Begin typing your search above and press return to search.

కొండగట్టు కుటుంబాల్ని వదిలి బిహార్ కు వెళ్లటమా కేసీఆర్?

By:  Tupaki Desk   |   1 Sep 2022 3:30 PM GMT
కొండగట్టు కుటుంబాల్ని వదిలి బిహార్ కు వెళ్లటమా కేసీఆర్?
X
మరో పది రోజులు ఆగితే సరిగ్గా నాలుగేళ్లు అవుతుంది కొండగట్టు బస్సు ప్రమాదం చోటు చేసుకొని. 2018లో కొండగట్టు ఘాట్ రోడ్డు మీద టీఎస్ ఆర్టీసీ బస్సు బోల్తా పడటం.. ఆ ప్రమాదంలో అక్కడిక్కడే 24 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 41 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

మరింత మంది ప్రమాదంలో తగిలిన గాయాల కారణంగా నేటికి మంచాలకే పరిమితమైన పరిస్థితి. బస్సు ప్రమాదంలో బాధితుల్లో పలువురికి ఇప్పటికి పరిహారం అందలేదన్న విమర్శ ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన అత్యంత దారుణ రోడ్డు ప్రమాదాల్లో కొండగట్టు ప్రమాదం ఒకటిగా చెప్పొచ్చు.

ఈ ప్రమాదంలో చనిపోయిన కుటుంబాల్ని పరామర్శించేందుకు తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తారని భావించినా.. అది మాత్రం జరగలేదు. సాధారణంగా పెను ప్రమాదం చోటు చేసుకున్న వెంటనే హుటాహుటిన ముఖ్యమంత్రి వెళ్లటం.. అక్కడి పరిస్థితుల్ని సమీక్షించటం.. బాధితులకు పరామర్శలతో పాటు.. బాధిత కుటుంబాల్ని ఓదార్చే కార్యక్రమాన్ని చేస్తుంటారు.

కానీ.. కేసీఆర్ మాత్రం అందుకు భిన్నంగా కొండ గట్టు బాధితుల కుటుంబాల్ని నేరుగా పరామర్శించింది లేదు. సాంకేతిక కారణాల్ని చూపిస్తే.. ఈ ప్రమదంలో మరణించిన వారి కుటుంబాల్లోని కొందరికి నేటికీ సాయం అందని పరిస్థితి.

తాజాగా చూస్తే.. గల్వాన్ అమరవీరుల కుటుంబాలతోపాటు సికింద్రాబాద్ అగ్నిప్రమాద మ్రతుల కుటుంబాలకు సాయం అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ బిహార్ కు వెళ్లారు. దీనిపై ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. బిహార్ కు వెళ్లటం తప్పు కాదు.

కానీ.. రాష్ట్రంలో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల్ని పరామర్శించేందుకు.. కొండగట్టు బస్సు ప్రమాదంలో మరణించిన కుటుంబాల్నిఆదుకునే విషయంలో ప్రగతిభవన్.. ఫార్మర్ హౌస్ దాటని ముఖ్యమంత్రి.. అందుకు భిన్నంగా వందల కిలోమీటర్ల దూరాన ఉన్న బిహార్ కు వెళ్లటం ఏమిటి? అన్నది ప్రశ్న. చూస్తుంటే.. కొండగట్టు కంటే బిహార్ దగ్గరా? అన్న సటైర్లు పడుతున్నాయి. పరిహారం అందించటం కోసం ప్రత్యేక విమానంలో బిహార్ కు వెళ్లిన ముఖ్యమంత్రి.. రాష్ట్రంలోని సొంతోళ్ల విషయంలో అలా ఎందుకు వ్యవహరించరు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.