Begin typing your search above and press return to search.

చంద్రబాబు చేసిన ఆ తప్పే జగన్‌ కూడా చేస్తున్నారా?

By:  Tupaki Desk   |   12 Dec 2022 7:33 AM GMT
చంద్రబాబు చేసిన ఆ తప్పే జగన్‌ కూడా చేస్తున్నారా?
X
ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే ఎన్నికల్లో 175కి 175 సీట్లు సాధించాలనే లక్ష్యంతో వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాదికి పైగా సమయం అందుబాటులో ఉన్నప్పటికీ ఇప్పటికే ఎమ్మెల్యేలను, ఎమ్మెల్యేలు లేని చోట నియోజకవర్గాల ఇన్‌చార్జులను గడప గడపకు పంపుతున్నారు. ఇందుకోసం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పేరుతో ప్రత్యేక ప్రోగ్రామ్‌ చేపట్టిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జులు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికీ వెళ్తున్నారు. సంక్షేమ పథకాల వల్ల ఈ మూడున్నరేళ్లలో కలిగిన లబ్ధిని వారికి వివరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ మరోమారు గెలిపించాలని కోరుతున్నారు.

మరోవైపు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ లో 2.67 లక్షల మంది వలంటీర్లు ఉన్నారు. వీరంతా లబ్ధిదారులకు పెన్షన్లు అందించడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కార్యక్రమాల గురించి ప్రజలకు తెలియజెప్పడం, ప్రభుత్వం తరఫున సర్వేలు చేయడం వంటివి చేస్తున్నారు. వలంటీర్లను ఉపయోగించుకుని మరోమారు వైసీపీ అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తోందని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వలంటీర్లను ఎన్నికల విధులకు ఉపయోగించుకోకూడదని ఇటీవల ఎన్నికల సంఘం జగన్‌ ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

దీంతో పునరాలోచనలో పడ్డ జగన్‌ వచ్చే ఎన్నికల్లో గెలుపు సాధించడానికి గృహ సారథులతో పేరుతో 5.20 లక్షల మందిని నియమించాలని నిర్ణయించారు. వలంటీర్లు మాదిరిగానే వీరు కూడా ప్రతి 50 ఇళ్లకు ఒకరు చొప్పున ఉంటారు. బూత్‌ లెవల్లో, క్షేత్ర స్థాయిలో, గ్రామాల్లో వీధుల స్థాయిలో జరిగే ప్రతి విషయాన్ని పార్టీకి నివేదిస్తారని తెలుస్తోంది. అంతేకాకుండా వైసీపీ తరఫున ప్రజలకు మెసేజులు పంపడం, తమకు ఓట్లేస్తేనే ఇంకా పథకాలు వస్తాయని వివరించడం, ప్రభుత్వ పథకాలు అందుతున్నాయో, లేదో ఆరా తీయడం, ప్రజల రాజకీయ ఆసక్తులను తెలుసుకోవడం, వారు ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నారో పార్టీ పెద్దలకు నివేదించడం చేస్తారని అంటున్నారు.

అంతేకాకుండా గృహసారథులకు తోడుగా ప్రతి గ్రామానికి మళ్లీ ఇద్దరు చొప్పున కన్వీనర్లు సైతం ఉంటారని ఏపీ సీఎం జగన్‌ ఇటీవల పార్టీ నేతల సమావేశంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇలా మొత్తం 2.67 లక్షల మంది వలంటీర్లతోపాటు 5.20 లక్షల మంది గృహ సారథులను వినియోగించుకుని మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తున్నట్టు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. గుజరాత్, ఉత్తరప్రదేశ్‌ ల్లో బీజేపీ సైతం ఇలాగే క్షేత్ర స్థాయిలో పన్నా ప్రముఖ్‌ లను నియమించి అధికారంలోకి వచ్చిందని గుర్తు చేస్తున్నాయి.

అయితే జగన్‌ గృహసారథులను నియమించాలనే నిర్ణయం బూమరాంగ్‌ అయ్యే ప్రమాదం కూడా ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఇలాగే క్షేత్ర స్థాయిలో జన్మభూమి కమిటీలు ఉండేవని గుర్తు చేస్తున్నారు. ప్రజలకు ఏ పథకం రావాలన్నా, లబ్ధి కలగాలన్నా జన్మభూమి కమిటీ సభ్యుల సిఫారసులు ఉంటేనే పని జరిగేదని గుర్తు చేస్తున్నారు.

దీంతో ప్రజలు తమకు ప్రభుత్వం నుంచి కావాల్సిన ప్రయోజనాల కోసం జన్మభూమి కమిటీలను ఆశ్రయించేవారు. వారు ప్రజల నుంచి డబ్బులు దండుకునేవారని అంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వం బాగానే పనిచేసినా క్షేత్ర స్థాయిలో జన్మభూమి కమిటీల ఆగడాలను ప్రజలు భరించలేకపోయారని చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి ఏ పని కావాలన్నా, పథకం అందాలన్నా ఇలా ప్రతి విషయానికి జన్మభూమి కమిటీల చేయి తడిపితే కానీ లబ్ధి అందేది కాదని గుర్తు చేస్తున్నారు.

జన్మభూమి కమిటీల ఆగడాలతోనే చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెల్లుబికిందని.. దీంతో 2019 ఎన్నికల్లో టీడీపీని ఓడించారని గుర్తు చేస్తున్నారు.

ఇప్పుడు ఇదే కోవలో గృహ సారథుల పేరుతో జగన్‌ నియమిస్తున్నవారు కూడా జన్మభూమి కమిటీల మాదిరిగా వ్యవహరిస్తే జగన్‌ ఆశించింది జరగకపోగా ఆ పార్టీ ఓటమికి దారితీసినా ఆశ్చర్యపోనవసరం లేదని చెబుతున్నారు.

ఇప్పటికే కొన్ని చోట్ల వలంటీర్లు ప్రజలను వేధించుకు తింటున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పథకాలు రాలేదని అడిగితే కొంతమంది వలంటీర్లు ప్రజలపై దాడికి పాల్పడిన సందర్భాలు సైతం ఉన్నాయి. ఈ నేపథ్యంలో గ్రామాల్లో ఇక అంతా తామే అనే రీతిలో గృహ సారథులు వ్యవహరిస్తే వైసీపీకి గత ఎన్నికల్లో టీడీపీకి పడ్డట్టే గట్టి దెబ్బ పడొచ్చని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.