Begin typing your search above and press return to search.

ఇక అనవసరంగా హారన్ కొట్టినా నేరమే?

By:  Tupaki Desk   |   22 Aug 2022 5:30 PM GMT
ఇక అనవసరంగా హారన్ కొట్టినా నేరమే?
X
అవసరం ఉన్నా లేకున్నా.. రోడ్డుపైకి వస్తే చాలు ఏది అడ్డం వచ్చినా హారన్ కొడుతూ రొద పుట్టిస్తుంటారు. కొత్త బండి అని కూడా కొందరు హారన్ కొడుతూ షో చేస్తుంటారు. అయితే ఇకపై అలా కుదరదని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేస్తున్నారు. అనవసరంగా హారన్ నొక్కితే ఫైన్ తప్పదంటున్నారు.

హైదరాబాద్ లో హారన్ కొట్టి చిరాకు తెప్పించే కొంతమంది ఆటలు ఇక సాగవు. హారన్ కొడుతూ ఇతర వాహనదారులను ఇబ్బంది పెట్టేవారికి షాకిచ్చేలా పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. అనవసరంగా హారన్ కొట్టడాన్ని నిషేధిస్తున్నట్టు సైబరాబాద్ పోలీసులు ప్రకటించారు.

మీరు లేదా ఇతర వాహనదారుడు ప్రమాదంలో ఉన్నాడు అని తెలిసినప్పుడు మాత్రమే హారన్ కొట్టాలి అని పోలీసులు తెలిపారు. మోటార్ వెహికల్ రెగ్యులేషన్ 2017 23(2) ప్రకారం అనవసరంగా హారన్ కొడితే ఫైన్ వేస్తామని హెచ్చరించారు. అయితే ఎంత ఫైన్ వేస్తారన్నది మాత్రం చెప్పలేదు. నిబంధనల ప్రకారం ఈ ఫైన్ ఉంటుందని మాత్రం తెలుస్తోంది.

దీనికోసం ఇప్పటికే దేశంలోనే మొదటిసారిగా అకౌస్టిక్ కెమెరాలను హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేశారు. నిర్ధేశిత పరిమితికి మించి ఏ వాహనం నుంచైనా హారన్ మోగితే కెమెరాలు గుర్తిస్తాయి. మూడు సెంకడ్ల పాటు ఓ వీడియో తీసి కంట్రోల్ రూమ్ కు పంపిస్తాయి. అక్కడి నుంచి వెంటనే ఆ వాహనం నంబర్ పేరిట ఓ చలాన్ వస్తుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తారు. ఒకవేళ ఎక్కువ చలాన్లు ఉంటే కేసు కూడా నమోదు చేసే ఛాన్స్ ఉంది.

సౌండ్ పొల్యూషన్ తగ్గించేందుకు ఇలాంటి ఏర్పాట్లు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. ఈ సాంకేతికతను జర్మనీకి చెందిన ఎకోమ్ సంస్థ అభివృద్ధి చేసింది. 72 మైక్రోఫోన్లు కలిగి ఉండి గరిష్టంగా 20 మీటర్ల దూరంలో ఉన్న వాహనాల శబ్ధ కాలుష్యాన్ని ఇది కనిపెడుతుంది. కనిష్టంగా 20 డెసిబుల్స్ నుంచి గరిష్టంగా 20వేల డెసిబుల్స్ వరకూ శబ్ధాలను గుర్తిస్తుంది. సౌండ్ పొల్యూషన్ తగ్గించే క్రమంలోనే వీటిని ఏర్పాటు చేస్తున్నారు.