Begin typing your search above and press return to search.

పెగాసస్ వాడినట్లు నిర్ధారణైందా?

By:  Tupaki Desk   |   21 May 2022 6:30 AM GMT
పెగాసస్ వాడినట్లు నిర్ధారణైందా?
X
ఆమధ్య దేశాన్ని ఒక ఊపుఊపేసిన పెగాసస్ స్పైవేర్ సాఫ్ట్ వేర్ ను కేంద్రప్రభుత్వం వాడింది నిజమేనా ? సుప్రింకోర్టు నియమించిన కమిటి పరోక్షంగా వెల్లడించిన విషయాన్ని గమనిస్తే ఈ విషయమే అర్ధమవుతోంది. పెగాసస్ స్పైవేర్ ను ప్రయోగించి ప్రతిపక్షపార్టీల నేతల మొబైళ్ళతో పాటు ఇతర రంగాల్లోని ప్రముఖుల ఫోన్లను కూడా నరేంద్రమోడి సర్కార్ ట్యాపింగ్ చేయించిందనే ఆరోపణలు ఆమధ్య దేశంలో పెద్దగా దుమారంరేపింది.

కేంద్రప్రభుత్వం ట్యాపింగ్ చేయించిన ఫోన్లనో జడ్జీలు, పాత్రికేయులు, హక్కుల సంఘాల కార్యకర్తలు, సెలబ్రిటీలు, ప్రతిపక్షాల ముఖ్యమంత్రులు, ఎంపీలు, కీలక నేతలతో పాటు చివరకు పై రంగాల్లోని ప్రముఖుల పీఏలు, డ్రైవర్లు కూడా ఉన్నారనే తీవ్రమైన ఆరోపణలున్నాయి. ఇదే విషయమై పార్లమెంటులో ఎంత గోలజరిగినా కేంద్రమైతే ఎలాంటి సమాధానం చెప్పలేదు. దాంతో పాత్రికేయులు సుప్రింకోర్టులో కేసువేశారు. కేసుపై విచారణ జరపిన సుప్రింకోర్టు కేంద్రప్రభుత్వానికి నోటీసులిచ్చింది.

సుప్రిం విచారణలో కూడా స్పైవేర్ విషయంలో కేంద్రం ఏమీ చెప్పలేదు. దాంతో మండిపోయిన సుప్రింకోర్టు తనంతట తానుగానే విచారణకు ఒక కమిటిని నియమించింది. ఆ కమిటికి కేంద్రం పెద్దగా సహకరించటంలేదు.

ఈ నేపధ్యంలోనే కమిటి విచారణను మరో నెలపాటు పొడిగిస్తు సుప్రింకోర్టు నిర్ణయించింది, ఈ సందర్భంలోనే కొన్ని అంశాలు వెలుగుచూశాయి. స్పైవేర్ ప్రభావానికి గురైన 29 ఫోన్ల పరిశీలన జరుగుతోందని కమిటి చెప్పింది. అంటే పెగాసస్ స్పైవేర్ ను కేంద్రం వాడిందని దాదాపు నిర్ధారణైనట్లే.

నాలుగువారాల్లో పరిశీలన పూర్తయిపోతుందని కూడా కమిటి సుప్రింకోర్టుకు చెప్పింది. కమిటిలో టెక్నాలజీ నిపుణులు కూడా ఉండటంతో నివేదిక పక్కాగా తయారవుతుందనే అందరు అనుకుంటున్నారు.

స్పైవేర్ వాడినట్లు శాస్త్రీయంగా నిర్ధారణయితే అప్పుడు కేంద్రం ఏమంటుంది ? నివేదిక ఆధారంగా సుప్రింకోర్టు ఏమని ఆదేశిస్తుంది ? అనేది ఆసక్తిగా మారింది. పెగాసస్ ను కేంద్రం ఎప్పుడు కొన్నది, ఎంతకు కొన్నదనే విషయాలను కూడా కమిటికి అందించింది. ఇంత జరుగుతున్నా కేంద్రం మాత్రం స్పైవేర్ పై నోరిప్పటంలేదు.