Begin typing your search above and press return to search.

ఆ సంప్రదాయం టీఆర్ ఎస్ కు వర్తించదా?

By:  Tupaki Desk   |   24 Feb 2019 9:35 AM GMT
ఆ సంప్రదాయం టీఆర్ ఎస్ కు వర్తించదా?
X
సికింద్రాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పద్మారావును శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా ప్రతిపాదిస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి తాజాగా అసెంబ్లీలో ప్రతిపాదన పెట్టిన సంగతి తెలిసిందే. పద్మారావు ఏకగ్రీవ ఎన్నికకు సహకరించాల్సిందిగా అధికార టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ అసెంబ్లీలోని కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ ఆఫీస్ కు వెళ్లి మరీ అభ్యర్థించాడు. సీఎల్పీ ఆఫీసులో ఆ పార్టీ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క ఉండగా.. పీసీసీ చీఫ్ ఉత్తమ్ లేకపోవడంతో అరగంటపాటు కేటీఆర్ ఎదురుచూశారు. ఉత్తమ్ రాగానే కేటీఆర్, తలసాని, ప్రశాంత్ రెడ్డిలు పద్మారావు ఏకగ్రీవ ఎన్నిక కోసం కాంగ్రెస్ నేతలను అభ్యర్థించారు.

తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం విషయంలో తమతో కలిసి వచ్చి ఎన్నికకు సహకరించినందుకు ధన్యవాదాలని.. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు కూడా సహకరించాలని ఉత్తమ్, భట్టిలకు కేటీఆర్ విన్నవించారు.

కేసీఆర్ విన్నపానికి అంగీకరించిన ఉత్తమ్-భట్టి.. పద్మారావు ఏకగ్రీవ ఎన్నికకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. అదే సమయంలో 5వ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పోటీ పెట్టకూడదని.. కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు సహకరించాలని కేటీఆర్ కు మెలిక పెట్టారు ఉత్తమ్-భట్టి. బలం లేకున్నా 5వ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిని టీఆర్ఎస్ తరుఫున కేసీఆర్ ఎందుకు నిలబెట్టారని మల్లు భట్టి విక్రమార్క కేటీఆర్ ను ప్రశ్నించాడు.

మా ఎమ్మెల్యేలను క్రాస్ ఓటింగ్ వేయించి టీఆర్ ఎస్ 5 వ అభ్యర్థిని గెలిపించుకునే కుట్రను కేసీఆర్ చేస్తున్నారని భట్టి విమర్శించారు. అసెంబ్లీ సంప్రదాయాలు కేవలం కాంగ్రెస్ కు మాత్రమే వర్తిస్తాయా? టీఆర్ ఎస్ కు కాదా అని కేటీఆర్ ను ఉత్తమ్ కుమార్ రెడ్డి నిలదీసినట్టు సమాచారం. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చీల్చి ఓటు వేయించుకోవాలనే కుట్రతోనే 5వ అభ్యర్థిని నిలబెట్టారా అని ఉత్తమ్ నిలదీశాడట..

5వ ఎమ్మెల్సీ సీటు గెలవడానికి ప్రస్తుతం టీఆర్ ఎస్ కు ఎనిమిది మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉంది. దీనికి తోడు ఎంఐఎం ఏడుగురు ఎమ్మెల్యేలు మద్దతిస్తే 5వ ఎమ్మెల్సీ సీటు గెలుచుకోవచ్చు. ఈ విషయంలో తాను ఏమీ చెప్పలేనని.. మీరే కేసీఆర్ తోనే ఈ విషయంపై మీరు చర్చించాలని, నేనూ దృష్టికి తీసుకెళ్తానని కేటీఆర్ చెప్పి అక్కడి నుంచి జారుకున్నారట.. ఇలా 5వ ఎమ్మెల్సీ సీటు వ్యవహారంలో టీఆర్ఎస్ దూకుడును పీసీపీ చీఫ్, సీఎల్పీ నేత భట్టి కడిగేయడం అసెంబ్లీలో హాట్ టాపిక్ గా మారింది.