Begin typing your search above and press return to search.

జనసేనాని పవన్‌కు ముప్పు పొంచి ఉందా?

By:  Tupaki Desk   |   3 Nov 2022 3:47 AM GMT
జనసేనాని పవన్‌కు ముప్పు పొంచి ఉందా?
X
వైసీపీ ప్రభుత్వ విధానాలను తీవ్రంగా తూర్పూరబడుతున్నారు.. జనసేనాని పవన్‌ కల్యాణ్‌. మరోవైపు వచ్చే ఎన్నికల్లో జనసేన–టీడీపీ కలిసి పోటీ చేస్తే జగన్‌ కలవడం కష్టమనే విషయాన్ని విశ్లేషకులు కూడా తేల్చిచెబుతున్నారు. ఇంకోవైపు వైఎస్‌ జగన్‌ 175కు 175 సాధిస్తామని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యంగా జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ఇటీవల విశాఖ పర్యటనతో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. పవన్‌ పర్యటనను విశాఖలో పోలీసులు అడ్డుకోవడం, ఆయనతో దురుసుగా ప్రవర్తించడం, జనసేన కార్యకర్తలు, పవన్‌ అభిమానులపై లాఠీచార్జ్, పవన్‌ బస చేసిన హోటల్‌ రూమ్‌లో తెల్లవారుజాము వరకు సోదాలు నిర్వహించడం, పలువురు నేతలపై హత్యాయత్నం కేసులు పెట్టి అరెస్టు చేయడం... వెరసి ఈ అన్ని పరిణామాలపై చెప్పు తీసుకు కొడతా నా కొడకల్లారా అంటూ వైసీపీ నేతలకు పవన్‌ తీవ్ర హెచ్చరికలు జారీ చేయడంతో ఏపీ రాజకీయాలు హీటెక్కాయి.

మరోవైపు తనకు బెదిరింపులు వస్తున్నాయని పవన్‌ కల్యాణ్‌ ఇటీవల మంగళగిరి సమావేశంలో చెప్పిన సంగతి తెలిసిందే. తనను చంపేస్తామని, తన సతీమణిని, పిల్లలను చంపుతామంటూ కొంత మంది బెదిరిస్తున్నారని వెల్లడించారు.

పవన్‌ ఈ విషయం చెప్పి రెండు రోజులు గడవకముందే పవన్‌ కల్యాణ్‌ ఇంటి వద్ద ఒక ముఠా సంచరించింది. విశాఖ పర్యటన మరుసటి రోజు నుంచి పవన్‌ కల్యాణ్‌ను కార్లలోనూ, వాహనాల్లోనూ ఆ ముఠా అనుసరిస్తోందని జనసేన పార్టీ తాజాగా హైదరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

హైదరాబాద్‌లో పవన్‌ ఇంటి ముందు అర్ధరాత్రి పూట కారు పార్కింగ్‌ చేయడం, పవన్‌ కల్యాణ్‌ వాహనాన్ని క్షుణ్నంగా పరిశీలించడం, ఆయన రాకపోకలప్పుడు బైకులపైన, కార్లలోనూ వెంటాడం చేస్తున్నారని జనసేన పార్టీ తెలంగాణ ఇన్‌చార్జ్‌ శంకర్‌ గౌడ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అంతేకాకుండా ముగ్గురు వ్యక్తులు పవన్‌ కల్యాణ్‌ సెక్యూరిటీతో గొడవ పడ్డారని.. దుర్భాషలాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా పోలీసులకు అందించారు. అయితే వారెవరూ పవన్‌ కల్యాణ్‌ అభిమానులు కాదని తేలిందని జనసేన నేతలు చెబుతున్నారు. గొడవ సంగతి తెలిసి బయటకు వచ్చిన పవన్‌ కల్యాణ్‌ను సైతం దుర్భాషలాడుతూ అసభ్యంగా బూతులు తిట్టారని ఫిర్యాదు అందజేశారు.

కాగా పవన్‌ కల్యాణ్‌ను పవన్‌ కల్యాణ్‌ను అనుసరిస్తున్న ముఠాకు సంబంధించిన రెండు కార్లలో ఒక కారుపై ఏపీ రెడ్డి కార్పొరేషన్‌ చైర్మన్‌ పేరుతో నేమ్‌ ప్లేట్‌ ఉందని చెబుతున్నారు. పవన్‌ ఇంటి వద్ద గొడవ చేసిన ముగ్గురు వ్యక్తులను సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు అప్పగించారు.

దీంతో హైదరాబాద్‌లోని పవన్‌ నివాసం పోలీసులు హైఅలెర్ట్‌ ప్రకటించారు. ఆయనకు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మరోవైపు ఇది వైసీపీ నేతల కుట్రేనని జనసేన పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. పవన్‌ కల్యాణ్‌ను హత్య చేయడానికి కుట్ర జరుగుతోందని తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.