Begin typing your search above and press return to search.

సుష్మాకు ముస్లిం కిడ్నీ..!

By:  Tupaki Desk   |   25 Jun 2018 7:40 AM GMT
సుష్మాకు ముస్లిం కిడ్నీ..!
X
కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ అనూహ్య వివాదంలో చిక్కుకున్నారు. త‌న శాఖకు సంబంధించిన ఏదైనా స‌మ‌స్య ఎదురైతే వాటిని ప‌రిష్క‌రించేందుకు వెంట‌నే రంగంలోకి దిగుతుంటారు. ఒక ట్వీట్ ఆధారంగా సుష్మా స్వ‌రాజ్ ఇలా ప‌రిష్క‌రించిన స‌మ‌స్య‌లు ఎన్నో. ఎంద‌రో దంపతుల‌కు ఆమె ఆప‌త్కాకాలంలో వీసాలు ఇప్పించారు. అలాగే తాజాగా ఓ వార్త‌తో తెర‌మీద‌కు వ‌చ్చారు. మతాంతర వివాహం చేసుకున్న మహ్మద్ అనాస్ సిద్దిఖీ - తన్వీర్ సేఠ్ దంపతుల పాస్‌ పోర్ట్ విష‌యం చ‌ర్చ‌నీయాంశంగా మారిన సంగ‌తి తెలిసిందే. త‌మ‌కు పాస్ పోర్ట్ కోసం వారు కార్యాల‌యానికి రాగా మతం మార్చుకోవాలని లక్నో పాస్‌పోర్ట్ అధికారి వికాస్ మిశ్రా సూచించ‌డం...ఆయ‌న‌పై సుష్మా ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ గతవారం బదిలీ వేటుకు గుర‌వ‌డం తెలిసిన సంగ‌తే.

అయితే ఈ బ‌దిలీ ఎపిసోడ్ మ‌లుపు తిరుగుతోంది. సద‌రు పాస్ పోర్ట్ అధికారికి నెటిజన్లు మద్దతు పలికారు. ఆయనను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్న విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ పై నెటిజన్లు మండిపడ్డారు. పలువురు నెటిజన్లు నా మద్దతు వికాస్ మిశ్రాకే అని పేర్కొంటూ మంత్రి సుష్మ నిర్ణయం పక్షపాత పూరితం - మతపరమైనవన్నారు. ఇటీవల ఆమెకు ఒక ముస్లిం వ్యక్తి కిడ్నీని అమర్చారు. ఈ నేప‌థ్యాన్ని ప్ర‌స్తావిస్తూ `ఈ బ‌దిలీ మీకు అమర్చిన ఇస్లామిక్ కిడ్నీ ప్రభావమా?` అని ఒక నెటిజన్ ట్వీట్ చేశారు. `ముస్లింల అనుకూల నిర్ణయాలు తీసుకోవడం ఆమెకు సిగ్గుచేటు. పాకిస్థానీలకు వీసాలను జారీ చేయడం సిగ్గుచేటు.లౌకిక వాదిగా మారాలని భావిస్తున్న సుష్మా స్వరాజ్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని భావిస్తున్నాం` అని ట్వీట్లు చేశారు. హిందువుల మనోభావాలను నాశనం చేస్తూ బుజ్జిగింపు మనస్తత్వం ప్రదర్శించారు అని వ్యాఖ్యానించారు. మరో నెటిజన్ ఆమె ఖాతాను అన్‌ఫాలో చేయాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. కాగా, నెటిజ‌న్ల కామెంట్ల‌పై సుష్మా స్వ‌రాజ్ స్పందించ‌లేదు.