Begin typing your search above and press return to search.

రామానుజుల విగ్ర‌హం.. చిన‌జీయ‌ర్ స్వామి క‌ష్టం ఇంతింత కాద‌యా!

By:  Tupaki Desk   |   5 Feb 2022 9:47 AM GMT
రామానుజుల విగ్ర‌హం.. చిన‌జీయ‌ర్ స్వామి క‌ష్టం ఇంతింత కాద‌యా!
X
మ‌నుషులు అంద‌రూ ఒక‌టేన‌ని.. కులాలు,.. వ‌ర్ణ విచ‌క్ష‌ణ అనేవి మ‌నం పెట్టుకున్న‌వేన‌ని. ప్రపంచానికి సమతా సిద్ధాంతాన్ని నేర్పించిన గురువు. కులమతాలకతీతంగా మనుషులంతా ఒక్కటేనని చాటిన ఐక్యతామూర్తి. విశిష్టాద్వైతాన్ని ప్రబోధించిన మహనీయుడు రామానుజాచార్యులు. ఆ మహానుభావుడు అవతరించి వెయ్యేళ్లు పూర్తయిన సందర్భం..మరో వెయ్యేళ్లు సమతా సిద్ధాంతాన్ని చాటే అత్యద్భుత ఘట్టం శ్రీరామానుజాచార్య సహస్రాబ్ది సమారోహ మహోత్సవం.

హైద‌రాబాద్ శివారు.. ముచ్చింత‌ల్‌లో ఉన్న‌ శ్రీరామనగరంలోని సమతాస్ఫూర్తి కేంద్రంలో ప్రతిష్ఠించిన రామానుజాచార్య విగ్రహావిష్కరణ ప్రధాని మోడీ చేతుల మీదుగా జరగనుంది. అయితే.. ఈ విగ్ర‌హ స్థాప‌న‌కు న‌డుంబిగించిన శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన‌జీయ‌ర్ స్వామి చూపిన శ్ర‌ద్ధ‌, ప‌డిన క‌ష్టం అంతా ఇంతా కాదు. ఎంతో శ్ర‌మించారు. ఎంద‌రినో క‌లిశారు. ఎన్నో క‌ల‌లు క‌న్నారు. చివ‌ర‌కు సాకారం చేసుకున్నారు. ఆ విశేషాలు ఇవీ..

చిన‌జీయ‌ర్ స్వామికి... 2013లో మొదలైన ఆలోచనల నేప‌థ్యంలో.. 2014 మేలో విగ్రహ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. తొలుత రామానుజాచార్యుల శ్రీమూర్తి 14 రకాల నమూనాలను చినజీయర్‌స్వామి తయారు చేయించారు. అందులో మూడింటిని ఎంపిక చేసి, వాటిలో బాగా వచ్చిన రూపురేఖలను మిళితం చేసి, మరో నమూనా తయారు చేశారు. దానికి బెంగళూరులో 3డీ స్కానింగ్‌ చేయించారు. దాంతో ఆబ్జెక్టు ఫైల్‌ తయారు చేయించారు. దాన్ని తీసుకువచ్చి ప్రత్యేకంగా వర్క్‌స్టేషన్‌ తీసుకుని మాయ, మడ్‌బ్రష్‌ సాఫ్ట్‌వేర్లు వినియోగించి మరింత సుందరంగా మలిచారు.

యజ్ఞోపవీతం, శిఖ, గోళ్లు, వేళ్లు, వస్త్రం వంటి సూక్ష్మ అంశాలు కూడా జాగ్రత్తగా తీర్చిదిద్దారు. ప్రధాన స్థప తి ఆధ్వర్యంలో దాదాపు 22 రోజులపాటు నిత్యం 18 నుంచి 19 గంటలపాటు శ్రమించారు. చినజీయర్‌స్వా మి రోజూ రెండు, మూడు గంటలు కేటాయించి సంప్రదాయ, శాస్త్ర, కొలతలకు సంబంధించిన సూచనలి స్తూ, సాఫ్ట్‌వేర్‌ ఫైల్‌ తయారు చేయించారు. సాఫ్ట్‌వేర్‌ ఫైల్‌ను చైనాలోని ఏరోసెన్‌ కార్పొరేషన్‌కు పంపి, క్యాస్టింగ్‌, అసెంబ్లింగ్‌ పనులు అప్పగించారు. ప్రత్యేక యంత్రం సాయంతో రోబోటిక్‌ పరిజ్ఞానం వినియోగించి థర్మోకోల్‌తో 1:10 మోడల్‌ (సుమారు 16 నుంచి 17 అడుగుల ఎత్తు)లో నమూనా విగ్రహం తయారు చేయించారు.

చినజీయర్‌స్వామి చైనా వెళ్లి దాన్ని పరిశీలించి సవరణలు చెప్పారు. తర్వాత మరిన్ని సవరణలతో మరో సాఫ్ట్‌వేర్‌ ఫైల్‌ను చైనా పంపించారు. మరోసారి థర్మోకోల్‌ను 1:1 మోడల్‌గా కత్తిరించి 20 అడుగుల విగ్రహం తయారు చేశారు. ప్రధాన స్థపతి బృందం వెళ్లి సవరణలు చేసి క్యాస్టింగ్‌కు అనుమతించారు. అలా 1600 ముక్కలుగా తయారు చేసి.. తీసుకువచ్చి.. అప్పటికే ముచ్చింతల్‌లో తయారైన స్టీల్‌ నిర్మాణంపై లేయర్ల వారీగా అతికించారు. ఏరోసెన్‌ కార్పొరేషన్‌కు చెందిన 70 మంది నిపుణుల బృందం వచ్చి విగ్రహానికి రూపునిచ్చింది. మొత్తం ఈ ప్రక్రియకు 15 నెలలు పట్టింది.