Begin typing your search above and press return to search.

బాహుబలి రచయిత రాజ్యసభ నామినేషన్ కు కంగనా కారణమా..?

By:  Tupaki Desk   |   8 July 2022 6:04 AM GMT
బాహుబలి రచయిత రాజ్యసభ నామినేషన్ కు కంగనా కారణమా..?
X
కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలకు చెందిన నలుగురు ప్రముఖులను రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. సంగీత దర్శకుడు ఇళయరాజా - సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ - పరుగుల రాణి పీటీ ఉషా - సామాజిక సేవా కార్యకర్త వీరేంద్ర హెగ్డేలకు అవకాశం కల్పించారు. ఈ మేరకు బుధవారం ప్రధాని మోడీ ట్వీట్ చేస్తూ.. వారి సేవలను కొనియాడారు.

''కె. విజయేంద్ర ప్రసాద్ గారు దశాబ్దాలుగా సృజనాత్మక రంగంతో ప్రత్యేక అనుబంధం కలిగి ఉన్నారు. అతని రచనలు దేశ సంస్కృతిని ప్రతిబింబిస్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చాయి. ఆయన రాజ్యసభకు నామినేట్ అయినందుకు నా అభినందనలు'' అని మోడీ తెలుగులోనే ట్వీట్ చేశారు.

ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో బాహుబలి రచయితకు అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్నో సేవలు చేసిన ఎందరో లెజెండరీ వ్యక్తులు ఎగువ సభకు నామినేషన్లు పొందలేదు. అందుకే కేంద్ర ప్రభుత్వం విజయేంద్ర ప్రసాద్ పేరును రాజ్యసభకు నామినేట్ చేసినట్లు ప్రకటించినప్పుడు టాలీవుడ్ లో చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

సృజనాత్మక రంగంతో అతని రచనలు దేశ సంస్కృతిని ప్రతిబింబిస్తాయని ప్రధాని కొనియాడినప్పటికీ.. విజయేంద్ర ప్రసాద్ ఇప్పటి వరకు అందించిన కథలన్నీ కమర్షియల్ సినిమాల కోసమే అనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమ రచనలతో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి.. సమాజం కోసం కృషి చేసిన వారిని కాదని RRR రైటర్ ను పెద్దల సభకు నామినేట్ చేయడం ఏంటని కామెంట్స్ చేసినవారు కూడా ఉన్నారు.

ఈ నేపథ్యంలో విజయేంద్ర ప్రసాద్ రాజ్యసభ నామినేషన్ పై సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన రూమర్ చక్కర్లు కొడుతోంది. దీని వెనుక బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఉన్నారని అంటున్నారు. స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ అధికార భారతీయ జనతా పార్టీకి చాలా సన్నిహితంగా ఉండే సెలబ్రిటీలలో ఒకరనే సంగతి తెలిసిందే.

ఎల్లప్పుడూ ప్రతిపక్షాలను వినర్శిస్తూ.. కేంద్రంలోని ప్రభుత్వ విధానాలకు మద్దతునిస్తుంది. అలానే విజయేంద్ర ప్రసాద్ - కంగనా మధ్య సన్నిహిత్యం ఉంది. ఓ సందర్భంలో ఆయన పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంది. ఆమె నటించిన 'మణికర్ణిక' 'తలైవా' సినిమాలతో పాటుగా 'సీత' చిత్రానికి ఆయనే కథ అందించారు.

విజయేంద్ర ప్రసాద్ మీదున్న అభిమానంతో కంగనా ఆయన పేరును సిఫారసు చేసిందని రూమర్స్ వస్తున్నాయి. అర్హత ఉన్న తెలుగు సెలబ్రిటీల జాబితా కేంద్రం వద్ద ఉండగా.. అగ్ర రచయితకు అవకాశం కల్పించాలని కంగనా కోరి ఉండొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీజేపీ హయాంలోనే కంగనా కు అవార్డులు రావడం పై అప్పట్లో విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.

ఇక కేంద్ర ప్రభుత్వ పెద్దలతో విజయేంద్ర ప్రసాద్ కుమారుడు, దర్శకుడు రాజమౌళి కూడా సన్నిహితంగానే ఉంటుంటారని.. ఆయన తండ్రిని రాజ్యసభ కు పంపించడానికి ఇది కూడా ఒక కారణమని నెట్టింట పుకార్లు పుట్టుకొస్తున్నాయి.

వీటన్నింటినీ పక్కన పెడితే, విజయేంద్ర ప్రసాద్ భారతీయ చిత్రపరిశ్రమలో సక్సెస్ ఫుల్ సినీ రచయిత. బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన 'బాహుబలి' 'ఆర్ఆర్ఆర్' చిత్రాల కథలను రాసింది ఆయనే. కేవలం తెలుగులోనే కాకుండా బాలీవుడ్ ‏లో విజయవంతమైన చిత్రాలకు స్క్రిప్ట్ అందించారు.

తనయుడు రాజమౌళి సక్సెస్ లో ఆయనకు కూడా మేజర్ క్రెడిట్ ఇవ్వాలి. ప్రస్తుతం పాన్ ఇండియా రచయితగా ప్రశంసించబడుతున్న విజయేంద్ర ప్రసాద్.. పెద్దల సభకు నామినేట్ అవ్వడంతో సినీ ఇండస్ట్రీలో అతనికి మరింత గౌరవం దక్కుతుంది.