Begin typing your search above and press return to search.

గులాబీతోట‌లో తాజా విలీనం చెల్లుతుందా?

By:  Tupaki Desk   |   7 Jun 2019 6:01 AM GMT
గులాబీతోట‌లో తాజా విలీనం చెల్లుతుందా?
X
ఆశ‌.. అత్యాశ‌.. రెండింటి మ‌ధ్య తేడా ఒక్క అక్ష‌ర‌మే. కానీ రెండింటి అర్థం తూర్పు ప‌డ‌మ‌ర లాంటిది. ఒక‌దానికి మ‌రొక‌టి పొస‌గ‌ని ఈ ప‌దం మాదిరే.. తాజాగా తెలంగాణ అధికార‌ప‌క్షంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల విలీనం ఎంత‌వ‌ర‌కు న్యాయం? మ‌రెంత వ‌ర‌కు ధ‌ర్మం అన్న‌ది ఇప్పుడు పెద్ద చ‌ర్చ‌గా మారింది. నైతికంగా చూస్తే.. ఇలాంటివి ఏ మాత్రం మంచిది కాద‌ని చెప్పేయొచ్చు.

మ‌రి.. నైతికంగా ధ‌ర్మం కానిది.. సాంకేతికంగా మాత్రం న్యాయ‌మ‌వుతుందా? అన్న‌ది ప్ర‌శ్న‌. అయితే.. రూల్ బుక్ లోని చిన్న చిన్న అక్ష‌రాలు ఇచ్చే అవ‌కాశంతో విలీనాన్ని ధ‌ర్మ‌బ‌ద్ధంగా జ‌రిగింద‌న్న‌ వాద‌న‌ను వినిపిస్తున్నారు గులాబీ నేత‌లు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో తాజాగా జ‌రిగిన విలీనం.. చ‌ట్ట‌బ‌ద్ధంగానే జ‌రిగిన‌ట్లుగా వాదిస్తున్నారు. అయితే.. ఇదినిజంగానే చెల్లుతుందా? కోర్టులు దీనికి ఒప్పుకుంటాయా? అన్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. విలీనం చ‌ట్ట‌బ‌ద్ధంగా జ‌ర‌గ‌లేద‌న్న‌ది కాంగ్రెస్ నేత‌ల వాద‌న‌. దీనికి టీఆర్ ఎస్ నేత‌లు కౌంట‌ర్ వాద‌న‌ను వినిపిస్తున్నారు. విలీనం మొత్తాన్ని చ‌ట్ట‌బ‌ద్ధంగా పూర్తి చేసిన‌ట్లుగా చెబుతున్నారు. పార్టీని తాము విలీనం చేసుకోలేద‌ని.. కేవ‌లం కాంగ్రెస్ శాస‌న‌స‌భాప‌క్షాన్ని మాత్ర‌మే విలీనం చేసిన‌ట్లుగా వారు వాదిస్తున్నారు.

విలీనాన్ని పార్టీ త‌ర‌ఫున ఏ ఒక్క‌రు వ్య‌తిరేకించినా.. ఆ విలీనం చెల్ల‌ద‌న్న విష‌యాన్ని గ‌తంలో వ‌చ్చిన తీర్పుల్ని చూస్తే అర్థ‌మ‌వుతుంది. కానీ.. తాజాగా జ‌రిగింది పార్టీ విలీనం కాద‌ని.. పార్టీ శాస‌న‌స‌భాప‌క్షం విలీనం అన్న‌ది మ‌ర్చిపోకూడ‌దంటున్నారు. ఈ కార‌ణంగానే ఎన్నిక‌ల సంఘం జోక్యం లేకుండా.. స్పీక‌ర్ అనుమ‌తితోనే పూర్తి చేశార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అయితే.. ఈ అంశంపై తాము కోర్టుకు వెళ‌తామ‌ని కాంగ్రెస్ చెబుతోంది. మ‌రి.. విలీనం పేరుతో నెల‌కొన్న సాంకేతిక అంశాల్ని కోర్టు ఎలా చూస్తుంది..? ఎలా రియాక్ట్ అవుతుంద‌న్న‌ది కాల‌మే స‌మాధానం చెప్పాల్సి ఉంటుంది. అయితే.. ఈ నిర్ణ‌యం వెలువ‌డ‌టానికి చాలా కాల‌మే ప‌ట్టే అవ‌కాశం ఉందన్న‌ది మ‌ర్చిపోకూడ‌దు.