Begin typing your search above and press return to search.

టీటీడీకి కొత్త చైర్మన్‌.. నిజమేనా?

By:  Tupaki Desk   |   28 Dec 2022 10:30 AM GMT
టీటీడీకి కొత్త చైర్మన్‌.. నిజమేనా?
X
ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే ఎన్నికల్లో 175కి 175 సీట్లు సాధించాలని ఏపీ సీఎం జగన్‌ పెద్ద లక్ష్యమే పెట్టుకున్నారు. తన లక్ష్యసాధనలో భాగంగా ఆయన పలు నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల పార్టీ రీజినల్‌ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్ష పదవుల్లో పలు మార్పులను చేశారు. క్రియాశీలకంగా వ్యవహరించని కొంతమందిని పదవుల నుంచి తొలగించి కొత్తవారికి బాధ్యతలు అప్పగించారు.

ఇక వైసీపీ తమ రాజధాని అని చెప్పుకుంటున్న విశాఖపట్నం ఉన్న కీలకమైన ఉత్తరాంధ్రకు జగన్‌.. తన బాబాయ్‌ వైవీ సుబ్బారెడ్డిని రీజనల్‌ కోఆర్డినేటర్‌ గా నియమించారు. విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం జిల్లాల కోఆర్డినేటర్‌ గా ప్రస్తుతం వైవీ సుబ్బారెడ్డి ఉన్నారు. అంతేకాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్‌ గానూ వ్యవహరిస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైవీ సుబ్బారెడ్డే చైర్మన్‌ గా ఉండటం గమనార్హం.

వాస్తవానికి 2014లో వైవీ సుబ్బారెడ్డి ఒంగోలు ఎంపీగా గెలుపొందారు. 2019లో ఆయన ఒంగోలు ఎంపీగా పోటీ చేయలేదు. పార్టీ అవసరాల కోసం లిక్కర్‌ కింగ్‌ మాగుంట శ్రీనివాసులరెడ్డికి ఒంగోలు ఎంపీ సీటు ఇచ్చారు. దీంతో వైవీకి రాజ్యసభ సభ్యత్వం ఇస్తారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్‌ గా ఉండటానికే ఆసక్తి చూపారని.. దీంతో బాబాయ్‌ ఇష్టం మేరకే జగన్‌ ఆయనను టీటీడీ చైర్మన్‌ గా ఉంచారు.

టీటీడీ చైర్మన్‌ గా వచ్చే ఆగస్టు వరకు వైవీ సుబ్బారెడ్డి పదవీ కాలం ఉంది. ఇప్పటికే ఒక పర్యాయం ఆయన పదవీకాలం పూర్తవగా.. మరోమారు దీన్ని పొడిగించారు. రెండో పర్యాయం పదవీకాలం ఆగస్టుతో ముగియనుంది.

మరోవైపు ఉత్తరాంధ్రలో కీలక జిల్లాలైన విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం జిల్లాలకు కోఆర్డినేటర్‌గా వైవీ సుబ్బారెడ్డి కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో జోడు గుర్రాల స్వారీ తన బాబాయ్‌ కి కష్టమవుతుందనే అభిప్రాయంలో జగన్‌ ఉన్నట్టు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో ఆయనను సంక్రాంతి పండుగ ముగిసేవరకు టీటీడీ చైర్మన్‌ గా ఉంచి తర్వాత పూర్తిగా పార్టీ వ్యవహారాలకు వాడుకుంటారని చెబుతున్నారు. వైవీని విశాఖ, అనకాపల్లి, విజయనగరం జిల్లాల కోఆర్డినేటర్‌ గా ఉంచుతారని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడం అత్యంత కీలకం కాబట్టి పార్టీ వ్యవహారాలే ముఖ్యమనే భావనలో జగన్‌ ఉన్నారని తెలుస్తోంది. అందువల్ల టీటీడీకి కొత్త చైర్మన్‌ రాక తప్పదనే భావన వ్యక్తమవుతోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.