనార్హం. రాహుల్ పాదయాత్ర కర్నాటకలోకి ప్రవేశించే సమయానికే డీకేని విచారణకు హాజరు కావాలని నోటీసులివ్వటమే ఆశ్చర్యంగా ఉంది. యాత్ర వ్యవహారాలను మొత్తం డీకే పర్యవేక్షిస్తున్నారు. సరే ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే ఇప్పటికే ఆదాయానికి మించిన అక్రమాస్తుల వ్యవహారం పేరుతో ఈడీ, సీబీఐ వేర్వేరుగా చాలాసార్లు ఇప్పటికే విచారించాయి.

డీకే ఇల్లు, ఆఫీసులపై చాలాసార్లు దాడులు చేశాయి. విచారణ పేరుతో ఈడీ డీకేని పిలిపించుకుని అరెస్టు చేసి కొద్ది రోజులు రిమాండులో కూడా ఉంచింది. ఎన్నోసార్లు బెంగుళూరులో విచారించటంతో పాటు ఢిల్లీకి కూడా పిలిపించుకున్నాయి.

ఇన్నిసార్లు విచారించినా, సోదాలు చేసినా, రిమాండులో ఉంచినా మళ్ళీ ఏదో కేసుపేరుతో విచారణకు పిలిపిస్తోంది. అంటే అనేక రకాలుగా డీకేపై ఒత్తిడి పెట్టి దర్యాప్తు సంస్ధల ద్వారానే కాంగ్రెస్ కు దూరంగా ఉంచాలనే కుట్రలు జరుగుతోందనే ఆరోపణలకు దర్యాప్తు సంస్థలు ఆస్కారమిస్తున్నాయి.

డీకేని దర్యాప్తు సంస్ధలు ఇంకా ఎన్నిసార్లు విచారణకు పిలిపిస్తాయో అర్ధం కావటంలేదు. అగ్రనేత రాహుల్ పాదయాత్ర కర్నాటకలోకి ఎంటరయ్యే సమయానికే డీకేని విచారణకు పిలిపించాల్సిన అవసరం ఏమిటి ? ఈ కారణంగానే రాహుల్ యాత్ర సందర్భంగా డీకేని దూరంగా ఉంచటమే అనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. మొత్తానికి ఇప్పటికే మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, ఢిల్లీ, బీహార్ లాంటి రాష్ట్రాల్లో చాలామంది నేతలపై ఈడీ, సీబీఐ నోటీసులివ్వటం, విచారించటం, అరెస్టులు చేయటం అందరు చూస్తున్నదే.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.