Begin typing your search above and press return to search.

ఆ అసంతృప్త ఎమ్మెల్యే కు జగన్‌ ఫోన్‌ కాల్‌ నిజమేనా?

By:  Tupaki Desk   |   2 Jan 2023 6:06 AM GMT
ఆ అసంతృప్త ఎమ్మెల్యే కు జగన్‌ ఫోన్‌ కాల్‌ నిజమేనా?
X
వైసీపీలో నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. ఇటీవల ఆయన సొంత ప్రభుత్వంపై, అధికారుల తీరుపై చేస్తున్న విమర్శలు మీడియాలో పతాక శీర్షికలు ఎక్కుతున్నాయి. వైసీపీ గెలిచిన దగ్గర నుంచి ఆయన స్వపక్షంలో విపక్షంలా వ్యవహరిస్తున్నారని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నుంచి కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డికి పిలుపు వచ్చిందని అంటున్నారు. జనవరి 2న సాయంత్రం తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ ఆఫీసులో ముఖ్యమంత్రి జగన్‌ ను కోటంరెడ్డి కలవనున్నారని టాక్‌ నడుస్తోంది.

2014, 2019 ఎన్నికల్లో కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి నెల్లూరు రూరల్‌ నుంచి ఘన విజయం సాధించారు. దీంతో జగన్‌ ప్రభుత్వంలో మంత్రి పదవిని ఆశించారు. అయితే సామాజికవర్గ సమీకరణాలతో మంత్రి పదవి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ యాదవ్‌ కి దక్కింది. అనిల్‌ కుమార్‌ తన మిత్రుడే కావడంతో కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి కూడా సర్దుకుపోయారు.

అయితే రెండో మంత్రి వర్గ విస్తరణలో అయినా తనకు పదవి దక్కుతుందని ఆశించారు. ఈసారి సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్‌ రెడ్డి మంత్రి పదవిని ఎగరేసుకుపోయారు. దీంతో కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి వైసీపీ అధిష్టానంపై ఘాటు వ్యాఖ్యలు చేయడంతోపాటు కంటతడి పెట్టుకున్నారు.

కొద్ది రోజుల క్రితం నెల్లూరు జిల్లా అభివృద్ధి కమిటీ సమావేశంలో కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గంలో పనులు పూర్తి కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రులు మారుతున్నారు.. కలెక్టర్లు మారుతున్నారు.. నియోజకవర్గంలో పనులు మాత్రం చేయడం లేదని మండిపడ్డారు. వరదలు వచ్చినా ఎఫ్‌డీఆర్‌ పనులు చేపట్టలేదని.. దీంతో 150 ఎకరాల పంట కొట్టుకుపోయిందని తెలిపారు. దీనికి ఎవరు బాధ్యులు అని నిలదీశారు.

బారాషాహిద్‌ దర్గాకు రూ.10కోట్లను ముఖ్యమంత్రి జగన్‌ మంజూరు చేసినా ఆర్థిక శాఖ కార్యదర్శి రావత్‌ అనుమతి ఇవ్వడం లేదన్నారు. రావత్‌ దగ్గరకు వెళ్తే కనీసం పట్టించుకోలేదని.. కనీసం కూర్చోమని అని కూడా లేదని.. ఒక ఎమ్మెల్యేకే ఇలాంటి పరిస్థితి ఎదురుకావడం దారుణమని కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి వాపోయారు. బీసీ భవన్‌ నిర్మాణ పనులు కూడా మిగిలిపోయాయని.. నిధులు రాకపోవడంతో పనులు చేయలేమని కాంట్రాక్టర్లు చెబుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో సమస్యలు పరిష్కారం కాకపోతే పోరాటం చేస్తానని వెల్లడించారు.

రాష్ట్రంలో కొందరు ఐఏఎస్‌ల వల్లే నిధులు రావడం లేదని ఆరోపించారు. బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. జగనన్న కాలనీల్లో మౌలిక వసతులు కూడా లేవని కోటంరెడ్డి శ్రీ«దర్‌ రెడ్డి బాంబు పేల్చారు.

కాగా గతంలోనూ అధికారులు మురుగునీటి సమస్యను పరిష్కరించడం లేదంటూ మోకాలి లోతు బురదగుంటలో దిగి కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి నిరసన వ్యక్తం చేశారు. అలాగే గతంలో ఒక మహిళా ఎంపీడీవో ఇంటికి కరెంటు, నీటి సరఫరా నిలిపి వేయించారని ఆయనపై ఆరోపణలు వ్యక్తమయ్యాయి.

గతంలో తనకు సొంత పార్టీలోనే శత్రువులున్నారని కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి హాట్‌ కామెంట్స్‌ చేశారు. తరచూ పార్టీలు మారే నేతలు ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

కోటంరెడ్డి వ్యాఖ్యలు ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ను చిరాకుకు గురి చేశాయని టాక్‌ నడుస్తోంది. దీంతో తనను కలవాలంటూ కోటంరెడ్డికి సీఎంవో నుంచి ఫోన్‌ చేసినట్లు తెలుస్తోంది. నియోజకవర్గానికి కావాల్సిన మేర నిధుల విడుదల చేస్తున్నా ఎందుకు తరచూ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నావని సీఎం ప్రశ్నించొచ్చని సమాచారం.

నిజంగా ప్రజా సమస్యల పరిష్కారమేనా లేక మంత్రి పదవి ఇవ్వలేదన్న కోపంతోనే ఇలాంటివి చేస్తున్నారా అనే దానిపై కోటంరెడ్డి శ్రీదర్‌ రెడ్డిని సీఎం జగన్‌ ప్రశ్నిస్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో కోటంరెడ్డి సీఎంకు ఏం సమాధానం చెబుతారనేది దానిపై ఆసక్తి ఏర్పడింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.