Begin typing your search above and press return to search.

ఈటలకు కాంగ్రెస్ ఎందుకొద్దు? బీజేపీ ఎందుకు ముద్దు?

By:  Tupaki Desk   |   26 May 2021 5:30 AM GMT
ఈటలకు కాంగ్రెస్ ఎందుకొద్దు? బీజేపీ ఎందుకు ముద్దు?
X
సీనియర్ నేత.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఒకప్పుడు అత్యంత సన్నిహితుడు.. తెలంగాణ ఉద్యమ వేళ.. తెలంగాణ సమాజం ఘోషను.. కోట్లాది మంది ఆవేదనను కంట నీరు కారేలా అసెంబ్లీలో వినిపించిన ఈటల రాజేందర్ కు సంబంధించి ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు తెలిసిందే. కబ్జా ఆరోపణలతో మంత్రి పదవి నుంచి తొలగించిన సీఎం కేసీఆర్.. అంత పెద్ద నేరానికి.. ఘోరానికి పాల్పడిన ఈటలను పార్టీ నుంచి మాత్రం సస్పెండ్ చేసే ప్రయత్నం చేయలేదు.

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని టీఆర్ఎస్ కు చెందిన కొందరు డిమాండ్ చేసినా.. టెంప్టు కాకుండా ఆచితూచి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు ఈటల రాజేందర్. ఇదిలా ఉంటే ఆయన కాంగ్రెస్ లో చేరతారని కొందరు.. కాదు బీజేపీలోకి వెళ్లటం ఖాయమని మరికొందరు వాదనలు వినిపిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్.. బీజేపీకి చెందిన నేతలతో ఈటల భేటీ కావటం తెలిసిందే. తాజాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో భేటీ అయినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. అయితే.. అందులో నిజం లేదని.. కిషన్ రెడ్డి స్వయంగా తేల్చేశారు.

కాంగ్రెస్ లో చేరకుండా బీజేపీలో చేరేందుకు ఈటల ఎందుకు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. అయితే.. బీజేపీలో చేరటానికి ముందు తానేమిటి? తన వ్యక్తిగత బలం ఏమిటన్న విషయాన్ని సీఎం కేసీఆర్ కు తెలిసేలా చేయాలన్న యోచనలో ఆయన ఉన్నట్లుగా చెబుతున్నారు. సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లోనూ వైరల్ అవుతున్నట్లుగా ఆయన బీజేపీలో చేరే అవకాశం లేదంటున్నారు. అదే సమయంలో ఆయన సోషల్ మీడియా ఖాతా మార్పు రావటం వెనుక అసలు కారణం వేరే ఉందని చెబుతున్నారు.

తనపై కబ్జా ముద్ర వేసిన నేపథ్యంలో.. ఈటల రాజేందర్ త్వరలోనే తన పదవికి రాజీనామా చేసే వీలుందని చెబుతున్నారు. అంతేకాదు.. తన రాజీనామాతో వచ్చే ఉప ఎన్నికల్లో తాను కాకుండా తన సతీమణి జమునాను ఉప ఎన్నికల బరిలోకి దించాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. తనపై మరక వేసిన కేసీఆర్ కు అంతే స్థాయిలో సమాధానం ఇచ్చేందుకు.. తన సతీమణిని రంగంలోకి దింపాలని.. ఉప ఎన్నికను ఎమోషనల్ గా మార్చాలన్న యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఉప ఎన్నికల్లో తన సత్తాను చాటి.. తన భార్యను ఎమ్మెల్యేగా గెలిపించుకోవటం ద్వారా తన బలం ఏమిటో తెలిసేలా చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో బీజేపీలోకి చేరే వీలుందని చెబుతున్నారు. ఈటలకు రాజ్యసభ సభ్యుడిగా చేస్తారని.. కేంద్ర సహాయ మంత్రిగా కూడా బాధ్యతలు అప్పజెప్పే అవకాశం ఉందన్న వాదనలతోకూడిన చర్చ ఒకటి సాగుతోంది. తెలంగాణ విషయంలో మోడీషాలు సీరియస్ గా ఉంటే.. ఇప్పుడు చెబుతున్న కాంబినేషన్ లో ఈటలను ఎంపీని చేసి.. మంత్రి పదవిని కట్టబెట్టటం ద్వారా ఆయన్ను బలోపేతం చేయటమే కాదు.. కేసీఆర్ కు ఏ మాత్రం మింగుడుపడని రీతిలో షాకుల మీద షాకులు తప్పవంటున్నారు.

అదే కాంగ్రెస్ లో చేరితే తనకు పెద్ద అండ ఉండదని.. ఆ పార్టీలో అయితే తనను తాను చేసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. అదే బీజేపీలో చేరేందుకు సానుకూలంగా ఉంటే.. డిపాల్ట్ గా కేంద్రం అభయం తనకు ఉంటుందన్న యోచనలో ఈటల ఉన్నట్లు చెబుతున్నారు.ఈ కారణంతోనే కాంగ్రెస్ కుదూరంగా.. బీజేపీకి ఈటల దగ్గర అవుతున్నారన్న చర్చ నడుస్తోంది. అంచనాల రూపంలో వినిపిస్తున్న ఈ లెక్క రియాలిటీలో ఎంతమేరకు వాస్తవ రూపం దాలుస్తుందో కాలమే సమాధానం చెప్పాలి.