Begin typing your search above and press return to search.

ఎన్టీయార్ ని బాబు..బాలయ్య...లక్ష్మీపార్వతి...అందరూ మోసం చేశారా...?

By:  Tupaki Desk   |   20 Oct 2022 2:30 PM GMT
ఎన్టీయార్ ని బాబు..బాలయ్య...లక్ష్మీపార్వతి...అందరూ మోసం చేశారా...?
X
ఎన్టీయార్ పాపం రాజకీయ అమాయక చక్రవర్తి. ఆయన భోళా శంకరుడు. ఎన్టీయార్ మంచి నటుడు. కానీ లౌక్యం తెలియదు అని సిని ఇండస్ట్రీలోనే అంతా అనుకునేవారు. ఆయన పొగడ్తలకు బాగా పడిపోయేవారు అని కూడా ప్రచారంలో ఉన్న మాట. అంతే కాదు ఎన్టీయార్ కి ఒక చెడ్డ అలవాటు ఉందని చెబుతారు. అదేంటి అంటే ఆయన చెప్పుడు మాటలు బాగా వింటారని, దాని వల్ల ఆయన పక్కన ఉన్న వారు బాగుపడ్డారు కానీ ఎన్టీయార్ రాజకీయ జీవితం ఇబ్బందుల్లో పడడానికి అదే ప్రధాన కారణం అంటారు.

ఇక ఎన్టీయార్ 1982లో టీడీపీ పెట్టినపుడు కాంగ్రెస్ నుంచి వచ్చిన సీనియర్ మోస్ట్ లీడర్, మాజీ మంత్రి నాదెండ్ల భాస్కరరావు ఆయన వెన్నటి ఉండేవారు. ఎన్టీయార్ కి రాజకీయం తెలియకపోవడంతో నాదెండ్ల మీద బాగా ఆధారపడ్డారు. ఒక విధంగా ఎన్టీయార్ పేరుకు సీఎం గా ఉన్న అంతా నాదెండ్ల కనుసన్నలలో నడిపించారు అని అంటారు. అప్పట్లో చాలా మంది ఎన్టీయార్ తో తమ గోడు వెళ్లబోసుకోవడానికి చూసినా ఆయన నాదెండ్ల మాటలనే నమ్మేవారు అని అంటారు. చివరికి అదే నాదెండ్ల ఆయన్ని వెన్నుపోటు పొడిచేసరికి ఎన్టీయార్ కి వాస్తవాలు అన్నీ అర్ధమయ్యాయని అంటారు.

ఇక ఎన్టీయార్ కి ఆదే సమయంలో తన పార్టీలోకి వచ్చిన అల్లుడు చంద్రబాబు బాగా నచ్చేశాడు అంటారు. టీడీపీలో అంతవరకూ పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఉన్నా చంద్రబాబు కాంగ్రెస్ లో మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఉండడంతో ఎన్టీయార్ ఆయన మాటలకు ఎక్కువ విలువ ఇచ్చేవారు అని అంటారు. అలా ఎన్టీయార్ కి చేరువ అయి నాదెండ్ల వెన్నుపోటు ఎపిసోడ్ లో పార్టీ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా క్యాంప్ రాజకీయాలను నడిపి చంద్రబాబు 1984 ఎన్టీయార్ పదవి నిలబెట్టారు. అలా మంచి మార్కులు అన్న గారి దగ్గర అల్లుడు వేయించుకున్నారు.

అది ఎంతదాకా వెళ్ళింది అంటే 1985 నుంచి 1989 దాకా జరిగిన అయిదేళ్ల ఎన్టీయార్ పాలనలో మొత్తానికి మొత్తం చంద్రబాబే తెర వెనక చక్రం తిప్పారని, ఆయన వల్లనే సీనియర్లు చాలా మంది పార్టీలో ఇమడలేక బయటకు వెళ్ళారని చెబుతారు. అలా జానారెడ్డి, నల్లపురెడ్డి శ్రీనివాసులురెడ్డి, కేఈ క్రిష్ణమూర్తి సహా ఎంతో మంది సీనియర్లు పార్టీ పెట్టిన మొదట్లో ఉన్న వారు తరువాత రోజులలో బయటకు వెళ్ళిపోయారు.

