Begin typing your search above and press return to search.

కందుకూరు విషాదం...రాజకీయ వైఫల్యం

By:  Tupaki Desk   |   29 Dec 2022 8:53 AM GMT
కందుకూరు విషాదం...రాజకీయ వైఫల్యం
X
నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగిన చంద్రబాబు రోడ్ షోలో తొక్కిసలాట జరిగి ఏకంగా ఎనిమిది మంది అమాయకులు ప్రాణాలను కోల్పోయారు. ఇది దేశమంతా కలకలం రేపిన ఘటనగా అంతా చూస్తున్నారు. అయితే ఈ ఘటన నుంచి కూడా రాజకీయాలు చూస్తూ అధికార విపక్షాలు చేస్తున్న రాజకీయ క్రీడ అయితే జుగుప్సాకరంగా ఉంది.

ఒక విధంగా చెప్పాలీ అంటే ఇది రాజకీయ వ్యవస్థ వైఫల్యం అని అంటున్నారు. ఈ మధ్య చంద్రబాబు సభలకు జనాలు భారీ ఎత్తున వస్తున్నారు. అయితే ప్రతిపక్ష నేత సభలు అయినా సరే అక్కడ ఉండేది ప్రజలే కాబట్టి కావాల్సిన పోలీస్ బందోబస్తు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అదే టైం లో విపక్షం కూడా తమకు ఎంతమంది జనాలు వచ్చారు అన్నది ఆర్భాటం చేయకుండా సభను నిర్వహించుకోవాల్సి ఉంది.

కానీ ఇక్కడే అధికార విపక్ష పార్టీలు రెండూ గాడి తప్పేశాయి. ఎక్కువ మంది జనాలు వస్తే సూపర్ హిట్ అని లేకపోతే ఫ్లాప్ అని కొలమానం పెట్టుకుంటున్న రాజకీయ పార్టీలు తమ సభలకు వచ్చిన జనాల భద్రత విషయాన్ని గాలికి వదిలేస్తున్నాయి. ఆ విధంగా చూస్తే కందుకూరు ఘటనలో మరణించిన వారి విషయంలో రాజకీయ వ్యవస్థ పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంటుందని అంటున్నారు.

ఇక చంద్రబాబు సభ కోసం కందుకూరులోని ఇరుకు సందును టీడీపీ ఎంచుకుందని, డ్రోన్ కెమెరాల ద్వారా ఎక్కువ సంఖ్యలో జనాలు వచ్చారని చూపించుకునే ప్రయత్నమే ఈ రకంగా చేయడానికి కారణం అని అధికార వైసీపీ నేతలు మంత్రులు ఆరోపిస్తున్నారు. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అయితే ఇది చంద్రబాబు ప్రచార యావ తప్ప మరోటి కాదని తేల్చేస్తున్నారు అలాగే మాజీ మంత్రి కొడాలి నాని అయితే బాబు ప్రచార ఆర్భాటానికి పుష్కరాల సమయంలో 29 మంది చనిపోతే ఇపుడు మరో ఎనిమిది మంది బలి అయ్యారని అంటున్నారు.

ఇక తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరుకుంటుందా అందుకే ఆ పార్టీ కూడా ఇది ప్రభుత్వ వైఫల్యం పోలీసుల వైఫల్యం అని నిందిసోంది. బాబు సభలకు పెద్ద ఎత్తున జనాలు వస్తే వారికి తగిన బందోబస్తు ఇవ్వాల్సిన బాధ్యత లేదా అని ఎదురుదాడి చేస్తోంది. అదే ముఖ్యమంత్రి జగన్ సభలకు లక్షలలో జనాలు వచ్చినా కూడా బందోబస్తును చేసే పోలీసులు విపక్ష నేత విషయంలో ఎందుకు ఇలా వివక్ష చూపారని అంటున్నారు.

సరే చూస్తే రెండు వైపుల వాదనలో కొంత నిజం ఉంది. కొంత అతి ఉంది. ఏది ఎలా ఉన్నా అమాయక ప్రజలే ప్రాణాలు కోల్పోయారు అన్నది వాస్తవం. నిజానికి పార్టీ సభలు బల ప్రదర్శన కాదు, ప్రజలకు తమ పార్టీ తరఫున మేసేజ్ ఇవ్వడమే ఉద్దేశ్యం. కానీ అలా చేయడానికి టీడీపీ చూస్తోందని వైసీపీ అంటోంది. విశాలమైన స్థలాలలో బహిరంగ సభను నిర్వహించి ఉంటే బాగుండేది అని అంటున్నారు.

అయితే వారూ వీరూ విమర్శలు మాని ఇక మీదట అయినా ఇలాంటి రద్దీని తొక్కిసలాటను అదుపు చేసే విధంగా చూస్తే బాగుంటుంది. ఏపీలో ఉప్పు నిప్పులా తెలుగుదేశం వైసీపీల మధ్య రాజకీయం సాగుతున్న వేళ ఇలాంటి విషాదాల నుంచి అయినా రెండు పార్టీలు కొంత మేలుకుని సమన్వయంతో పనిచేయాలని అంతా కోరుతున్నారు. పోయిన ప్రాణాలు ఎటూ తిరిగిరావు. ఎవరు ఏ పార్టీ అభిమానులు అయినా ముందు ప్రజలు. దాన్ని దృష్టిలో పెట్టుకుని రాజకీయ వ్యవస్థ ముందుకు సాగితేనే ఇలాంటి విషాదాలు పునరావృత్తం కావు అని అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.