Begin typing your search above and press return to search.

పులివెందుల.. ఈసారి జ‌గ‌న్‌కు అంత సులువు కాదా?

By:  Tupaki Desk   |   3 Aug 2022 4:48 AM GMT
పులివెందుల.. ఈసారి జ‌గ‌న్‌కు అంత సులువు కాదా?
X
పులివెందులలో ఈసారి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు భారీ మెజారిటీ రాదా? సాధార‌ణ గెలుపు మాత్ర‌మేనా అంటే అవున‌నే అంటున్నారు.. రాజ‌కీయ విశ్లేష‌కులు. 2019 ఎన్నిక‌ల్లో పులివెందుల నుంచి 90 వేల‌కు పైగా మెజారిటీతో జ‌గ‌న్ ఘ‌న‌విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఆ ఎన్నిక‌ల్లో రాష్ట్రంలోనే ఇది అత్య‌ధిక మెజారిటీగా న‌మోదైంది. అయితే ఈసారి మాత్రం బొటాబొటీ మెజారిటీ మాత్ర‌మే వ‌స్తుంద‌ని అంటున్నారు.

పులివెందుల వైఎస్సార్సీపీ నేత‌ల్లో అసంతృప్తి నివురుగ‌ప్పిన నిప్పులా ఉండ‌ట‌మే దీనికి కార‌ణ‌మ‌ని విశ్లేషకులు చెబుతున్నారు. గ‌త టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో పులివెందుల‌లో ఎలాంటి అభివృద్ధి కార్య‌క్ర‌మాలు జ‌ర‌గ‌లేద‌ని.. త‌మ‌నూ అణ‌చివేశార‌ని వైఎస్సార్సీపీ నేత‌లు చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో వైఎస్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయితే ఇక త‌మ‌కు తిరుగుండ‌ద‌ని భావించార‌ని స‌మాచారం. అయితే వైఎస్ జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చాక త‌మకు ఒరిగిందేమీ లేద‌ని పులివెందుల వైఎస్సార్సీపీ నేత‌లు ఆక్రోశిస్తున్నార‌ని చెబుతున్నారు.

వైఎస్ జ‌గ‌న్ వ‌చ్చి మూడేళ్లు పూర్త‌యినా పులివెందుల నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ఒక్క‌రుకు కూడా ప్రాధాన్య‌త గ‌ల ప‌దవి ల‌భించలేద‌ని నేత‌లు నిరాశ వ్య‌క్తం చేస్తున్నార‌ట‌. ఒక్క కార్పొరేష‌న్ చైర్మ‌న్ ప‌ద‌వి కానీ, ఏదైనా పెద్ద దేవాల‌యం చైర్మ‌న్ ప‌ద‌వి కానీ రాలేద‌ని తీవ్ర వైరాగ్యంలో ఉన్నార‌ని తెలుస్తోంది.

అంతేకాకుండా నియోజ‌క‌వ‌ర్గంలో చేసిన ప‌నుల‌కు సంబంధించి బిల్లులు కూడా రాలేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్న‌ట్టు స‌మాచారం. క‌నీసం స‌చివాల‌య భ‌వ‌నాలు నిర్మించిన సొంత పార్టీ నేత‌ల‌కు కూడా బిల్లులు రాక‌పోవ‌డంతో అప్పుల పాలై ఊళ్లు వ‌ద‌లాల్సి వ‌స్తోంద‌ని వాపోయిన‌ట్టు తెలుస్తోంది. సీఎం జ‌గ‌న్ ఎప్పుడో కానీ నియోజ‌క‌వ‌ర్గానికి రావ‌డం లేద‌ని అంటున్నారు. ముఖ్య‌మంత్రి అయ్యాక ఈ మూడేళ్ల‌లో త‌న తండ్రి వైఎస్సార్ జ‌యంతి, వ‌ర్థంతి వేడుక‌ల‌కు మాత్ర‌మే.. అది కూడా ఏ రెండు మూడుసార్లు మాత్ర‌మే వ‌చ్చార‌ని చెప్పుకుంటున్నారు. త‌మ ఎమ్మెల్యే వైఎస్ జ‌గ‌న్ సీఎం అయితే పులివెందుల బ‌తుకు మారుతుంద‌ని ఆశిస్తే ఇలా జ‌రిగిందేమిట‌ని బాధ‌ప‌డుతున్నార‌ట‌.

త‌మ బాధ‌ల‌ను నియోజ‌క‌వ‌ర్గంలో ఎవ‌రికి చెప్పుకోవాలో తెలియ‌డం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నార‌ని స‌మాచారం. ఒక్క కాంట్రాక్టు ప‌నుల బిల్లులే కాకుండా రైతుల‌కు సంబంధించిన స‌మ‌స్య‌లు పెద్ద ఎత్తున పేరుకుపోయాయ‌ని చెబుతున్నారు. ఇలాగ‌యితే వ‌చ్చి ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ గెలుపు సంగ‌తి ఏమోకానీ మెజారిటీ మాత్రం రాద‌ని తేల్చిచెబుతున్నార‌ట‌.

ఈ నేప‌థ్యంలోనే పులివెందుల‌కు చెందిన వైఎస్సార్సీపీ నేత‌లు ఆగ‌స్టు 2న‌ మంగ‌ళ‌వారం తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంప్ కార్యాల‌యానికి వెళ్లిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. రాజ‌కీయ‌, ఆర్థిక వ్య‌వ‌హారాలు చూసే సీఎంవోలోని కీల‌క అధికారితో నేత‌లు త‌మ గోడు చెప్పుకున్నార‌ని తెలుస్తోంది. ఆ అధికారి వారు చెప్పిందంతా విని.. త‌ప్ప‌కుండా సీఎం దృష్టికి తీసుకెళ్తాన‌ని.. అన్ని విధాల న్యాయం చేస్తామ‌ని హామీ ఇచ్చినట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. గ‌తంలో వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి సీఎంగా ఉన్న‌ప్పుడు పులివెందుల నాయ‌కుల‌కు ఇలాంటి దుస్థితి లేద‌ని చెప్పార‌ని అంటున్నారు.