Begin typing your search above and press return to search.

టీడీపీకి గ‌ల్లా దూర‌మ‌య్యారా? ఆ కేసే కార‌ణ‌మా?

By:  Tupaki Desk   |   13 Dec 2021 2:49 AM GMT
టీడీపీకి గ‌ల్లా దూర‌మ‌య్యారా? ఆ కేసే కార‌ణ‌మా?
X
టీడీపీ నాయ‌కుడు, గుంటూరు పార్ల‌మెంటు స్తానం నుంచి రెండు సార్లు వ‌రుస‌గా విజ‌యం ద‌క్కించుకున్న గ‌ల్లా జ‌య‌దేవ్.. ఇప్పుడు అదే పార్టీకి దూరంగా ఉన్నారా? ఆయ‌న పార్టీలో కార్య‌క్ర‌మాలకే కాకుండా.. కీల‌క‌మైన రాజధాన అమ‌రావ‌తి ఉద్య‌మానికి కూడా దూరంగా ఉన్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇదే విష‌యం పార్టీలోనూ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వాస్త‌వానికి గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ సునామీని త‌ట్టుకుని గెలిచిన నాయ‌కుల్లో గ‌ల్లా ఒక‌రు. ఆ త‌ర్వాత‌.. ఆయ‌న యాక్టివ్‌గానే ఉన్నారు. అమ‌రావ‌తి ఉద్య‌మం ప్రారంభించిన స‌మ‌యంలో `మిస్ట‌ర్ ప్రైమ్ మినిస్ట‌ర్‌` అంటూ పార్ల‌మెంటువేదిక‌గా.. అమ‌రావ‌తిని ర‌క్షించాల‌ని కోరారు. అదేస‌మ‌యంలో అమ‌రావ‌తి రాజ‌ధానికి నిదులు కూడా ఇవ్వాల‌న్నారు.

ఇక‌, అమ‌రావ‌తి రైతుల ఉద్య‌మానికి చాన్నాళ్లు క‌ర్త‌క‌ర్మ క్రియ‌గా కూడా వ్య‌వ‌హరించారు. నిధులు స‌మ‌కూర్చారు. క‌మిటీల‌ను ఏర్పాటు చేయ‌డంలోనూ కీల‌క పాత్ర పోషించారు. అసెంబ్లీ ముట్ట‌డికి రైతులు పిలుపునిస్తే.. పోలీసుల క‌ళ్లు గ‌ప్పి.. పొరుగు జిల్లాకు వెళ్లి.. అక్క‌డి నుంచి ఉద్య‌మంలోపాల్గొన్నారు. ఈ క్ర‌మంలో అరెస్టు కూడా అయ్యారు. ఆ త‌ర్వాత కూడా రాజ‌ధాని కోసం పోరు సాగించారు. ఇక‌, ఢిల్లీ వేదిక‌గా కూడా అమ‌రావ‌తి గ‌ళం వినిపించ‌డంలోను, రైతుల‌ను అమ‌రావ‌తి నుంచి ఢిల్లీకి తీసుకువెళ్లి.. జాతీయ నేత‌ల‌ను స‌మ‌న్వ‌యం చేయ‌డంలోను.. గ‌ల్లా పాత్ర‌ను త‌క్కువ చేసి చూసే ప‌రిస్థితి లేదు.

మ‌రోవైపు పార్టీ అధినేత చంద్ర‌బాబు క‌నుస‌న్న‌ల్లో మెలిగిన నాయ‌కుడిగా కూడా గ‌ల్లాకు ప్ర‌త్యేక స్థానం ఉంది. ఆయ‌న చేప‌ట్టిన అనేక ఉద్యమాల్లో గ‌ల్లా త‌న వంతు పాత్ర పోషించారు. వైసీపీ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాల‌పై వ్య‌తిరేక గ‌ళం వినిపించ‌డంలో ను... ప్ర‌జల త‌ర‌ఫున మాట్లాడడంలోనూ గ‌ల్లా ముఖ్య రోల్ పోషించారు. ఇంత‌గా పార్టీలోను.. ముఖ్య‌మైన అమ‌రావ‌తి రాజ‌ధాని ఉద్య‌మంలోనూ కీల‌క పాత్ర పోషించిన ఆయ‌న ఇప్పుడు అంటే.. దాదాపు ఆరేడు మాసాలుగా ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. అంతేకాదు.. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా అమ‌రావ‌తి రైతులు చేప‌ట్టిన న్యాయ‌స్థానం నుంచి దేవ‌స్థానం వ‌ర‌కు పాద‌యాత్ర‌లోనూ ఆయ‌న ఎక్క‌డా పాదం క‌దిపింది లేదు. క‌నీసం మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది కూడా లేదు.

దీనికి కార‌ణం ఏంటి? అంటే.. గ‌ల్లా కుటుంబానికి ప్ర‌ధాన ఆర్థిక వ‌న‌రుగా ఉన్న అమ‌ర‌రాజా కంపెనీపై వైసీపీ ప్ర‌భుత్వం కొర‌డా ఝ‌ళిపించ‌డ‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. క‌చ్చితంగా ఆరేడు మాసాల కింద‌.. చిత్తూరు శివారులోని అమ‌రరాజా కంపెనీ పొల్యూష‌న్‌కు కేంద్రంగా మారింద‌ని పేర్కొంటూ.. వైసీపీ స‌ర్కారు.. కేసులు న‌మోదు చేయించ‌డమే కాకుండా.. రాత్రికిరాత్రి తాళాలు వేసింది. దీనిపై గ‌ల్లా ఫ్యామిలీ కోర్టుకువెళ్లినా.. ప్ర‌భుత్వానికి అనుకూలంగా తీర్పు వ‌చ్చింది. దీంతో ఆ త‌ర్వాత ప‌రిణామాలు ఒక్క‌సారిగా మారిపోయాయి. గ‌ల్లా జ‌య‌దేవ్ ఇన్ యాక్టివ్ అయ్యారు. అస‌లు రాజ‌ధాని గురించి కూడా ప‌ట్టించుకోవ‌డం మానేశారు.(అంటే.. వైసీపీ వ్య‌తిరేకిస్తున్న దేనినీ ఆయ‌న ప్ర‌స్తావించ‌డం లేదు) దీనివెనుక‌.. హైద‌రాబాద్‌లోని కొంద‌రు.. ఏపీ ప్ర‌భుత్వంతో మ‌ధ్య‌వ‌ర్తిత్వం చేసుకున్నార‌ని.. ఈ క్ర‌మంలో గ‌ల్లాదూకుడు త‌గ్గిపోయింద‌ని .. ప‌రిశీల‌కులు భావిస్తుండ‌డం గ‌మ‌నార్హం.