Begin typing your search above and press return to search.

జనంతోనే సరిపోతుందా జగనూ...?

By:  Tupaki Desk   |   11 Aug 2022 8:53 AM GMT
జనంతోనే సరిపోతుందా జగనూ...?
X
జగన్ ఎపుడు మాట్లాడినా తనకు పైన ఉన్న దేవుడు, దిగువన ప్ర‌జల దీవెనలు ఉంటే చాలు అని అంటున్నారు. తనకు వారే ధైర్యం అని కూడా చెప్పుకుంటున్నారు. వినడానికి ఈ మాటలు బాగానే ఉంటాయి. సెంటిమెంట్ పండించడానికి కూడా పనికొస్తాయి. కానీ జనాలలో నిజంగా నిండా అభిమానం ఉన్నా కూడా వైసీపీ గెలుపునకు అది ఒక్కటే సరిపోతుందా అన్న చర్చ అయితే ఉందిపుడు.

వైసీపీకి 2014లో కూడా జనాదరణ ఉందని, మరి పార్టీ ఎందుకు ఓడిపోయింది అన్న ప్రశ్నను కూడా అడిగే వారు ఉన్నారు. నాడు క్యాడర్ బలంగానే ఉంది. కానీ కసిగా నాడు పోరాడలేదు. లైట్ గా తీసుకుంది. గెలుపు మనదే అని నిబ్బరంగా ఉంది. దాంతో అతి విశ్వాసంతో చూసీ చూడనట్లుగా వదిలేసింది.

పైగా టీడీపీని తక్కువ చేసి చూసింది. ఈ కారణం వల్లనే భారీ మూల్యాన్ని వైసీపీ నాడు చెల్లించుకుంది. అదే 2019 నాటికి వైసీపీ మొత్తానికి మొత్తం గేరప్ అయింది. క్యాడర్ నుంచి లీడర్ దాకా అంతా జగన్ సీఎం కావాలని కసిగా పనిచేశారు. ఆ ఫలితాలను కూడా చూశారు. బంపర్ మెజారిటీతో వైసీపీ గెలిచింది. ఈ నేపధ్యంలోనే క్యాడర్ లీడర్ విలువ ఏమిటి అన్నది వైసీపీకి అర్ధం కావాల్సి ఉంది.

అయితే మూడేళ్ళుగా క్యాడర్ నిరుత్సాహంగా ఉంది. అలాగే లీడర్స్ కూడా పట్టనట్లుగా ఉన్నారు. వారిలో మునుపటి హుషార్ అయితే కనిపించడంలేదు. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నా నిర్లిప్తంగా ఉంటున్నారు. ఈ పరిణామాలే పార్టీకి ఇబ్బందిని కలిగిస్తాయని అంటున్నారు. ఇక గడప గడపకు ఎమ్మెల్యేలు వెళ్తున్నా అక్కడ వారు వ్యతిరేకతను చూస్తున్నారు. అలాగే వారు కూడా మొక్కుబడిగానే కదులుతున్నారు.

క్యాడర్ తో జగన్ మీటింగ్స్ అని చెబుతున్నా అవి కూడా పెద్దగా కదిలించడంలేదు. ఈ నేపధ్యంలో 2019 నాటి ఉత్సాహాన్ని క్యాడర్ లో నింపకపోతే పార్టీ బిగ్ ట్రబుల్స్ లో పడుతుంది అని అంటున్నారు. అయితే జగన్ మాత్రం జనం ఉంటే చాలు తాను మళ్ళీ గెలిచేస్తాను అని అంటున్నారు. అది నిజంగా జరిగే పనేనా అన్నదే సొంత పార్టీలో కూడా చర్చగా ఉంది.

సంక్షేమ పధకాలను అమలు చేస్తున్నాం కాబట్టి జనాలు తామే పోలింగ్ బూత్ లకు వచ్చి ఓట్లేస్తారు అని వైసీపీ హై కమాండ్ భావిస్తే అది తప్పు అవుతుంది అని అంటున్నారు. ఓటర్లను కదిలించి నడిపించే నాయకత్వం గ్రాస్ రూట్ లెవెల్ లో ఉండాలి. వారే పార్టీకి వెన్నెముక అని అంటున్నారు.

అంతే తప్ప జనాలను నమ్ముకుని రాజకీయం చేయడం మంచిదే కానీ అది ఎపుడూ అన్ని సార్లూ వర్కౌట్ కాదని అంటున్నారు. మరి వైసీపీలో దీని మీదనే చర్చ సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో జనమే సారధులవుతారా కార్యకర్తలు, నాయకులు అన్న వారి అవసరమే అసలు పడదా అన్నది కూడా ప్రస్థావనకు వస్తోంది. చూడాలి మరి ఏ జరుగుతుందో.