Begin typing your search above and press return to search.

ఏపీలో మరోసారి అగ్గిరాజేస్తున్న 'కాపు'చిచ్చు.. ఆపడం జగన్ కు సాధ్యమా?

By:  Tupaki Desk   |   24 Dec 2022 4:50 AM GMT
ఏపీలో మరోసారి అగ్గిరాజేస్తున్న కాపుచిచ్చు.. ఆపడం జగన్ కు సాధ్యమా?
X
ఏపీలో మరోసారి 'కాపు రిజర్వేషన్ల' చిచ్చు అంటుకుంది. ఇది దావానంలా మారి జగన్ మెడకు ఉచ్చు బిగిసే అవకాశం ఉంది. నాడు చంద్రబాబు హయాంలో కాపు సీనియర్ నేత ముద్రగడ ఈ నిప్పురాజస్తే ఇప్పుడు జనసేనకు అనుకూలంగా ఉన్న మరో సీనియర్ నేత హరిరామ జోగయ్య దీన్ని అంటిస్తున్నారు. ఈ ఆరని చిచ్చు ఇప్పటికే ఏపీలో రావణ కాష్టంలా ఉంది. మరి దీన్ని ఎలా ఆపుతారు? ఎలా ఎదుర్కొంటారన్నది జగన్ కు సవాల్ గా మారింది.

ఆంధ్రప్రదేశ్ లో మరోసారి కాపు చిచ్చు రగిలే అవకాశం ఉంది. రిజర్వేషన్ల విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి మాజీ ఎంపీ, కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి వెంకట హరిరామ జోగయ్య లేఖ రాశారు. గతంలో చంద్రబాబు హయాంలో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి ప్రయత్నించారని, కానీ ఇప్పటి ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని విమర్శించారు. ఈ విషయంలో ఈ నెలాఖరు వరకు అనుకూల నిర్ణయం తీసుకోవాలని, లేకుంటే నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు. ఏపీలో మరో ఏడాదిలో ఎన్నికలు జరగనున్న వేళ కాపు రిజర్వేషన్ల అంశం తెరపైకి రావడంపై తీవ్ర చర్చ సాగుతోంది. అయితే ప్రభుత్వం మాత్రం ఈ విషయంపై న్యాయ పరమైన చిక్కులు ఉన్నాయన్నారు. మరోవైపు కాపులు బీసీలో చేర్చాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. అందుకు సరైన నిర్ణయం తీసుకుంటామని చెబుతోంది.

ఏపీ రాజకీయాల్లో కాపు ఓటర్లు కీలకం. 15 శాతం ఓటు బ్యాంకు వారిదే ఉంది. అత్యధిక కాపులు ఉన్న పశ్చిమగోదావరి జిల్లాలో 2019లో వైసీపీకి 34 సీట్లు వచ్చాయి. అందుకు ఆయన వారికి ఇచ్చిన హామీలే కారణమని తెలుస్తోంది. దీంతో కాపులను అక్కున చేర్చుకునేందుకు మిగతా రాజకీయ పార్టీలు సైతం వారికి అనుకూల హామీలు ఇస్తున్నాయి. కానీ ఏ పార్టీ రిజర్వేషన్ల అంశం తేల్చడం లేదని కాపులు ఆరోపిస్తున్నారు. కాపులకు రిజర్వేషన్లపై ఎన్నో ఏళ్లుగా ఉద్యమాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కాపులకు న్యాయం చేయాలని భావించిన అప్పటి సీఎం చంద్రబాబు 2017లో ఈ వర్గానికి 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో ఆమోద నిర్ణయం తీసుకున్నారు. అయితే సుప్రీం కోర్టు ఈ నిర్ణయానికి అడ్డుకట్ట వేసింది.

అంతకుముందు కాపులకు రకరకాల హామీలు ఇచ్చిన వైసీపీ 2019లో అధికారంలోకి వచ్చాక ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తాజాగా హరిరామ జోగయ్య రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయడం సంచలనంగా మారింది. కాపులకు రిజర్వేషన్ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్ వారికి సరైన న్యాయం చేయాలని పట్టుబడుతున్నారు. అంతేకాకుండా ఈనెల 31 లోగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని డెడ్ లైన్ విధించారు. దీంతో కాపుల్లో మరోసారి రిజర్వేషన్ అంశం రగిల్చినట్లయింది.

కాపు రిజర్వేషన్ల అంశంపై అసెంబ్లీలో ఇప్పటికే చాలా వాదనలు జరిగాయి. ఈ విషయంలో ప్రభుత్వం నిర్ణయమేంటి..? అని ప్రతిపక్షాలు ప్రశ్నించగా.. జగన్ సమాధానం ఇచ్చారు. 2014లో తాము అధికారంలోకి వస్తే కాపులను బీసీల్లో చేరుస్తామని టీడీపీ మెనిఫెస్టోలో పెట్టిందన్నారు. కానీ అధికారంలోకి వచ్చాక మంజునాథ కమిషన్ వేసిందని, కానీ అందులో చైర్మన్ సంతకం లేదని గుర్తు చేశారు. ఆ తరువాత కేంద్ర తీసుకొచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో కాపులకు 5 శాతం కేటాయిస్తూ నిర్ణయం తీసుకుందన్నారు. కానీ ఈ విషయం న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటుందని చెప్పారు. ఇప్పుడు కాపులు తమను బీసీల్లో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారని, అందుకు ప్రయత్నిస్తున్నామని జగన్ క్లారిటీ ఇచ్చారు.

ఈ విషయంపై పార్లమెంట్ లో బీజేపీ సభ్యులు జీవీఎల్ నరసింహా కేంద్రాన్ని ప్రశ్నించారు. కాపులకు రిజర్వేషన్ల అంశం చెల్లుబాటు అవుతుందా..? అని అడిగారు. అందుకు కేంద్రం సమాధానం ఇచ్చింది. కాపు రిజర్వేషన్లపై కేంద్రం ఆమోదం అవసరం లేదని, రాష్ట్రప్రభుత్వమే సరైన నిర్ణయం తీసుకోవాలని క్లారిటీ ఇచ్చింది. దీంతో ఈ బాధ్యత జగన్ పై పడింది. కాపులను అక్కున చేర్చుకునేందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన జనసేన అధినేత పవన్ తో కలిసి వెళ్తున్నారు. ఇంతలో మాజీ ఎంపీ హరిరామ జోగయ్య ప్రభుత్వానికి రాసిన లేఖ కలకలం రేపింది. దీంతో ఇప్పుడు సీఎం జగన్ కాపు రిజర్వేషన్లపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.