Begin typing your search above and press return to search.

కవిత గెలుపు కష్టమేనా?

By:  Tupaki Desk   |   10 April 2019 4:22 AM GMT
కవిత గెలుపు కష్టమేనా?
X
తెలంగాణలోని లోక్ సభ ఎన్నికల్లో ఈసారి నిజామాబాద్ సీటు హాట్ హాట్‌గా మారింది. అక్కడ 175 మందికిపైగా రైతులు పోటీ చేస్తుండంతో సీఎం కేసీఆర్ తనయ భవిష్యత్తు, గెలుపు డోలాయమానంలో పడింది. మంగళవారం అక్కడ పోటీ చేస్తున్న రైతులు భారీ ర్యాలీ ఒకటి నిర్వహించారు. అక్కడి పసుపు, జొన్న రైతుల చిరకాల డిమాండ్లను పట్టించుకోని నాయకులను తిరస్కరించాలని.. వారిని ఓడించాలని ఇక్కడి రైతులు పిలుపునిచ్చారు.

రైతు ఐక్య వేదిక పేరుతో ఇక్కడ పోటీ చేస్తున్న రైతులంతా కలిసి కట్టుగా ర్యాలీ నిర్వహించారు. ఇక్కడి రైతుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రెండూ దారుణంగా విఫలమయ్యాయని.. మోసం చేశాయని వారు ఆరోపిస్తున్నారు.

ఈ సందర్భంగా రైతు సంఘాల నేతలు మాట్లాడుతూ.. రైతులు తమ సమస్యలపై పోరాడుతున్న రైతులకే ఓట్లేయాలని వారు పిలుపునిచ్చారు. నిజామాబాద్ స్థానానికి మొత్తం 185 మంది పోటీ పడుతుండగా అందులో 178 మంది రైతులే. ఇక్కడ ఏప్పిల్ 11న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నియోజకవర్గంలో సుమారు 15.5 లక్షల మంది ఓటర్లు ఉండగా అందులో 3.73 లక్షల మంది రైతులే. ఇక్కడి రైతుల్లో ఎక్కువ మంది పసుపు, ఎర్రజొన్నలు పండిస్తారు. వారంతా తమ సమస్యలపై పోరాడుతూ పరిష్కారం కాకపోవడంతో కవితపై పోటీకి దిగారు. పసుపు క్వింటాలుకు రూ.12 వేలు.. ఎర్రజొన్నకు రూ. 3500 మద్దతు ధర ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో అభ్యర్థులు ఉండడంతో ప్రతి పోలింగ్ స్టేషన్లో 12 ఈవీఎంలు వాడుతున్నారు. ఈ నేపథ్యంలో కవిత గెలుపు కష్టమేనని వినిపిస్తోంది.