Begin typing your search above and press return to search.

ట్రబుల్ షూటర్ హరీశ్ కు ఇన్ని అవమానాలా? గులాబీ పార్టీలో కొత్త చర్చ

By:  Tupaki Desk   |   16 Nov 2022 10:30 AM GMT
ట్రబుల్ షూటర్ హరీశ్ కు ఇన్ని అవమానాలా? గులాబీ పార్టీలో కొత్త చర్చ
X
తాను చేసే పనుల మీద ఫుల్ క్లారిటీతో పని చేసే ముఖ్యమంత్రుల్లో ఒకరు టీఆర్ఎస్ అధినేత.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. అవసరమైన వేళ దగ్గరకు తీసుకొని హత్తుకొని మరీ మాట్లాడే ఆయన కాసింత తేడా వచ్చినా పురుగును చూసినట్లుగా చూస్తూ పక్కకు రానివ్వకుండా చేసే వైనం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. రాజకీయ ప్రత్యర్థుల విషయంలో ఆయన కనికరం లేకుండా వ్యవహరించే గులాబీ బాస్ కు తన సొంత పార్టీలోని కొందరి విషయంలోనూ అలాంటి తీరునే ప్రదర్శించటం ఆయనకే సాధ్యమని చెప్పాలి.

స్వయంగా మేనల్లుడు.. పార్టీ పెట్టిన నాటి నుంచి తన కోసం.. తన పార్టీ కోసం బండలా శ్రమించే హరీశ్ రావు కష్టం గురించి.. ఆయన కమిట్ మెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాల్టి రోజున హరీశ్ పాత్ర పరిమితంగా ఉండొచ్చు కానీ.. పార్టీ పెట్టిన వేళలో టీఆర్ఎస్ కోసం ఆయన పడిన కష్టం అంతా ఇంతా కాదన్న విషయం చాలామంది పాత్రికేయులు దగ్గర నుంచి చూశారు. అలాంటి హరీశ్ ను కూరలో కరివేపాకు మాదిరి వాడేసే వైనంపై టీఆర్ఎస్ పార్టీలో తరచూ చర్చ జరుగుతూ ఉంటుంది. తాజాగా కేసీఆర్ తీరు కారణంగా..ఈ చర్చకు మరోసారి ఛాన్సు ఇచ్చినట్లైంది.

తెలంగాణ వ్యాప్తంగా కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభించే కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించిన ముఖ్యమంత్రి.. తాము సాధించిన ఘనతను పత్రికా ముఖంగా భారీ ఎత్తున ప్రకటనలు ఇవ్వటం ద్వారా డెవలప్ మెంట్ బాటలో తెలంగాణ అన్న భావన కలిగేలా ఫుల్ పేజీ యాడ్లు కుమ్మరించేశారు.

ఇదంతా బాగానే ఉంది. ఆ పూర్తి పేజీ ప్రకటనను చూసినప్పుడు నిలువెత్తు ముఖ్యమంత్రి ఫోటో వేసుకోవటంలో తప్పు కనిపించదు. కానీ.. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖకు మంత్రిగా వ్యవహరిస్తున్న ఆయన మేనల్లుడు తన్నీరు హరీశ్ రావు ఫోటోను వేయకపోవటం చూసినప్పుడు.. కేసీఆరా మజాకానా? అన్న విషయం అర్థమవుతుంది.

పార్టీకి.. తనకు అవసరమైన ప్రతిసారీ వాడేసే హరీశ్ విషయంలో ఇలా వ్యవహరించటం ఏమిటి? అన్నది ప్రశ్నగా మారింది. ఇదే విషయం టీఆర్ఎస్ నేతల మధ్య చర్చకు తెర తీసింది. కేసీఆర్ తీరును చూస్తే.. హరీశ్ ను కూరలో కరివేపాకు గుర్తుకు వస్తుందన్న మాటతో పాటు.. టీఆర్ఎస్ కు రానున్న రోజుల్లో మరో ఈటెల మాదిరి హరీశ్ మిగులుతారన్న వ్యాఖ్య పలువురి నోట వినిపిస్తుండటం గమనార్హం.

మొత్తంగా ఈ ఎపిసోడ్ లో హరీశ్ కు ఫుల్ మార్కులు పడితే.. ముఖ్యమంత్రి కేసీఆర్ కు మాత్రం మైనస్ మార్కులు పడినట్లుగా చెబుతున్నారు. హరీశ్ విషయంలో కేసీఆర్ ప్రదర్శించే వివక్ష రానున్న రోజుల్లో మరిన్ని రాజకీయ పరిణామాలకు కారణమవుతుందన్న మాట వినిపిస్తుండటం గమనార్హం.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.