Begin typing your search above and press return to search.

నర్సాపురం వైసీపీ ఎంపీ అభ్యర్ధి ఆయనేనా...?

By:  Tupaki Desk   |   17 Dec 2022 9:30 AM GMT
నర్సాపురం వైసీపీ ఎంపీ అభ్యర్ధి ఆయనేనా...?
X
ఏపీలో వచ్చే ఎన్నికల్లో ఆసక్తిని కలిగించే పార్లమెంట్ నియోజకవర్గాలలో కచ్చితంగా నర్సాపురం ఉంటుంది. మామూలుగానే రాజకీయ చైతన్యం కలిగిన ఈ సీటు ఈసారి మరింత ప్రతిష్టాత్మకం కానుంది. దానికి కారణం ఇక్కడ 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున ఎంపీగా పోటీ చేసి గెలిచిన రఘురామ క్రిష్ణం రాజు ఆరు నెలల వ్యవధిలోనే రెబెల్ గా మారారు. జగన్ కి ఎదురు తిరిగి ఢిల్లీలో రచ్చబండ మీటింగ్స్ పెట్టి రచ్చ రచ్చ చేస్తున్నారు.

జగన్ మాజీ సీఎం కావాలని రఘురామ గట్టిగా తపిస్తున్నారు. ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు జనసేనాని పవన్ కళ్యాణ్ తో ఆయన సన్నిహితంగా ఉంటున్నారు. ఆ మధ్య ఢిల్లీలో బాబుని కలసి మరీ వచ్చారు. జగన్ మీద డైలీ రాజకీయ విమర్శలు గుప్పించే రఘురామ విషయంలో జగన్ చాలా పట్టుదలగా ఉన్నారని అంటున్నారు. ఆరు నూరు అయినా ఆయన్ని ఓడించి తీరాలని సంకల్పించారని అంటున్నారు.

రఘురామ నియోజకవర్గంలో ఇప్పటికే ఇంచార్జిగా మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు కుమారుడు రామరాజుని నియమించిన జగన్ వారితోనే అక్కడ పార్టీ వ్యవహారాలను నడిపిస్తున్నారు. గోకరాజు ఫ్యామిలీకి మంచి పరిచయాలు పలుకుబడి ఉన్నాయి. 2014 ఎన్నికల్లో బీజేపీ టీడీపీ పొత్తుల ఈ సీటు నుంచి గోకరాజు గంగరాజు గెలిచారు. 2019 నాటికి ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. ఇక 2024 నాటికి గంగరాజు కుమారుడు రామరాజుకు వైసీపీ టికెట్ ఇస్తారని అంటున్నారు. ఇక్కడ కాపులకు కూడా టికెట్ ఇవ్వాలని ఒక ప్రతిపాదన ఉన్నప్పటికీ క్షత్రియ స్థావరం అయిన ఈ సీటు నుంచి వారినే నిలబెడితేనే మంచి ఫలితాలు వస్తాయని వైసీపీ ఆలోచిస్తోందిట.

కాగా తాజాగా గోకరాజు గంగరాజు మనవడు ఆదిత్య వర్మ వివాహ రిసెప్షన్ కి జగన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న క్షత్రియ సామాజికవర్గం నేతలు అందరితో ఆయన కలుపుగోలుగా వ్యవహరించారు. జగన్ని గోకరాజు ఫ్యామిలీ బాగా రిసీవ్ చేసుకుంది. దాంతో జగన్ ఆయన ఫ్యామిలీకే టికెట్ ఇస్తారని అంటున్నారు. అంగబలం, అర్ధబలం దండీగా ఉన్న గోకరాజు కుటుంబం బరిలో ఉంటే వైసీపీ దన్నుతో మరోసారి నర్సాపురం సీటుని గెలుచుకోవాలని జగన్ స్కెచ్ గీస్తున్నారు.

ఇదిలా ఉంటే నర్సాపురం నుంచి రఘురామ క్రిష్ణం రాజు టీడీపీ జనసేనల ఉమ్మడి అభ్యర్ధిగా నిలబడాలని చూస్తున్నారు. అందుకే ఇద్దరు అధినేతలతోనూ ఆయన మంచి రిలేషన్స్ మెయింటెయిన్ చేస్తున్నారు. ఇక జనసేన సొంతంగా పోటీ చేయాలనుకుంటే మాత్రం పవన్ సోదరుడు నాగబాబు మరోసారి నర్సాపురం నుంచి ఎంపీగా రంగంలోకి దిగుతారు అని అంటున్నారు. రఘురామకు టీడీపీ నుంచి టికెట్ దక్కుతుందా అన్న చర్చ కూడా ఉంది. ఏది ఎలా ఉన్నా నర్సాపురం లో మాత్రం మరోసారి వైసీపీ జెండా ఎగరేయాల్సిందే అని జగన్ ఆలోచిస్తున్నారు అని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.