Begin typing your search above and press return to search.

పవన్ సీఎం అయితే ఓకేనా...వైసీపీ కాపులు చెప్పేదేంటి...?

By:  Tupaki Desk   |   31 Oct 2022 7:32 AM GMT
పవన్ సీఎం అయితే ఓకేనా...వైసీపీ కాపులు చెప్పేదేంటి...?
X
వైసీపీలో కాపులు ఇపుడు భేటీ అయ్యారు. నిజానికి ఎవరికి వారుగా ఉంటున్న కాపులను అందరికీ ఏకం చేసిన ఘనత కచ్చితంగా పవన్ కళ్యాణ్ దే. ఆయన తన పార్టీని వైసీపీ పటిష్టం చేసిందని ఎలా చెప్పుకున్నారో అలాగే వైసీపీలో కాపుల ఐక్యతకు పవన్ ఇపుడు ప్రధాన కారణం అయ్యారు. నిజానికి ఏ రాజకీయ పార్టీలో అయినా అన్ని కులాలు ఉంటాయి. వారికి అక్కడ బాగున్నంతవరకూ కులం మతం, ప్రాంతం ఏదీ కనిపించదు. తేడా వస్తేనే అన్నీ గుర్తుకు వస్తాయి.

ఆ విధంగా చూసుకుంటే వైసీపీలో కాపులు ఇపుడు తమ గురించి గట్టిగానే ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా గోదావరి జిల్లాలు విశాఖ జిల్లా కాపులకు జనసేన, టీడీపీ కూటమి నుంచి ముప్పు ఉంది. వారి గెలుపు మీద అది తీవ్ర ప్రభావం చూపించబోతోంది. దాంతో రాజమండ్రీ వేదికగా కాపులు అంతా ఏకమై కీలక విషయాలను చర్చించారు. అయితే ఈ భేటీలో అంతా ప్రధాంగా పవన్ తమను పట్టుకుని అనుచితమైన కామెంట్స్ చేశారనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మంగళగిరి పార్టీ ఆఫీసులో పవన్ వైసీపీ కాపులను టార్గెట్ చేశారు. గట్టిగానే మాట్లాడారు. ఇక దశలో ఆయన ఔచిత్యం కూదా మరచి దారుణమైన భాష వాడారు అని వైసీపీ కాపులు మదన పడుతున్నారు. వైసీపీకి చెందిన ఒక మంత్రి గారు పవన్ నా సోదరుడు లాంటి వారు అని అన్నారు. నిజానికి అందులో తప్పు లేదు, బూతు అంతకంటే లేదు, కానీ పవన్ దాని మీద విశాఖలో మీడియా ముఖంగానే ఆవేశంగా మాట్లాడారు. నన్ను సోదరుడు అనడానికి ఆయన ఎవరు అంటూ గట్టిగానే అన్నారు.

ఇక్కడ పవన్ ఆయన ఉంటున్న రాజకీయ పార్టీని ద్వేషిస్తున్నారు. అంతవరకూ బాగానే ఉన్నా ఆయనను కూడా నాతో మీకు బంధమేంటి అనడమే కాపులకు కోపం తెప్పిస్తోంది. ఆయన ఒక్కరనే కాదు చాలా మంది కాపు నాయకులు తమ మీద పవన్ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడురున్నారని సన్నాసులు, దద్దమ్మలు అని విమర్శలు చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. తమను అలా అనడానికి ఆయన ఎవరని కూడా వారు మండిపడుతున్నారు.

ఇలా వారి ఆవేశమే ఈ రోజున భేటీ దాకా తీసుకువచ్చింది. పవన్ విషయంలో ఇలాగే ఊరుకుంటే ఆయన ఇంకా తమను చెడా మడా అంటారన్న భయంలో కలవరంలో ఏదో తెలియదు కానీ వైసీపీ కాపులు అంతా ఒక్కటి అయ్యారు. రేపటి రోజున ఇదే తీరున జనంలో తమను పలుచన చేస్తే తమ రాజకీయ ఉనికి కూడా ప్రశ్నార్ధం అవుతుంది అన్న భయం కూడా వారికి పట్టుకుంది. ఈ నేపధ్యం నుంచి చూసినపుడు వారంతా పవన్ కి గట్టి రిటార్ట్ ఇవ్వబోతున్నారు. ఒక విధంగా తమను తాము కాపాడుకుంటూ కాపులలో తమ ఓట్లు పోకుండా చూసుకునే ప్రయత్నం చేస్తున్నారు అని అనుకోవాలి.

ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మీడియాతో మాట్లాడుతూ సంచనల కామెంట్స్ చేశారు. కాపులు సీఎం అయితే తమకు అభ్యంతరం లేదని ఆయన అన్నారు. ఆ విధంగా కాకుండా ఎవరో పంచన చేరి వారి కొమ్ము కాయడానికి చూస్తే మాత్రం కాపులు ఎవరూ ఊరుకోరని, వారికి పౌరుషం ఉందని, ఆత్మగౌరవం ఉందని తోట కామెంట్స్ చేశారు.

దీన్ని బట్టి చూస్తే పవన్ సీఎం అయితే వైసీపీ కాపులకు అభ్యంతరం లేదా అన్న చర్చ ముందుకు వస్తోంది. అంటే జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకోకుండా సొంతంగా పోటీకి దిగితే అపుడు వారికి ఓకేనా అన్నది కూడా అంతా ఆలోచించేలా ఉంది. మొత్తానికి చూస్తే వైసీపీ కాపులు చాలా విధాలుగా మధన పడుతున్నారు.

వారిలో రాజకీయ అభద్రతాభావంతో పాటు భవిష్యత్తు ఏమిటి అన్న బెంగ, కాపులల్లో సానుభూతి కోసం ప్రయత్నాలు పవన్ ని గట్టిగా అనలేక అలాగని ఆయన చేసే పరుష పదజాల విమర్శలను తట్టుకోలేక ఇటు వైసీపీ అధినాయకత్వం చెప్పినట్లుగా ఆయనకు ధీటైన కౌంటర్లు ఇవ్వలేక నానా రకాలుగా వైసీపీ కాపులు సతమతమవుతున్నారు అని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.