Begin typing your search above and press return to search.

వెంక‌య్య నాయుడి వార‌సుడిగా అత‌డిని గుర్తించిన‌ట్టేనా?

By:  Tupaki Desk   |   18 Aug 2022 11:30 PM GMT
వెంక‌య్య నాయుడి వార‌సుడిగా అత‌డిని గుర్తించిన‌ట్టేనా?
X
ద‌క్షిణ భార‌త‌దేశంలో ఇన్నాళ్లూ బీజేపీకి పెద్ద దిక్కుగా ఉంటూ వ‌చ్చారు.. వెంక‌య్య నాయుడు. ఆంగ్లం, తెలుగు, హిందీ భాష‌ల్లో అసాధార‌ణ ప‌ట్టు, అంత్య ప్రాస‌ల‌తో చ‌తురోక్తుల‌తో ప్ర‌సంగించ‌గ‌ల నేర్పు, అట‌ల్ బిహారి వాజ‌పాయిలాగా అద్బుతంగా ప్ర‌సంగించ‌గ‌ల దిట్ట‌.. వెంక‌య్య నాయుడు. అంతేకాకుండా విష‌య ప‌రిజ్ఞానమూ ఎక్కువే. ప్ర‌తిప‌క్ష పార్టీల‌పై సాధికారికంగా విమ‌ర్శ‌లు చేయ‌గ‌ల అతికొద్ది మంది నేత‌ల్లో ఆయ‌న కూడా ఒక‌రు.

ఈ నేప‌థ్యంలోనే వెంకయ్య నాయుడి సేవ‌ల‌ను బీజేపీ చ‌క్క‌గా వినియోగించుకుంది. ప‌లుమార్లు ఆయ‌న‌ను క‌ర్ణాట‌క నుంచి రాజ్య‌స‌భ స‌భ్యుడిగా పంపింది. అంతేకాకుండా కేంద్ర కేబినెట్ మంత్రిగానూ తీసుకుంది. ఆ త‌ర్వాత పార్టీకి జాతీయ అధ్య‌క్షుడిని కూడా చేసింది. చివ‌ర‌కు ఇటీవ‌ల కాలం వ‌ర‌కు త‌మ‌కు రాజ్య‌స‌భ‌లో మ‌ద్ద‌తు లేక‌పోవ‌డంతో వెంక‌య్య నాయుడిని ఉప‌రాష్ట్ర‌ప‌తిని కూడా చేసింది. త‌ద్వారా రాజ్య‌స‌భ‌కు చైర్మ‌న్‌గా చేసింది.

గ‌త ఐదేళ్ల‌పాటు ఉప‌రాష్ట్ర‌ప‌తిగా, రాజ్య‌స‌భ చైర్మ‌న్‌గా వెంకయ్య అంచ‌నాల‌కు మించి రాణించార‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. ఈ ఆగ‌స్టులో వెంక‌య్య ప‌ద‌వీ కాలం ముగిసింది. దీంతో బీజేపీ అత్యున్న‌త విధాన నిర్ణ‌య‌క విభాగ‌మైన పార్ల‌మెంట‌రీ బోర్డులోకి క‌ర్ణాట‌క మాజీ సీఎం య‌డియూర‌ప్పను ఎంపిక చేసింది. వ‌చ్చే ఏడాది మేలో క‌ర్ణాట‌క‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో మ‌రోమారు య‌డియూర‌ప్ప చ‌రిష్మాపైనే బీజేపీ ఆధార‌ప‌డింది. క‌ర్ణాట‌క‌లో 17 శాతం ఉన్న లింగాయ‌త్ సామాజిక‌వ‌ర్గం మొత్తం య‌డియూర‌ప్ప వైపు న‌డుస్తోంది. య‌డియూర‌ప్ప కూడా లింగాయ‌తే కావడం గ‌మ‌నార్హం.

ఈ నేప‌థ్యంలో తాజాగా బీజేపీ పార్ల‌మెంట‌రీ బోర్డులోకి య‌డియూర‌ప్పను బీజేపీ అధిష్టానం ఎంపిక చేసింది. అంతేకాకుండా ఆయ‌న‌కు బీజేపీ సెంట్ర‌ల్ ఎల‌క్ష‌న్ క‌మిష‌న్‌లోనూ అవ‌కాశం ద‌క్కింది. బీజేపీ అత్యున్న‌త విభాగ‌మైన పార్ల‌మెంట‌రీ బోర్డులో 11 మంది స‌భ్యుల‌కు మాత్ర‌మే అవ‌కాశం ఉండ‌గా య‌డియూర‌ప్పకు పెద్ద‌పీట వేయ‌డం గ‌మనార్హం.

దక్షిణ భార‌త‌దేశంలో తొలిసారిగా 2008లో బీజేపీని అధికారంలోకి తెచ్చిన ఘ‌న‌త య‌డియూర‌ప్ప‌కే ద‌క్కుతోంది. ప‌లుమార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన ఆయ‌న అవినీతి ఆరోప‌ణ‌లు, వృద్ధాప్య స‌మ‌స్య‌లు త‌దిత‌ర కార‌ణాల‌తో సీఎం ప‌ద‌వి నుంచి త‌ప్పుకున్నారు. అప్పుడు కూడా య‌డియూర‌ప్ప సూచించిన బ‌స‌వ‌రాజ బొమ్మైకే క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి పీఠం ద‌క్కింది.

వాస్త‌వానికి బీజేపీలో 75 ఏళ్లు వ‌య‌సు దాటిన‌వారిని ప‌క్క‌న‌పెట్టేస్తున్నారు. వీళ్ల‌కి పార్ల‌మెంటు టికెట్లు, గ‌వ‌ర్న‌ర్ గిరీలు కేటాయించ‌డం లేదు. అయితే య‌డ్యూర‌ప్ప‌కు మాత్రం 75 ఏళ్ల వ‌య‌సు దాటినా ఆ నిబంధ‌న‌ను ప‌ట్టించ‌కోకుండా ఆయ‌న‌ను పార్ల‌మెంట‌రీ బోర్డులోకి, బీజేపీ కేంద్ర ఎన్నిక‌ల సంఘంలోకి తీసుకుంది.

త‌ద్వారా వెంక‌య్య నాయుడు లేని లోటును య‌డ్యూర‌ప్ప ద్వారా భ‌ర్తీ చేసుకోవాల‌ని బీజేపీ ప్ర‌య‌త్నిస్తోంద‌ని చెబుతున్నారు. వెంక‌య్య నాయుడికి ప‌ద‌వీకాలం ముగియ‌డంతో ఉప‌రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వి నుంచి త‌ప్పుకున్నారు. దీంతో వెంక‌య్య నాయుడు స‌ల‌హాలు, సూచ‌న‌లను బీజేపీ వినియోగించుకుంటోంద‌ని చెబుతున్నారు. దక్షిణాదిలో బీజేపీని బలోపేతం చేయడానికి వెంక‌య్య చెప్పేవాటిని గ‌ట్టిగా ప‌రిగ‌ణ‌లన‌లోకి తీసుకుంటోంద‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే య‌డియూర‌ప్పకు ప్రాధాన్య‌త క‌ల్పించింద‌ని చెబుతున్నారు.