Begin typing your search above and press return to search.

వీళ్ళని పట్టడం కష్టమేనా ?

By:  Tupaki Desk   |   12 March 2022 3:30 PM GMT
వీళ్ళని పట్టడం కష్టమేనా ?
X
మామూలుగానే వీళ్ళ మాటలకు అంతుండదు. అలాంటిది బీజేపీ నాలుగు రాష్ట్రాల్లో ఘనవిజయం సాధించిన తర్వాత ఇక వీళ్ళని ఆపడం కూడా కష్టంగానే ఉంది. ఫలితాలు వెల్లడైన మరుసటి రోజు నుంచి బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, బీజేపీ చీఫ్ సోము వీర్రాజు, తెలంగాణ చీఫ్ బండి సంజయ్ మొదలు పెట్టేశారు. రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి రాబోయేది తామేనంటూ ఊదరగొట్టేస్తున్నారు.

తెలంగాణలో బండి ఈ మాట చెప్పారంటే ఏదోలే అనుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం తెలంగాణాలో కమలం పార్టీకి నలుగురు ఎంపీలున్నారు, ముగ్గురు ఎంఎల్ఏలున్నారు. గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలను రాబట్టింది. కాబట్టి రాబోయే ఎన్నికల్లో తమదే అధికారం అని చెప్పుకున్నా కొంత అర్థముంది. మరి ఏపీలో ఏముందని అధికారంలోకి రాబోయేది తామే అని నానా రచ్చ మొదలుపెట్టేశారు ?

జీవీఎల్ మాట్లాడుతూ వైసీపీ, టీడీపీల నుంచి తమ పార్టీలోకి వలసలు రావటానికి చాలామంది నేతలు రెడీగా ఉన్నట్లు చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. టీడీపీ నుంచి వలసలంటే ఏమోలే అనుకోవచ్చు.

ఎందుకంటే 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోగానే వెంటనే నలుగురు రాజ్యసభ ఎంపీలు బీజేపీలోకి ఫిరాయించారు. తర్వాత విడతలవారీగా కొందరు నేతలు కూడా బీజేపీలో చేరిపోయారు. కాబట్టి తాజా ఎన్నికల ఫలితాల తర్వాత మరింత మంది వలసలకు రెడీగా ఉన్నారంటే అర్ధముంది.

మరి అధికార పార్టీ నుంచి బీజేపీలోకి ఎందుకని వలసలు వెళతారు ? అసలు బీజేపీకి రాష్ట్రంలో ఉన్న బలమెంత ? అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. అలాంటిది వైసీపీ నుంచి కమలం పార్టీలోకి వలసలని జీవీఎల్ పెద్ద జోక్ చేశారు. పైగా తమ పార్టీలో చేరడానికి చాలామంది రెడీగా ఉన్నారట.

మరెందుకు వాళ్ళందరినీ చేర్చుకోవటం లేదో జీవీఎల్ చెప్పలేదు. ఎక్కడో యూపీలో గెలవగానే తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ నేతలు చేస్తున్న రచ్చ చూస్తుంటే భలే కామెడీగా ఉంది. కొంతకాలంపాటు వీళ్ళని పట్టుకోవటం కష్టమేనేమో.