Begin typing your search above and press return to search.

'కాపులప్పాడ' బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ కాబోతోందా?

By:  Tupaki Desk   |   19 Aug 2020 5:31 PM GMT
కాపులప్పాడ బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ కాబోతోందా?
X
సినిమా పరిశ్రమ అంతా చెన్నై కేంద్రంగా ఉన్నప్పుడు వారిని హైదరాబాద్ రప్పించడానికి.. ఇక్కడ సినీ పరిశ్రమ అభివృద్ధి చేయడానికి నాటి సీఎం ఎన్టీఆర్ సినీ వర్గాలకు భూములు, స్థలాలు ఉచితంగా ఇచ్చారు. స్టూడియోల నిర్మాణం కోసం విరివిగా భూములు కేటాయించారు. సినీ పరిశ్రమ పెద్దలందరికీ బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లోని ఖాళీ గుట్టలను కానుకగా ఇచ్చాడు. అప్పుడు ఎందుకు పనికిరాని..నివాసయోగ్యం కానీ.. నీటి వసతి లేని ఈ ప్రాంతం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత ఖరీదైన ప్రాంతంగా వర్ధిల్లుతోంది. ఇప్పుడు విశాఖలోనూ ‘కాపులప్పాడ’కు అదే ఘనత రాబోతోందని విశాఖ వాసులు మురిసిపోతున్నారు.

ఏపీ మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదం లభించింది. ప్రస్తుతం కోర్టుల్లో న్యాయచిక్కులు పూర్తికాగానే సీఎం జగన్ రాజధానిని విశాఖకు తరలించడానికి సిద్ధంగా ఉన్నారు. వైజాగ్ లో పరిపాలన రాజధాని ప్రాంతం కూడా ఇది వరకే ఖాయం చేశారట. సచివాలయం కూడా కన్ఫం అయ్యిందని.. అక్కడ పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ నడుస్తోందని జోరుగా ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం విశాఖ పరిపాలన రాజధాని ప్రాంతం భీమిలీలోని ‘కాపులప్పాడ’ అని.. అక్కడ 30 ఎకరాలను ప్రభుత్వం తీసుకొని సచివాలయం సహా అన్ని ప్రభుత్వ భవనాలను ఒకేచోట ఒకే క్యాంపస్ లో నిర్మాణం జరుగబోతోందని ప్రచారం సాగుతోంది. పరిపాలన అంతా కాపులప్పాడ నుంచే చేయబోతున్నారని సమాచారం. ఇప్పటికే కొబ్బరికాయ కూడా కొట్టారని.. 9 నెలల్లోనే సచివాలయ నిర్మాణం పూర్తి చేసి సర్వాంగ సుందరంగా రెడీ చేస్తారని విశాఖలో పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు.

రాజధాని ప్రకటనకు ముందు ఆ ప్రాంతంలో గజం కేవలం 4-5 వేలు మాత్రమే ఉండగా.. ఇప్పుడు ఏకంగా రాత్రికి రాత్రే రియల్ ఎస్టేట్ బిజినెస్ ఊపందుకొని గజం ఏకంగా 15-20వేలు అయ్యిందని సమాచారం. ప్రస్తుత ఊపు చూస్తుంటే ‘కాపులప్పాడ’ భవిష్యత్తులో హైదరాబాద్ లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ అవుతుందని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.