Begin typing your search above and press return to search.

టీడీపీ, జనసేన ఒప్పందం నిజమేనా..?

By:  Tupaki Desk   |   4 April 2019 5:33 AM GMT
టీడీపీ, జనసేన ఒప్పందం నిజమేనా..?
X
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు మరో వారం రోజులే ఉండడంతో ఆయా పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నాయి. వాడీవేడి ప్రసంగాలతో మైకులు హోరెత్తిస్తున్నాయి. ఈ తరుణంలో రాష్ట్రంలో ప్రధానంగా త్రిముఖ పోరు నడుస్తున్న నేపథ్యంలో టీడీపీ, వైపీపీలు ఒంటరిగానే బరిలో నిలుచున్నాయి. జనసేన మాత్రం వాపమపక్షాలు, బీఎస్‌ తో పొత్తు కుదుర్చుకుంది. అయితే మూడు పార్టీల అభ్యర్థులు ఒకరిపై ఒకరు టార్గెట్‌ చేసుకొని ప్రసంగాలతో హోరెత్తిస్తున్నారు. ఈ సమయంలో టీడీపీ, జనసేనలు పరోక్షంగా పొత్తు ఒప్పందం కుదుర్చుకున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. బహిరంగంగా వేరు వేరుగా పోటీ చేస్తున్నా వైసీపీ ఓట్లు చీల్చడానికి చీకటి ఒప్పందంతోనే ఎన్నికల్లో నిలుచున్నారని వారంటున్నారు.

* పవన్‌ ప్రచారంలో మార్పు..?
గతంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ టీడీపీ ప్రభుత్వాన్నే టార్గెట్‌ చేసేశారు. చంద్రబాబుపై నిప్పులు చెరిగేవారు. ప్రత్యేక హోదా సాధించడమే తమ ధ్యేయమని అయితే హోదా విషయంలో రాష్ట్రాన్ని చంద్రబాబు తాకట్టుపెట్టారని ఆరోపించారు. అయితే ఎన్నికల నోటిఫికేషన్‌ అనంతరం పవన్‌ ప్రచారంలో మార్పు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఇప్పుడు ఆయన చంద్రబాబును కాకుండా కేవలం జగన్‌ ను మాత్రమే టార్గెట్‌ చేస్తున్నారు. అడపాదడపా చంద్రబాబును అంటున్నా వాటిని మాత్రం హైలెట్‌ చేయడం లేదు. దీంతో వైసీపీ నాయకులు టీడీపీ, జనసేన ఒప్పందానికి ఇది నిదర్శనం కాదా..? అని ప్రశ్నిస్తున్నారు.

* పవన్ స్థానానికి చంద్రబాబు వెళ్లడా..?
పవన్‌ కల్యాణ్‌ పోటీ చేస్తున్న గాజువాక స్థానానికి చంద్రబాబు ఎందుకు ప్రచారం చేయడం లేదనే విమర్శ వస్తోంది. ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పల్లా శ్రీనివాస్‌ చంద్రబాబును ప్రచారం చేయాల్సిందిగా పలుమార్లు కోరారు. అయితే ఇంతవరకు చంద్రబాబు ప్రచారం చేయడం లేదు. మరోవైపు మంగళగిరిలో నారా లోకేశ్‌ పోటీ చేస్తున్నారు. రాష్ట్రమంతా పర్యటిస్తున్న పవన్‌ మంగళగిరికి రావడం లేదని అంటున్నారు. పొత్తులో భాగంగా ఇక్కడి సీటును కాపు ఓట్లు ఉన్న జనసేన అభ్యర్థికి కాకుండా సీపీఐకి కేటాయించారు. ఆ పార్టీ తరుపున నామమాత్ర అభ్యర్థిని బరిలోకి దించారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

* ఆ రెండింటికి ప్రత్యామ్నాయమే జనసేన..!
ప్రచార సమయం కూడా తక్కువగా ఉండడంతో ఈ విమర్శలపై ఇరు పార్టీల నేతలు ఎటువంటి సమాధానం చెప్పడం లేదు. దీంతో వీరి మధ్య అవగాహన ఒప్పందం ఉందన్న వార్తలకు బలం చూకూరుతోంది. అయితే పవన్‌ కల్యాణ్‌ మాత్రం మాకు రెండు పార్టీలు ప్రత్యర్థులేనని, ఆ రెండింటికి ప్రత్యామ్నాయమే అని చెబుతున్నా.. ప్రత్యర్థుల నియోజకవర్గాల్లో అధినేతలు ప్రచారం చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది.