Begin typing your search above and press return to search.

జ‌న‌సేన పార్టీలో బ‌లిజ నేత‌లు ఆవేదన చెందుతున్నారా?

By:  Tupaki Desk   |   4 Aug 2022 8:30 AM GMT
జ‌న‌సేన పార్టీలో బ‌లిజ నేత‌లు ఆవేదన చెందుతున్నారా?
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌డ‌మే ల‌క్ష్యంగా జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ సిద్ధ‌మ‌వుతున్నారు. కౌలురైతు భ‌రోసా యాత్ర‌, రోడ్ల స‌మ‌స్య‌ల‌పై పోరాటం వంటివాటి ద్వారా ఆయ‌న ప్ర‌జ‌ల‌కు చేరువ అవుతున్నారు. ప్ర‌స్తుతం ప‌వ‌న్ తాను ఒప్పుకున్న సినిమాల‌ను పూర్తి చేసి పూర్తి స్థాయిలో ఇక రాజ‌కీయాల‌పై దృష్టి సారించ‌నున్నారు. ద‌స‌రా న‌వ‌రాత్రుల నుంచి పూర్తిగా ప్ర‌జా స‌మస్య‌ల‌పైనే త‌న పోరాటం ఉంటుంద‌ని ప‌వ‌న్ ఇప్ప‌టికే స్ప‌ష్టం చేశారు.

కాగా జ‌న‌సేన పార్టీకి రాయ‌ల‌సీమ‌లో ప్ర‌ధానంగా బ‌లిజ సామాజిక‌వ‌ర్గం కొమ్ముకాస్తోంది. ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌మ వాడు కావ‌డంతో బ‌లిజ‌లు ప‌వ‌న్ క‌ల్యాణ్ వెంటే న‌డుస్తున్నార‌ని అంటున్నారు. గ్రేటర్ రాయ‌ల‌సీమ జిల్లాల అయిన క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు, ప్ర‌కాశం, నెల్లూరు జిల్లాల్లో బ‌లిజ‌లు ఎక్కువ‌గా ఉన్నారు. అయితే వీరిలో కొంత‌మంది జ‌న‌సేనాని తీరుపై అసంతృప్తితో ఉన్నార‌ని గాసిప్స్ వినిపిస్తున్నాయి.

కాపులు ఒక్కో చోట ఒక్కోలా పిల‌వ‌బ‌డుతున్నారు. ఉత్త‌రాంధ్ర (శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం, విశాఖ‌ప‌ట్నం)ల్లో తూర్పు కాపులుగా, విశాఖ‌ప‌ట్నం స‌గం, తూర్పుగోదావ‌రి, ప‌శ్చిమ‌గోదావ‌రి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కాపులు (నాయుళ్లు)గా, గ్రేట‌ర్ రాయ‌ల‌సీమ‌లో బ‌లిజ‌లుగా, తెలంగాణ‌లో మున్నూరు కాపులుగా ఉన్నారు.

అయితే.. జ‌న‌సేన పార్టీలో నాలుగు జిల్లాల కాపుల‌కే ప్రాధాన్య‌త ల‌భిస్తోంద‌ని బ‌లిజ నేత‌లు అంటున్నార‌ని తెలుస్తోంది. ముఖ్యంగా తూర్పు గోదావ‌రి, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లా కాపులు పార్టీ కార్యాలయానికి వెళ్తే ఒక‌లా.. బ‌లిజ‌లు వెళ్తే ఒక‌లా ట్రీట్ చేస్తున్నార‌ని బ‌లిజ నేత‌లు త‌మ‌లో తాము అంత‌ర్మ‌థ‌నం చెందుతున్నారంట‌.

కోస్తా జిల్లాల వాళ్ల‌ను మాత్ర‌మే అస‌లైన కాపులుగా ట్రీట్ చేస్తున్నార‌ని, త‌మ‌ను మాత్రం ద్వితీయ శ్రేణి నేత‌లుగా, రెండో త‌ర‌గ‌తి పౌరులుగా చూస్తున్నార‌ని రాయ‌ల‌సీమ బ‌లిజ‌లు ఆవేద‌న చెందుతున్నార‌ని తెలుస్తోంది.

ఇలాంటివాటికి ఆదిలోనే అడ్డుకట్ట వేయ‌క‌పోతే పార్టీకి ప్ర‌మాద‌క‌ర‌మ‌ని బ‌లిజ నేత‌లు చెబుతున్నార‌ట‌. త్వ‌ర‌లోనే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ను సైతం క‌లిసి త‌మ ఆవేద‌నను ఆయ‌న దృష్టికి తీసుకెళ్లాల‌నే ఆలోచ‌న‌లో బ‌లిజ నేత‌లు ఉన్నార‌నే టాక్ న‌డుస్తోంది.