Begin typing your search above and press return to search.

తిరుప‌తిలో జ‌గన్ టార్గెట్ క‌ష్ట‌మేనా... ఏం జ‌రుగుతోంది ?

By:  Tupaki Desk   |   10 April 2021 11:30 AM GMT
తిరుప‌తిలో జ‌గన్ టార్గెట్ క‌ష్ట‌మేనా... ఏం జ‌రుగుతోంది ?
X
తిరుప‌తి ఉప ఎన్నిక వైసీపీకి మెజార్టీ విష‌యంలో ప్ర‌తిష్టాత్మ‌కంగా మారితే... టీడీపీకి గెలుపు విష‌యంలోనూ, బీజేపీకి డిపాజిట్ల విష‌యంలోనూ ప్ర‌తిష్టాత్మ‌కంగా మారింది. ఈ ఉప ఎన్నిక ఈ నెల 17న జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌ధాన పార్టీలు అన్ని ప్ర‌చార ప‌ర్వంలో దూసుకు పోతున్నాయి. గెలుపు వైసీపీదే అన్న విష‌యంలో ఎవ్వ‌రికి ఎలాంటి సందేహాలు లేవు. వైసీపీ మెజార్టీ ఎంత ఉంటుంది ? అన్న‌దే స‌స్పెన్స్‌. ఇటీవ‌ల జ‌రిగిన పంచాయ‌తీ, మునిసిప‌ల్‌, కార్పోరేష‌న్ ఎన్నిక‌ల్లో తిరుప‌తి పార్ల‌మెంటు ప‌రిధిలో నూటికి నూరు శాతం సీట్ల‌ను వైసీపీ స్వీప్ చేసి ప‌డేసింది.

ఇక పార్ల‌మెంటు ప‌రిధిలో ఏడు నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు గ‌త ఎన్నిక‌ల్లో భారీ మెజార్టీల‌తో విజ‌యం సాధించ‌డంతో పాటు బ‌లంగా ఉన్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ వైసీపీకి ఏకంగా 2.28 ల‌క్ష‌ల ఓట్ల భారీ మెజార్టీ వ‌చ్చింది. ఈ సారి వైసీపీ 3 ల‌క్ష‌ల ఓట్ల మెజార్టీ టార్గెట్‌గా పెట్టుకుంది. అయితే ఇక్క‌డ జ‌గ‌న్ సౌండ్ జాతీయ స్థాయిలో విన‌ప‌డాలంటే 4 ల‌క్ష‌ల మెజార్టీ రావాల‌ని వైసీపీ నేత‌లు కొత్త టార్గెట్ నిర్దేశించుకున్నారు. ఎన్ని సానుకూల అంశాలు ఉన్నా.. గెలుపుపై ఎంత ధీమా ఉన్నా కూడా తిరుప‌తి, స‌ర్వేప‌ల్లి, గూడూరు, వెంక‌ట‌గిరిలో ప‌రిస్థితి మ‌రీ అంత వ‌న్‌సైడ్‌గా లేద‌ని వైసీపీ అంత‌ర్గ‌త స‌ర్వేల్లో తేలిన‌ట్టు స‌మాచారం.

ఈ నాలుగు సెగ్మెంట్ల‌లో వైసీపీకి అనుకున్న మెజార్టీ రాక‌పోతే 3-4 ల‌క్ష‌ల మెజార్టీ అసాధ్యంగా క‌నిపిస్తోంది. అందుకే ఇప్పుడు జ‌గ‌న్ స్వ‌యంగా ప్ర‌చారం రంగంలోకి దిగుతోన్న ప‌రిస్థితి. అటు బీజేపీ జాతీయ నాయ‌క‌త్వం సైతం తిరుప‌తిపై గ‌ట్టిగా ఫోక‌స్ పెట్టింది. జాతీయ నాయ‌కులు అంద‌రూ ఇక్క‌డే మ‌కాం వేశారు. ఆర్ఎస్ఎస్ ద‌ళాలు, హిందూత్వ సంస్థ‌లు చాప‌కింద నీరులా ప్ర‌చారం చేస్తున్నాయి. ఈ ప‌రిణామాలు వైసీపీలో ఆందోళ‌న‌కు కార‌ణ‌మ‌వుతున్నాయి. ఇక టీడీపీ రాష్ట్ర నాయ‌క‌త్వం అంతా ఈ పార్ల‌మెంటు ప‌రిధిలోనే మ‌కాం వేసి విస్తృతంగా ప్ర‌చారం చేస్తోంది.

స‌ర్వేప‌ల్లి, తిరుప‌తిలో మెజార్టీ 10 వేల లోపు ఉంటే గ‌త ఎన్నిక‌ల్లో వ‌చ్చిన మెజార్టీ కూడా రాద‌నే చ‌ర్చ‌లు కూడా అధికార పార్టీలో ఉన్నాయి. వైసీపీ అనుకున్న 3 ల‌క్షల మెజార్టీ రావాలంటే ఇక్కడ 50 వేలు రావాలి.. కానీ ఆ ప‌రిస్థితి లేదు. ఈ లెక్క‌న చూస్తే జ‌గ‌న్ పెట్టిన మెజార్టీ టార్గెట్ క‌ష్టంగానే క‌నిపిస్తోంది.