అదే సమయంలో ఎన్టీయార్ మీద అవినీతి ఆరోపణల్ చేస్తూ విశాఖకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత ద్రోణం రాజు సత్యనారాయణ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే ఏడు అంశాలలో ప్రాధమిక అధారాలు ఉన్నాయని నాటి కోర్టు తేల్చింది. ఇది 1989లో జరిగిన ముచ్చట. దాని మీద ఎన్టీయార్ తెచ్చుకున్నారు. అయితే ఎన్టీయార్ స్వతహాగా ఒక్క అవినీతి కూడా చేయలేదు. ఆయన అల్లుడు చంద్రబాబు వెనక ఉండడం వల్లనే ఆయనకు అవినీతి ముద్ర కూడా వచ్చిందని నాడే పార్టీలో ఉన్న వారు విమర్శలు చేశారు.

ఇక్కడ చిత్రమేంటి అంటే చంద్రబాబు మీద ఆయన టీడీపీలో చేస్తున్న కార్యక్రమాల మీద నాటికీ నేటికీ తెలుగు నాట నంబర్ వన్ గా ఉన్న ఒక అగ్ర పత్రిక ఆనాడు ఏకంగా ఎడిటోరియల్స్ ఎన్నో రాసి ఘాటుగా విమర్శించింది. చిన్నల్లుడి మీద కార్టూన్లు కూడా వ్యంగంగా వేయించి మరీ ఎన్టీయార్ ని ఇండైరెక్ట్ గా విమర్శించేది.

అయితే ఆ తరువాత అదే పత్రిక యజమాని చంద్రబాబుతో ఎంతో సన్నిహితం కావడమే కాదు 1995 ఎపిసోడ్ లో ఎన్టీయార్ వెన్నుపోటుకు పూర్తి సాయం అందించి చంద్రబాబు సీఎం కావడానికి ఫుల్ సపోర్ట్ చేసిన ఉదంతం చరిత్రలో పదిలంగా ఉంది మరి. ఇక ఎన్టీయార్ ని బలహీనతలను వాడుకుని చాలా మందే ఆయన్ని రాజకీయంగా దెబ్బ తీశారు. నాదెండ్లను చంద్రబాబు పక్కన పెడితే లక్ష్మీపార్వతి ఎంటర్ అయిన తరువాత చంద్రబాబు సైడ్ కావాల్సి వచ్చింది అని టీడీపీ వర్గాల మాట.

ఎన్టీయార్ కి లక్ష్మీపార్వతి పరిచయం అయిన తరువాత 1993 సెప్టెంబర్ లో ఆమెను ఆయన వివాహం చేసుకున్నారు. దానికి ముందు ఆయన మేజర్ చంద్రకాంత్ అనే సినిమా వంద రోజుల ఫంక్షన్ లో తన భార్యగా లక్ష్మీపార్వతిని స్వీకరిస్తున్నట్లుగా ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చేశారు. ఆ మరుసటి రోజు తన ఇంట్లోనే షిరిడీ సాయి విగ్రహం సాక్షిగా ఆమె మెడలో ఎన్టీయార్ తాళి కట్టి తన రెండవ భార్య అని లోకానికి చాటారు.

