Begin typing your search above and press return to search.

ఆ విష‌యంలో ట్రంప్‌ను అనుస‌రిస్తున్న మ‌స్క్‌!

By:  Tupaki Desk   |   12 Aug 2022 11:30 PM GMT
ఆ విష‌యంలో ట్రంప్‌ను అనుస‌రిస్తున్న మ‌స్క్‌!
X
స్పేస్ ఎక్స్ కంపెనీ అధినేత‌ ఎలాన్‌ మస్క్‌ సంచలన నిర్ణయం దిశ‌గా అడుగులేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తరహాలోనే తానే సొంతంగా ఓ సోషల్‌ మీడియా ఫ్లాట్‌ ఫామ్‌ను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఆ ఫ్లాట్‌ ఫామ్‌ పేరును కూడా ఎలాన్ మ‌స్క్ ప్ర‌క‌టించారు. ఎక్స్.కామ్ పేరుతో సొంత సోష‌ల్ మీడియా ప్లాట్ పామ్‌ను ప్రారంభిస్తున్న‌ట్టు మ‌స్క్ తెలిపారు.

ఒక‌ ట్విట్టర్‌ యూజర్‌..'ట్విట్టర్‌ కొనుగోలు ఒప్పందం రద‍్దయితే.. మీరు సొంత సోషల్‌ మీడియా ఫ్లాట్‌ ఫామ్‌ను ప్రారంభిస్తారా? అని ట్వీట్‌ చేశారు. ఆ ట్వీట్‌కు ఎలాన్‌ మస్క్‌ రిప్లై ఇచ్చారు. ఎక్స్‌.కామ్‌ తన సోషల్‌ మీడియా ఫ్లాట్‌ ఫామ్‌ అంటూ రివీల్ చేసేశారు.

ఇటీవ‌ల మైక్రో బ్లాగింగ్ ప్లాట్ ఫామ్ ట్విట్ట‌రు కొనుగోలుకు ముందుకొచ్చి చివ‌రి నిమిషంలో తూచ్ అనేశాడు.. మ‌స్క్. భార‌త క‌రెన్సీలో 3.30 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల‌కు ట్విట్ట‌ర్ కొనుగోలుకు ముందుకొచ్చిన మ‌స్క్.. ట్విట్ట‌ర్ యాజ‌మాన్యం తాను అడిగిన స‌మాచారం ఇవ్వ‌డం లేద‌ని ఆరోపించారు. నిజ‌మైన యూజ‌ర్లు ఎంత‌మందో, స్పామ్ యూజ‌ర్లెంతో మందో ట్విట్ట‌ర్ త‌న‌కు చెప్ప‌డం లేద‌ని.. ట్విట్ట‌ర్ కొనుగోలు డీల్ నుంచి వైదొల‌గారు.

మళ్లీ ఇప్పుడు ఎలాన్‌ మస్క్‌ తానే సొంతంగా సోషల్‌ మీడియా సైట్‌ను ఏర్పాటు చేస్తానని చెప్పడం వైర‌ల్ గా మారింది. కాగా, ఎలాన్‌ మస్క్‌ చెప్పిన ఎక్స్‌.కామ్‌లో గతంలో ఆర్ధిక కార్యకలాపాలు జరిగేవ‌ని చెబుతున్నారు. ఇప్పుడు ఆ సైట్‌లో ఎలాంటి కంటెంట్‌ లేకపోవడంతో ఎలాన్‌ మస్క్‌ చెప్పింది నిజమేనంటూ ఆయనను అనుస‌రించేవారు భావిస్తున్నారు.

కాగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ ఖాతాల‌ను ట్విట్ట‌ర్, ఫేస్ బుక్ బ్లాక్ చేయ‌డంతో ఆయ‌న కూడా త‌న సొంత సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్.. ట్రూత్ సోష‌ల్ ను లాంచ్ చేశారు.

జో బైడెన్ పై గెల‌వ‌డానికి అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో అన్ని ర‌కాల అక్ర‌మాల‌కు పాల్ప‌డ‌టంతో ట్విట్ట‌ర్, ఫేస్ బుక్ ట్రంప్ సోష‌ల్ మీడియా ఖాతాల‌ను బ్లాక్ చేశాయి. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ట్రూత్ సోష‌ల్ అంటూ సొంత సోష‌ల్ మీడియాతో రంగంలోకి వ‌చ్చారు. ఇప్పుడు ఇదే కోవ‌లో ఎలాన్ మ‌స్క్ సైతం సొంత సోష‌ల్ మీడియా ఎక్స్.కామ్ తో వ‌స్తున్నారు.