Begin typing your search above and press return to search.

కేసీఆర్ లో బయటకు రాని పెద్దరికం.. కేంద్రానికి ఛాన్సు ఇచ్చారే?

By:  Tupaki Desk   |   16 July 2021 3:37 AM GMT
కేసీఆర్ లో బయటకు రాని పెద్దరికం.. కేంద్రానికి ఛాన్సు ఇచ్చారే?
X
మొండితనం సమస్యలకు పరిష్కారం ఎంతమాత్రం కాదు. ఎప్పుడు తగ్గాలన్నది తెలియనంత వరకు పరిపూర్ణత ఉండదు. తగ్గి నెగ్గటం ముఖ్యమే తప్పించి.. తగ్గటంతో చోటు చేసుకునే చేటు ఉండదన్న విషయాన్ని మర్చిపోకూడదు. తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరించిన తీరు.. దీనికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జత కలవటం.. ఇరువురి తీరు పుణ్యమా అని.. విషయం కేంద్రం చేతుల్లోకి వెళ్లటం గమనార్హం.

కేంద్రంలోని మోడీ సర్కారు విశాల మనసుతో ఇప్పటివరకు రాష్ట్రాలకు చేసిందేమీ లేదన్న మాట సర్వత్రా వినిపిస్తున్న వేళ.. బంతిని కేంద్రం వైపునకు నెట్టటం ఏ మాత్రం సరికాదనే మాట పలువురు నిపుణుల నోటి నుంచి వినిపిస్తోంది. ఇటీవల కాలంలో అనూహ్యంగా తెర మీదకు వచ్చిన జలజగడం.. అంతకంతకూ ముదరటం.. రెండు రాష్ట్రాలు పోటాపోటీగా ఆరోపణలు సంధించుకోవటంతోపాటు.. దేశ అత్యున్నత న్యాయస్థానంతో పాటు కేంద్రాన్ని ఆశ్రయిస్తున్నారు. తమ ప్రయోజనాల్ని దెబ్బ తీస్తున్నాయంటూ రెండు రాష్ట్రాలు వాదించుకుంటాయి.. ఒకరిపై ఒకరు ఘాటు విమర్శలు చేసుకుంటారు.

ఈ తరహా పంచాయితీతో సమస్యలు పరిష్కారం కావటం సాధ్యం కాదు. అంతేనా? సమస్యను ఒక కొలిక్కి తీసుకురావటానికి ఇప్పుడున్న వాతావరణం కూడా సహకరించదు. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితులు నెలకొన్నప్పుడు పెద్ద మనిషిగా.. రాజకీయంగా సీనియర్టీతో పాటు మేధావి అన్న ట్యాగ్ ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దరికాన్ని ప్రదర్శించాల్సిన అవసరం చాలా ఉంది. ఒకవేళ ఏపీనే తప్పు చేసిందని అనుకుందాం. అలాంటప్పుడు.. మీరిలాంటి తప్పులు చేయటం వల్ల తెలుగు ప్రజలకు జరిగే నష్టం ఏమిటన్న విషయాన్ని వివరించి చెప్పాల్సిన అవసరం ఉంది. అంతే కాదు.. నువ్వు ఒకటంటే.. నేను రెండంటా. నువ్వు రెండు అంటే.. నేను నాలుగు అంటాననే వైఖరితో సమస్యలు అంతకంతకూ ముదురుతాయే తప్పించి.. వాటికి పరిష్కారాలు లభించవు.

తమ రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల పంచాయితీని తీర్చాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రాన్ని కోరటం తెలిసిందే. ఇలాంటి సన్నివేశం కోసమే ఎదురుచూస్తున్న కేంద్రం తాజాగా రంగంలోకి దిగటానికి సిద్ధమైంది. రెండు రాష్ట్రాల్లో విస్తరించిన కృష్ణా, గోదావరి బేసిన్‌ ప్రాజెక్టుల నిర్వహణను రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్నట్లు కృష్ణా, గోదావరి బోర్డులకు అప్పగించేందుకు రెఢీ అయ్యింది.దీనికి సంబంధించిన కీలక గెజిట్ ను ఈ రోజు (శుక్రవారం) జారీ చేస్తుందని చెబుతున్నారు. దీనికి సంబంధించిన ముహుర్తాన్ని కూడా డిసైడ్ చేశారని చెబుతున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ రోజు మధ్యాహ్నం 1.45 గంటల వేళలో ఢిల్లీలోని శ్రమశక్తి భవన్ లో జరిగే కార్యక్రమంలో గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తారని చెబుతున్నారు.

సమస్యలు ఎదురైనప్పుడు పరిష్కారం కోసం పెద్ద మనుషులకు వద్దకు వెళ్లటం సహజమే. రెండు తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా ఉన్న ఇద్దరు అధినేతలు.. వారికున్న రాజకీయ అనుభవం.. రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రయోజనాలే కాదు.. రాష్ట్రం ఏదైనా తెలుగు వారంతా బాగుండాలనే విశాలతత్త్వం చాలా అవసరం. అంతేకాదు.. పోటాపోటీగా వాతావరణాన్ని వేడెక్కించటం.. కేంద్రానికి పగ్గాలు ఇవ్వటం సరికాదన్న మాట పలువురి నోటి నుంచి వినిపిస్తోంది. దీనికి తగ్గట్లే తాజాగా తెలంగాణ ప్రభుత్వం కేంద్రం జోక్యానికి.. బోర్డుకు అప్పజెప్పటాన్ని ఒప్పుకోవటం లేదంటున్నారు.

కేంద్రం తమ వాదనను పరిగణలోకి తీసుకోకుండా నిర్ణయం తీసుకుంటే.. ఆయా అంశాల్ని సుప్రీంలో సవాలు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. అన్నామంటే అన్నామని కానీ.. ఇలాంటి పరిస్థితులకు ఫల్ స్టాప్ పెట్టే సమర్థత.. సామర్థ్యం ఉన్న కేసీఆర్.. తనలో దాగి ఉన్న పెద్దరికాన్ని బయటకు తీస్తే.. కేంద్రానికి తీర్పు చెప్పే అవకాశం ఉండేది కాదు కదా? అనే మాట వినిపిస్తోంది. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ ఎందుకు పట్టించుకోవటం లేదు. కేంద్రం నిర్ణయాన్ని తప్పు పట్టే ముందు.. అసలు అలాంటి అవకాశాన్ని ఇవ్వకుండా గులాబీ బాస్ ఎందుకు చేయట్లేదన్నది ఇప్పుడు అసలు ప్రశ్నగా మారిందని చెప్పక తప్పదు.