Begin typing your search above and press return to search.

మండలి రద్దు కు సమయం పడుతుందా, బీజేపీ ఏం చేస్తుంది?

By:  Tupaki Desk   |   28 Jan 2020 3:58 AM GMT
మండలి రద్దు కు సమయం పడుతుందా, బీజేపీ ఏం చేస్తుంది?
X
ఆంధ్రప్రదేశ్ శాసన మండలి రద్దుకు శాసన సభ సోమవారం ఆమోదం తెలిపింది. మండలిని రద్దు చేసే అంశంపై ముఖ్యమంత్రి జగన్ తీర్మానం ప్రవేశ పెట్టిన అనంతరం చర్చించారు. రాజకీయ ప్రయోజనాలకు కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం మండలిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన జగన్ మద్దతు తెలపాలని సభ్యులను కోరారు. అనుకూలంగా 133 ఓట్లు వచ్చాయి. వ్యతిరేకంగా, తటస్థంగా ఎవరూ లేరు. మండలి రద్దు తీర్మానం అసెంబ్లీ లో ఆమోదం పొందినట్లు స్పీకర్ తమ్మినేని ప్రకటించారు.

అసెంబ్లీ లో తీర్మానం చేయగానే మండలి రద్దు అయినట్లు కాదు. పూర్తిస్థాయిలో రద్దు కావాలంటే కేంద్రం గడప తొక్కాల్సిందే. శాసనసభలో ఆమోదం పొందిన తీర్మానాన్ని కేంద్రానికి పంపిస్తారు. పార్లమెంటు లో ఉభయ సభలతో పాటు రాష్ట్రపతి ఆమోదం అవసరం. ఆ తర్వాతే పూర్తి గా రద్దవుతుంది. ఏపీలో మొదటిసారి మే 31, 1985లో నాటి సీఎం ఎన్టీఆర్ మండలిని రద్దు చేశారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం రద్దు కు తీర్మానించింది.

మండలి రద్దు పూర్తి కావడానికి ఏడాది నుంచి ఏడాదిన్నర అంతకంటే ఎక్కువే పట్టవచ్చుననేది టీడీపీ నేతల అభిప్రాయం. ఇప్పటికే సీఏఏ, ఎన్ఆర్సీ వాటి వాటితో జాతీయస్థాయిలో అనుకూల, వ్యతిరేక ఉద్యమాలు నడుస్తున్నాయి. ఇలాంటి సమయం లో ఉభయ సభల్లో ఆమోదానికి సమయం పట్టే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.

ఒకవేళ బీజేపీ అనుకుంటే మాత్రం త్వర త్వరగా పూర్తి కావడం కూడా అసాధ్యమేమీ కాదనే వారు లేకపోలేదు. ప్రస్తుతం ఏపీలో జనసేనతో కలిసి ఎదుగుదామని భావిస్తున్న బీజేపీ... రాష్ట్రం లో రాజకీయ కోణంలో పావులు కదిపే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయని అంటున్నారు. కానీ రాజ్యసభలో బీజేపీకి పూర్తి బలం లేదు. వైసీపీ అవసరం ఉంటుంది. కాబట్టి దీనిని కూడా పరిగణలోకి తీసుకుంటుంది.

మండలి రద్దు విషయం లో జగన్‌కు సహకరించి రాజ్యసభలో వైసీపీ సహకారం తీసుకోవడానికి మొగ్గు చూపుతుందా లేక టీడీపీ చెబుతున్నట్లు ఈ ప్రక్రియ పూర్తి కావడానికి ఏడాదిన్నర రెండేళ్లు సంవత్సరాలు పడుతుందా అనేది కేంద్రం చేతుల్లో ఉందంటున్నారు. మొత్తానికి మండలి రద్దు అంశంపై బీజేపీ ఏం చేస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది.

మండలి రద్దు తీర్మానాన్ని టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు బీజేపీ తాజా మిత్రపక్షం జనసేన కూడా వ్యతిరేకిస్తోంది. మండలి రద్దు సరి కాదని, దీనికి ప్రజామోదం లేదని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు. మండలి రద్దుకు శాసన సభ తీర్మానం చేయడం విచారకరమని చంద్రబాబు అన్నారు.