Begin typing your search above and press return to search.

19 ఎమ్మెల్యేల‌ను లాగేందుకు క‌రుణ య‌త్నం?

By:  Tupaki Desk   |   11 Dec 2016 6:03 AM GMT
19 ఎమ్మెల్యేల‌ను లాగేందుకు క‌రుణ య‌త్నం?
X
త‌మిళ‌నాడులో రాజ‌కీయం ర‌స‌కందాయంలో ప‌డుతున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. మెజార్టీ ప్ర‌కారం 19 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ప్ర‌తిప‌క్ష డీఎంకేకు మ‌ద్ద‌తిచ్చిన ప‌క్షంలో అధికార పీఠం మారిపోతుంది. ఈ నేప‌థ్యంలో డీఎంకే అధినేత క‌రుణానిధి పావులు క‌దుపుతున్న‌ట్లు స‌మాచారం. ఉప్పునిప్పుగా ఉండే డీఎంకే అధినేత త‌న‌యులైన అళ‌గిరి, స్టాలిన్‌లు స‌మావేశం అవ‌డం, మ‌రోవైపు క‌రుణానిధితో సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ భేటీ అవ‌డం వంటివి ఈ అంచనాల‌కు ఆజ్యం పోస్తున్నాయి. అదే స‌మ‌యంలో క‌రుణానిధి ఇపుడిపుడే అధికార పీఠాన్ని అన్నాడీఎంకే నుంచి కైవ‌సం చేసుకోవ‌డ‌మ‌నే తొంద‌ర‌పాటు నిర్ణ‌యం తీసుకోక‌పోవచ్చున‌ని కూడా చెప్తున్నారు.

234 మంది ఎమ్మెల్యేలున్న తమిళనాడు శాసనసభలో ప్ర‌తిప‌క్ష డీఎంకే, దాని మిత్ర పక్షాలకు 98 మంది శాసనసభ్యులు ఉన్నారు. అధికార పీఠాన్ని చేజిక్కుంచుకునే మెజార్టీ లెక్క‌ల ప్ర‌కారం అధికార అన్నాడీఎంకే నుంచి 19 మంది శాసనసభ్యులను తమ వైపు తిప్పుకుంటే డీఎంకె, దాని మిత్రపక్షాలు గ‌ద్దెనెక్కే అవ‌కాశం ఉంటుంది. ఈ నేప‌థ్యంలో వ్యూహ‌ర‌చ‌న చేసేందుకు త‌న సార‌థ్యంలో అన్న‌ద‌మ్ములైన అళ‌గిరి-స్టాలిన్‌ల‌తో క‌రుణ స‌మావేశం ఏర్పాటు చేశార‌ని అంటున్నారు. డిసెంబ‌రు 20న డీఎంకే అత్య‌వ‌స‌ర స‌మావేశం ఏర్పాటు చేయ‌డం కూడా ఇందుకు ఆజ్యం పోస్తోంది.అయితే దూకుడు ప్ర‌ద‌ర్శించ‌కుండా ఆలోచ‌నాత్మ‌క దోర‌ణితో ముందుకుసాగాల‌ని డీఎంకే వ‌ర్గాలు భావిస్తున్న‌ట్లు స‌మాచారం. ప‌న్నీర్ సెల్వం సీఎంగా ప‌గ్గాలు చేప‌ట్ట‌డం, ప్రధాన కార్య‌ద‌ర్శి ప‌ద‌విని శ‌శిక‌ళ స్వీక‌రించ‌డం వంటివి అన్నాడీఎంకేలో ఎలాంటి ప‌రిణామాల‌కు దారితీస్తాయో ముందుగా అంచ‌నా వేయాల‌ని డీఎంకే వ‌ర్గాలు చూస్తున్నాయి. అంతేకాకుండా అన్నాడీఎంకే స‌ర్కారుకు ప‌రోక్షంగా బీజేపీ మ‌ద్ద‌తిస్తున్న నేప‌థ్యంలో ఒకింత సంయమ‌నం పాటించ‌డం మంచిద‌ని క‌రుణా భావిస్తున్న‌ట్లుగా స‌మాచారం.

ఇదిలాఉండ‌గా డీఎంకే అధినేత క‌రుణానిధితో సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ స‌మావేశం అవ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఇటీవ‌లే ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జీ అయిన క‌రుణ‌ను ప‌రామ‌ర్శించేందుకు ర‌జినీ వెళ్లిన‌ప్ప‌టికీ...ఈ క‌ల‌యిక‌ను ప‌లువురు రాజ‌కీయ కోణంలో చూస్తుండటం విశేషం.