Begin typing your search above and press return to search.

సురేఖ‌కు.. ప్ల‌స్సా? మైన‌స్సా?

By:  Tupaki Desk   |   16 Aug 2021 10:30 AM GMT
సురేఖ‌కు.. ప్ల‌స్సా? మైన‌స్సా?
X
తెలంగాణ‌లో రాజ‌కీయ పార్టీల‌తో పాటు రాజ‌కీయాల‌ను అనుస‌రించే ప్ర‌జ‌ల దృష్టి మొత్తం హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంపైనే కేంద్రీకృత‌మై ఉంద‌న‌డంలో సందేహం లేదు. ఇంకా నోటిఫికేష‌న్ రాన‌ప్ప‌టికీ ఆ ఉప ఎన్నిక రాష్ట్రంలో రాజ‌కీయ వేడిని పెంచింది. రోజురోజుకూ మారుతున్న ప‌రిణామాలు ఆ వేడిని మ‌రింత తీవ్ర‌స్థాయికి చేరుస్తున్నాయి. ప్ర‌ధాన పార్టీలు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌డం.. వాళ్ల‌కు మద్ద‌తుగా నేత‌ల ర్యాలీలు, పాద‌యాత్ర‌ల ఇలా రాష్ట్రం మొత్తం హుజూరాబాద్ వైపే చూస్తోంది. ఇప్పుడు ఈ వ్య‌వ‌హారంలో కాంగ్రెస్ కూడా చేయి పెట్టేందుకు సిద్ధ‌మైంది. ఉప ఎన్నిక‌లో త‌మ పార్టీ అభ్య‌ర్థిగా కొండా సురేఖ‌ను దించేందుకు రంగం సిద్ధం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. దీనిపై కాంగ్రెస్ ఇంకా అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌క‌పోయిన‌ప్ప‌టికీ ఆ పార్టీ అభ్య‌ర్థి సురేఖ‌నే అని సంబంధిత వ‌ర్గాలు చెప్తున్నాయి. అయితే ఈ ఎన్నిక‌ల్లో బ‌రిలో దిగ‌డం సురేఖ రాజ‌కీయ భ‌విష్య‌త్‌కు క‌లిసొస్తుందా? లేదా? తీవ్ర న‌ష్టం చేస్తుందా? అనే చ‌ర్చ జోరందుకుంది.

భూ క‌బ్జా చేశార‌నే ఆరోప‌ణ‌లు రావ‌డంతో ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి భార‌తీయ జ‌న‌తా పార్టీలోకి జంపైన ఈట‌ల రాజేంద‌ర్‌.. హుజూరాబాద్‌లో త‌న సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. మ‌రోవైపు ఈ ఎన్నిక‌లో విజ‌యాన్ని ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకున్న సీఎం కేసీఆర్ ఆ దిశ‌గా వేగంగా అడుగులు వేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే ద‌ళిత బంధును మొద‌ట ఆ నియోజ‌క‌వ‌ర్గంలోనే ప్రారంభించి అర్హుల‌కు చెక్కులు అందించేందుకు ఆయ‌న హుజూరాబాద్‌లో స‌భ పెట్టారు. ఇక ఇప్పుడు తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ కొత్త అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన రేవంత్ రెడ్డి దూకుడు మీద ఉన్నారు. ఈ ప‌రిస్థితుల్లో ఈ ఉప ఎన్నిక‌ల్లో పోటీచేసి త‌మ స‌త్తా నిరూపించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు.

కానీ హుజూరాబాద్‌లో ప‌రిణామాలు చూస్తే ఎన్నిక‌ల్లో ప్ర‌ధాన పోటీ టీఆర్ఎస్ అభ్య‌ర్థి గెల్లు శ్రీనివాస్ యాద‌వ్‌, బీజేపీ త‌ర‌పున పోటీ చేస్తున్న ఈట‌ల మ‌ధ్య‌నే అనేది కాద‌న‌లేని వాస్త‌వం. ఇక మూడో అభ్య‌ర్థి విజ‌యాన్ని ఆశించ‌డ‌మే క‌ష్టం. ఈ ప‌రిస్థితుల్లోనూ పోటీకి సిద్ధ‌మైన కాంగ్రెస్‌.. మాజీ మంత్రి కొండా సురేఖ‌ను అక్క‌డ నిల‌బెట్టాల‌ని నిర్ణ‌యించింది. బీసీ స‌మీక‌ర‌ణాల చుట్టే ఈ ఎన్నిక‌లు తిరుగుతుండ‌డంతో ఆ సామాజిక వ‌ర్గానికి చెందిన సురేఖ‌ను వ‌రంగ‌ల్ నుంచి తీసుకొచ్చి మ‌రీ హుజూరాబాద్‌లో నిల‌బెడుతున్నారు. కానీ ఇప్పుడు ఈ ఎన్నిక‌ల్లో ఎవ‌రిని బ‌రిలో దించినా కాంగ్రెస్‌కు ఓట‌మి త‌ప్ప‌ద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. తెలంగాణ ఏర్ప‌డిన‌ప్ప‌టి నుంచి వ‌చ్చిన ఉప ఎన్నిక‌ల్లో ఆ పార్టీకి ఘోర ఓట‌ములు త‌ప్ప‌లేదు. పైగా ఇప్పుడు టీఆర్ఎస్ వ‌ర్సెస్ బీజేపీగా సాగుతున్న పోరులో ప్ర‌వేశించి చేతులు కాల్చుకోవ‌డం త‌ప్ప కాంగ్రెస్‌కు ఒరిగేదేమీ లేదు. ఈ ఎన్నిక‌ల‌తో సురేఖ రాజ‌కీయ భ‌విష్య‌త్‌పై కూడా ప్ర‌భావం ప‌డే అవ‌కాశం ఉంది.

ఇప్ప‌టికే నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. ఓ సారి మంత్రిగా ప‌నిచేసిన కొండా సురేఖ కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్‌సీపీలోకి మారి.. ఆ త‌ర్వాత టీఆర్ఎస్‌లో చేరి ఇప్పుడు తిరిగి సొంత‌గూటికి వ‌చ్చి చేరారు. రెండు ద‌శాబ్దాల‌కు పైగా రాజ‌కీయ అనుభ‌వం ఉన్న ఆమె.. 2018లో తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌ల్లో ప‌ర‌కాల‌లో కాంగ్రెస్ త‌ర‌పున పోటీచేసి టీఆర్ఎస్ అభ్య‌ర్థి చేతిలో ఓట‌మి పాల‌య్యారు. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలోనే ఆమె కారు జోరు ముందు నిల‌వ‌లేక‌పోయారు. అలాంటిది మ‌రి ఇప్పుడు త‌న‌ది కాని హుజూరాబాద్‌లో ఆమె ఏ మేర‌కు చ‌క్రం తిప్ప‌గ‌ల‌ర‌నే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. హుజూరాబాద్‌లో కాంగ్రెస్ బ‌లం అంతంత‌మాత్ర‌మే. ఆ పార్టీ నియోజ‌క‌వ‌ర్గ ఇంఛార్జీగా ఉన్న కౌశిక్ రెడ్డి కాంగ్రెస్‌కు షాకిచ్చి ఇటీవ‌ల టీఆర్ఎస్‌లో చేరారు. ఈ ప‌రిస్థితుల్లో ఎన్నిక‌ల బ‌రిలో దిగే సురేఖ‌కు ఓట‌మి త‌ప్ప‌ద‌న‌డంలో సందేహం లేదు.