ఇక ఆ తరువాత ఎన్టీయార్ కి ఆమె దగ్గర అయ్యారు. ఆమె ఎన్టీయార్ కుటుంబానికి ఆయనకు మధ్యన అడ్డు గోడలా మారారని కూడా ఆరోపణలు ఉన్నాయి. ఆమెకు రాజకీయాల మీద ఆశ ఉందా లేక కొందరు కల్పించారా అన్నది తెలియదు కానీ ఆమె 1994 ఎన్నికలకు ముందు టికెట్ల సందర్భంలో కూడా జోక్యం చేసుకుని కొందరు పేర్లు ఎన్టీయార్ కి చెప్పారని నాడు ప్రచారం జరిగింది. ఇక ఎన్టీయార్ ముఖ్యమంత్రి అయ్యాక ఆయనతో పాటుగా ఆమె సభలు సమావేశాలకు రావడం ద్వారా పార్టీలో ప్రభుత్వంలో తానొక కీలక కేంద్రం అని చెప్పకనే చెప్పారని అంటారు.

ఇది ఒక విధంగా ఎన్టీయార్ కి వెన్నుపోటు పొడవడానికి అది కీలక కారణం అయింది అని చెబుతారు. ఇక మంత్రులు కొందరు ఆనాడు ఆమె వర్గంగా ఉండేవారని చెబుతారు. అలాగే ఎన్టీయార్ తో టీడీపీ నాయకులు భేటీ కావాలంటే లక్ష్మీ పార్వతి అపాయింట్మెంట్ తీసుకోవాల్సిందే అని కూడా కండిషన్లు ఉన్నాయని అంటున్నారు. అదే విధంగా ఎన్టీయార్ అంటే అన్నగా అంతా ఆయక కాళ్ళకు మొక్కేవారు. వదినమ్మగా తనకు కూడా కాళ్ళకు మొక్కాలని ఆమె అన్నారో లేక వారే చెప్పారో తెలియదు కానీ ఆమె కాళ్ళకు మొక్కడాలు కూడా ఆనాడు విశేషమైన ప్రచారంలో ఉంటూ వచ్చాయి.

మొత్తానికి చూస్తే ఎన్టీయార్ రాజకీయ జీవితం సాఫీగా సాగకుండా లక్ష్మీపార్వతి కూడా తనదైన చర్యలతో ఇబ్బంది పెట్టారని విమర్శలు అయితే ప్రత్యర్ధులు చేశారు. ఇక కుమారుల విషయానికి వస్తే బాలక్రిష్ణ కూడా ఎన్టీయార్ పక్షాన నిలబడకుండా బావ చంద్రబాబుతో కలసి ఎన్టీయార్ ని మోసం చేశారని పెద్దాయన తన గోడు అంతా ఆనాడు మీడియా ముందు చెప్పుకుని ఆవేదన చెందారు. దాని కంటే ముందు పార్టీలో ప్రభుత్వంలో లక్ష్మీపార్వతి జోక్యం లేకుండా చూస్తే తిరిగి ఎన్టీయార్ కి సీఎం పదవి ఇవ్వాలని కూడా ఒక ఒప్పందం ఉన్నా కుటుంబ సభ్యులు మాత్రం ఒక దశలో అంగీకరించకపోవడం వల్ల కూడా ఎన్టీయార్ మారినా కూడా వెన్నుపోటు మాత్రం దారుణంగా ఆయనకు జరిగింది అంటారు.

ఇక ఎన్టీయార్ ని వెన్నుపోటు పొడిచిన వారిలో సినిమా వారు కూడా ఉన్నారు. మోహాన్ బాబుకు ఎన్టీయార్ రాజ్యసభ మెంబర్ షిప్ ఇస్తే కీలకసమయంలో ఆయన కూడా చంద్రబాబు వైపే ఉన్నారు. ఇక జయప్రదను పార్టీలోకి రాజకీయాల్లోకి ఎన్టీయార్ తీసుకువస్తే ఆమె కూడా ఎన్టీయార్ కి కాకుండా బాబుకే సపోర్ట్ గా నాడు ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్టీయార్ ఎంతో ప్రేమించిన వారు ఫ్యామిలీ మెంబర్స్, సినీ వర్గాలు అంతా కూడా ఆనాటి వెన్నుపోటు ఎపిసోడ్ లో ఎదురు నిలిచి పెద్దాయనని నిస్సహాయుడిగా చేశారని చరిత్ర చెబుతున్న సత్యం.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.