Begin typing your search above and press return to search.

కాశ్మీర్ ఎన్నికలు ఇప్పట్లో కష్టమేనా ?

By:  Tupaki Desk   |   28 Jun 2021 5:34 AM GMT
కాశ్మీర్ ఎన్నికలు ఇప్పట్లో కష్టమేనా ?
X
ప్రతిపక్ష నేతలంతా కోరుకుంటున్నట్లు జమ్మూ-కాశ్మీర్ ఎన్నికలు ఇప్పట్లో జరగటం కష్టమనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎక్కడో స్విచ్ వేస్తే ఇంకెక్కడో లైట్ వెలిగినట్లు తొందరలోనే జమ్మూ-కాశ్మీర్ కు ఉగ్రవాద ముప్పు పెరిగిపోవటం ఖాయమని ఇంటెలిజెన్స్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. దాంతో కాశ్మీర్ లో ఇప్పట్లో ఎన్నికలు జరిగే అవకాశాలు దాదాపు లేవనే విషయం స్పష్టమైపోతోంది.

ఇంతకీ విషయం ఏమిటంటే ఆఫ్ఘనిస్ధాన్ దేశం నుండి అమెరికా దళాలు తరలిపోతున్నాయి. దాదాపు రెండు దశాబ్దాలుగా ఆఫ్ఘానిస్ధాన్ లో అమెరికా దళాలు మోహరించిన కారణంగా తాలిబన్ల ప్రాబల్యం దాదాపు తగ్గిపోయాయి. అయితే తాలిబన్లకు వివిధ దేశాల నాటో దళాలకు మధ్య జరిగిన ఒప్పందాల్లో భాగంగా అమెరికా దళాలు సెప్టెంబర్ 11వ తేదీకి పూర్తిగా ఆఫ్ఘానిస్ధాన్ నుండి వెళ్ళిపోవాలి. దాని ప్రకారం అమెరికా సైన్యం వెళ్ళిపోవటం ఇఫ్పటికే మొదలైపోయింది.

ఒప్పందం ప్రకారం ఆఫ్ఘానిస్ధాన్ నుండి అమెరికా దళాలు వెళ్ళిపోయేంతవరకు అమెరికా సైనికులపై తాలిబాన్లు దాడులు చేయకూడదు. అటు అమెరికా సైన్యం ఇటు తాలిబన్లు ఒప్పందానికి కట్టుబడున్నారు. అందుకనే తాలిబన్లు ఆఫ్ఘనిస్ధాన్ సైన్యం, పోలీసులపైనే దాడులు చేస్తోంది. తాలిబన్లకు అవసరమైన ఆయుధాలు, నిధులు, సాంకేతిక సాయం మొత్తం పాకిస్ధాన్ నుండే అందుతోందనేది బహిరంగ రహస్యం. అమెరికా సైన్యం ఆఫ్ఘనిస్ధాన్ నుండి ఎప్పుడెప్పుడు ఖాళీ అయిపోతుందాని పాకిస్ధాన్ కాచుక్కూర్చుంది.

ఎప్పుడైతే ఆఫ్ఘనిస్ధాన్ నుండి అమెరికా సైన్యం వెళిపోతుందో అప్పటినుండే పాకిస్ధాన్ లోని తీవ్రవాదులు, ఐఎస్ఐ ఉన్నతాధికారులు, తాలిబన్లు ఏకమైపోతారు. వీళ్ళముగ్గురు ఏకమయ్యారంటే ముందు గురిపెట్టేది ఇండియా మీదే. ఇండియా అంటే ప్రధానంగా జమ్మూ-కాశ్మీర్ అనే అర్ధం. అంటే కళ్ళముందు ఇంతటి తీవ్రవాద ముప్పు పెట్టుకుని ఏ ప్రభుత్వం కూడా ఎన్నికలకు వెళ్ళదు. కాబట్టి ఆఫ్ఘనిస్ధాన్ లో డెవలప్మెంట్లు కచ్చితంగా ఇండియా మీదే పడుతుంది. మరి సెప్టెంబర్ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాల్సిందే.