Begin typing your search above and press return to search.

కదిలించి అనిపించుకోవటం ఎర్రబెల్లికి సరదానా?

By:  Tupaki Desk   |   11 April 2021 4:50 AM GMT
కదిలించి అనిపించుకోవటం ఎర్రబెల్లికి సరదానా?
X
పవర్ చేతిలో ఉన్నప్పుడు ఆచితూచి అన్నట్లు వ్యవహరించాలి. అందునా.. పార్టీ పరంగా ఒకటే అయినా..రాజకీయంగా చూసినప్పుడు ఇరువురి మధ్య సంబంధాలు సరిగా లేనప్పుడు ఆచితూచి అన్నట్లు వ్యవహరించాలి. అందుకు భిన్నంగా వ్యవహరిస్తే మొదటికే మోసం వస్తుంది. తాజాగా తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు తాజాగా అలాంటి అనుభవమే ఎదురైంది.

హన్మకొండలో ఏర్పాటు చేసిన ఒక సమావేశానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. ఉమ్మడి వరంగల్ జిల్లా డోర్నకల్ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రెడ్యా మాట్లాడుతూ.. ఉమ్మడి వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు తన నియోజకవర్గానికి తగిన ప్రాధాన్యత ఇవ్వటం లేదన్నారు. కొత్త డీసీసీబీ బ్రాంచీల ఏర్పాటు తన నియోజకవర్తగంలోని కువికి అవకాశం ఇవ్వలేదన్నారు.

దీనిపై స్పందించిన మంత్రి ఎర్రబెల్లి.. మీరు రాష్ట్ర మంత్రిగా ఉన్నప్పుడు మీ ప్రాంతానికి న్యాయం చేసుకునే అవకాశం ఉంది కదా? అంటూ పంచ్ వేసే ప్రయత్నం చేశారు. ఇలాంటి మాటలకు ఘాటుగా రియాక్టు అయ్యే అలవాటున్న రెడ్యా నాయక్ తానేమీ తక్కువ తినలేదన్నట్లుగా స్పందించారు. ‘అవును.. నాకు మంత్రి పదవి అప్పట్లో ఎలా ఇచ్చారో పదవి ఇచ్చిన పెద్దాయనకే తెలుసు. ఇప్పుడు మంత్రి పదవి రావాలంటే సాధ్యం కాదు. నువ్వునంత కాలం నాకెలా మంత్రి పదవి ఇస్తారు’ అంటూ సూటిగా అనాల్సిన మాట అనేశారు.

రెడ్యా నాయక్ నోటి నుంచి అలాంటి మాట వస్తుందని ఊహించని ఎర్రబెల్లి నోట మాట రాలేదు. దివంగత మహానేత వైఎస్ హయాంలో రెడ్యానాయక్ మంత్రిగా వ్యవహరించారు. అప్పట్లో ఎర్రబెల్లి టీడీపీలో ఉండేవారు. సామాజిక సమీకరణ భాగంగా రెడ్యా నాయక్ కుమంత్రి పదవి లభించింది. కానీ.. చక్రం ఆయన చేతిలో ఉండేది కాదు. ఇదే విషయాన్ని ప్రస్తావించటంతో పాటు.. తాజాగా ఇరువురు నేతలు టీఆర్ఎస్ లోనే ఉన్నా.. సీఎం కేసీఆర్ కు ఎర్రబెల్లి అత్యంత సన్నిహితుడు కావటం తెలిసిందే. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. అప్పట్లో మంత్రిగా ఉన్నా చేసుకోలేకపోయాను.. ఇప్పుడు మంత్రి కావాలంటే నువ్వు అడ్డు ఉన్నావన్న మాటను చెప్పేశారు రెడ్యా నాయక్. ఆయన వేసిన పంచ్ కు.. అక్కడి వాతావరణం సైలెంట్ గా మారిపోవటమే కాదు.. ఎవరి నోటి నుంచి కాసేపు ఎలాంటి మాట రాలేదని తెలిసింది.