Begin typing your search above and press return to search.

సొంత డబ్బులు ఇవ్వటమే పవన్ చేసిన నేరమా?

By:  Tupaki Desk   |   25 April 2022 5:30 PM GMT
సొంత డబ్బులు ఇవ్వటమే పవన్ చేసిన నేరమా?
X
అమ్మ పెట్టాపెట్టదు.. అడుక్కోనివ్వదంటూ తెలుగులో ఒక సామెత ఉంది. ఇప్పుడు ఏపీ రాజకీయాల్ని చూస్తే అలాంటి తీరే కనిపించక మానదు. సంక్షేమ పథకాలకు కేరాఫ్ అడ్రస్ గా చెప్పుకుంటూ.. విలువ ప్రజాధనాన్ని పప్పుబెల్లాల మాదిరి పంచేసే వైసీపీ సర్కారు.. కౌలురైతుల ఆత్మహత్యలపై ఎందుకు స్పందించలేదు? వారికి అండగా ఎందుకు నిలవలేదు? కేవలం ఓట్లు.. ఓటు బ్యాంకు లక్ష్యంగా సంక్షేమ పథకాల్ని తెర మీదకు తీసుకురావటం హడావుడి చేయటం మినహా మరింకేమీ కనిపించని పరిస్థితి.

ఇలాంటి వేళలో.. రాజకీయాల సంగతి ఎలా ఉన్నా.. తన సొంత డబ్బులతో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాల వద్దకు వెళ్లి.. ఒక్కో కుటుంబానికి రూ.లక్షచొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.

భారీగా సంక్షేమ పథకాల్ని అమలు చేస్తూ.. వేలాది కోట్లు ఖర్చు పెట్టే జగన్ సర్కారు.. ఆత్మహత్య చేసుకున్న కౌలురైతు కుటుంబాలకు ఏం చేశారు? ఎలాంటి సాయం చేశారు? అన్న ప్రశ్నల్ని సంధిస్తే సమాధానం రాని పరిస్థితి. ఒక ప్రభుత్వంగా చేయాల్సిన పనిని చేయకుండా వదిలి వేసిన వేళ.. అందుకు భిన్నంగా వ్యక్తిగా.. ఒక పార్టీ అధినేతగా ప్రజల వద్దకు వెళ్లి వారికి అపన్నహస్తాన్ని అందించటమే కాదు.. వారికి ఆర్థికంగా దన్నుగా నిలిచేందుకు చేస్తున్న ప్రయత్నాల్ని పొగడకున్నా ఫర్లేదు.. తెగడకుంటే చాలు. కానీ.. అలాంటిదేమీ లేకుండా ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతులకు ఆర్థిక సాయాన్ని చేస్తున్న పవన్ తీరు వైసీపీ నేతలకు మింగుడుపడటం లేదు.

అధికారంలో ఉన్న తాము చేయాల్సిన పనిని.. పవన్ ముందే మొదలు పెట్టేసి భారీగా పేరు ప్రఖ్యాతుల్ని సొంతం చేసుకోవటం వైసీపీ నేతలకు ఏ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ కారణంతో ఒకరు మూడు పెళ్లిళ్లు అంటూ పనికిమాలిన మాటల్ని మొదలు పెడితే.. మరొకరు రైతుల గురించి మాట్లాడే హక్కు పవన్ కు లేదంటూ నొక్కి వక్కాణిస్తున్నారు మంత్రి గుడివాడ అమర్ నాథ్.

తమ కుటుంబం 1978 నుంచి రాజకీయాల్లో ఉందని.. రైతుల గురించి మాట్లాడే హక్కు ఆయనకు లేదనే అమర్ నాథ్ మర్చిపోతున్న విషయం ఒకటి ఉంది. రాజకీయాల్లో ఎప్పటి నుంచి ఉన్నామన్న దాని కంటే కూడా ఉండి ఏం చేశామన్నది చాలా కీలకం. దాదాపు యాభై ఏళ్లుగా (సరిగ్గా చెప్పాలంటే 45 ఏళ్లు) రాజకీయాల్లో ఉండి.. రైతుల సమస్యలు తెలిసినప్పుడు ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు మంత్రిగారి జేబులో నుంచి రూపాయి తీసి.. వారి కుటుంబానికి ఇచ్చారా? అన్నది ప్రశ్న.

ఇదేమీ చేయలేక.. తన వంతు సాయంగా ఆర్థిక చేయూతను ఇస్తున్న పవన్ కు.. చంద్రబాబును లింకేసి.. ఆయన డైరెక్షన్ లో నడుస్తున్నట్లుగా చేస్తున్న ప్రచారం చూస్తే.. ఇన్నేళ్లుగా రాజకీయంలో ఉండి నేర్చుకున్నది ఇదేనా అమర్ నాథ్ అన్న సందేహం రాక మానదు. నిజం కాదంటారా?