Begin typing your search above and press return to search.

అది పొగడ్తా లేక విమర్శా...పవన్ జీ...?

By:  Tupaki Desk   |   23 April 2022 5:30 PM GMT
అది పొగడ్తా లేక విమర్శా...పవన్ జీ...?
X
తెలుగు భాష గొప్పదనం అది. తెలుగు తేట తేనెల భాష. ఎన్నో అర్ధాలు, ప్రతిపదార్ధాలు ఉన్న భాష. అలాంటి భాషలో విమర్శలు కూడా ఒక్కోసారి ప్రశంసలుగా మారుతాయి. దానికి తాజాగా అచ్చమైన ఉదాహరణ ఏంటి అంటే జగన్ సీబీఐకి దత్తపుత్రుడు అన్న మాట. నిజానికి దత్తపుత్రుడు అంటే సొంత పుత్రుడు కంటే ఎక్కువ గారాబు చేస్తారు. అలా కోరి మరీ దత్తత తీసుకున్న వారి వైభోగాలే వేరు.

ఆ లెక్కన ఈ మాట ఉపయోగిస్తారు. జగన్ పవన్ని తరచూ బాబుకు దత్తపుత్రుడు అని కెలికి వదిలిపెడుతున్నారు. ఇది ఇవాళ మాట కాదు, ఈ రోజు ఊసు కానే కాదు, నాలుగైదేళ్లుగా వైసీపీ ఒక్కటే ఊదరగొడుతోంది. దాని తాలూకా డ్యామేజింగ్ పవర్ ఏంటో 2019 ఎన్నికల్లో పవన్ చవిచూశారు. అయినా గత మూడేళ్ళుగా మాట్లాడని ఆయన ఈ మధ్య అనంతపురం టూర్ లో మాత్రమే గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.

మీరు నన్ను బాబుకు దత్తపుత్రుడు అంటే నేను జగన్ని సీబీఐకి దత్తపుత్రుడు అనాల్సి వస్తుందని ఘాటు రిప్లై ఇచ్చారు. అయినా ఈ మధ్య ఒంగోలు సభలో జగన్ నోటి వెంట మళ్లీ దత్తపుత్రుడు అన్న మాట వచ్చింది. అంతే పవన్ ఏలూరు టూర్ల్ లో జగన్ మీద గట్టిగానే విరుచుకుపడ్డారు.

ఎవరికో దత్తపుత్రుడిని ఏంటి, నాకు సొంత వారు ఉన్నారు. నన్ను అలా అనడమేంటి అని గుస్సా అయ్యారు. చెప్పినా వినకపోతే నేను మళ్లీ అదే మాట అనాల్సి ఉంటుందని అంటూ జగన్ సీబీఐకి దత్తపుత్రుడు అని కామెంట్స్ చేశారు. సరే పవన్ కూడా క్యాచీగా ఉంటుందని జగన్ దత్తపుత్రుడు అని సీబీఐకి తగిలించారేమో. తీరా చూస్తే అది పొగడ్త లేక విమర్శా అన్నది ఎవరికీ అర్ధం కావడంలేదు అంటున్నారు.

ముందే చెప్పుకున్నట్లుగా దత్తపుత్రుడు అంటే ఎవరైనా బాగా చూసుకుంటారు అని అర్ధం. మరి సీబీఐ జగన్ని బాగా చూసుకుందా. ఆయనకు దర్జాలు అన్నీ అక్కడ చేసిందా. ఆయన వైభోగాలు అనుభవించారా. అలా కనుక జరిగితే జగన్ ఎక్కడున్నా రాజే కదా మరి. సీబీఐ జైలూ చిప్పకూడూ అంటూ విపక్షాలు ఆ విమర్శలు అప్పుడు చేయకూడదు కదా.

అంటే ఈ విమర్శలలోనే డొల్లతనం ఉంది. పైగా సీబీఐకి జగన్ అంటే ముద్దు అన్నట్లుగానే అర్ధం వచ్చేలా ఈ కామెంట్స్ ఉన్నాయి పవన్ జీ అంటున్నారు తెలుగు భాష తెలిసిన వారు. మరి పవన్ కి అలాంటి ప్రేమ ఉందా జగన్ మీద. ఆయన తీయని మాటలతో తిట్టాలనుకుంటున్నారా. కాదు కదా. ఆయన ఏ సభలో అయినా తన పార్టీ గురించి చెప్పుకోకపోయినా జగన్ని వైసీపీని తిట్టడానికి టైమ్ కేటాయిస్తారు కదా.

అంటే కచ్చితంగా జగన్ని విమర్శించాలనే పవన్ ఈ పదప్రయోగం చేశారు. కానీ అది ఎక్కడా అతకడంలేదు. అందువల్ల మిస్ ఫైర్ అవుతోంది. సో ఈసారి జగన్ని కామెంట్ చేయాలీ అంటే దత్తపుత్రుడు కాకుండా మరేదైనా పదం ఉపయోగిస్తే బాగుంటుందేమో, జనసైనికులు దీని మీద సీరియస్ గానే ఆలోచించాలి. పవన్ కూడా ఈ విషయంలో చాలా స్టడీ చేస్తే బాగుంటుందేమో.