Begin typing your search above and press return to search.

బండి పాదయాత్రకు బ్రేకులు వేసి కేసీఆర్ సర్కారు తప్పు చేస్తోందా?

By:  Tupaki Desk   |   24 Aug 2022 5:12 AM GMT
బండి పాదయాత్రకు బ్రేకులు వేసి కేసీఆర్ సర్కారు తప్పు చేస్తోందా?
X
ఒత్తిడితో ఉన్నప్పుడు ఒక మంచి.. మరో చెడు జరుగుతుంది. మంచి ఏమంటే.. అలాంటి ఒత్తిళ్లను ఎదుర్కొనే సామర్థ్యాన్ని సొంతం కావటమే కాదు.. మెదడు షార్ప్ గా రియాక్టు అవుతుంది. చెడు ఏమంటే.. చేయకూడని తప్పులు చేస్తుంటారు. ఒత్తిడి వేళ కొందరు ఒప్పులు చేస్తే.. మరికొందరు తప్పు చేస్తారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న పాదయాత్రకు బ్రేకులు వేయటం ద్వారా కేసీఆర్ సర్కార్ తప్పు చేస్తుందన్న మాట రాజకీయవర్గాల్లో బలంగా వినిపిస్తోంది.

ప్రతి విషయాన్ని లోతుగా పరిశీలించటంతో పాటు.. ఆ ఇష్యూ కారణంగా చోటు చేసుకునే పరిణామాలపై 360 డిగ్రీస్ లో ఆలోచించే అలవాటున్న గులాబీ బాస్ కేసీఆర్.. బీజేపీ విషయంలో ఆయన అందుకు భిన్నంగా రియాక్టు అవుతున్నారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఏళ్లకు ఏళ్లుగా తన మాటకు.. తన చేతలకు ఎదురు నిలిచే వారే లేని వేళ.. అందుకు భిన్నంగా కొత్త తరహ ఎత్తుగడతో కేసీఆర్ సర్కార్ ను ఎదుర్కొనేందుకు వీలుగా అస్త్రశస్త్రాలతో సిద్ధమైన కమలనాథుల కవ్వింపులకు కేసీఆర్ తప్పులో కాలేస్తున్నారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

తాజాగా బండి సంజయ్ చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్రను నిలిపివేయాలని వరంగల్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. జనగామ జిల్లాలో పాదయాత్రకు అనుమతి లేదని నోటీసుల్లో పేర్కొనటం హాట్ టాపిక్ గా మారింది. పాదయాత్రకు బ్రేకులు వేయటానికి కారణాల్ని పేర్కొన్న వర్ధన్నపేట ఏసీపీ శ్రీనివాస్.. ‘పాదయాత్ర పేరుతో విద్వేష ప్రకటనలు చేస్తున్నారు. ధర్మ దీక్ష పేరుతో వివిధ జిల్లాల నుంచి భారీ ఎత్తున జన సమీకరణ చేస్తున్నారు. రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారు’ అని పేర్కొంటూ బండి యాత్రకు బ్రేకులు వేయటం గమనార్హం.

అయితే.. పోలీసుల వాదనలకు తెలంగాణ వాదుల వాదన వేరుగా ఉంది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు.. భారీ జనసమీకరణతో చేసే ప్రయత్నాల విషయంలో కేసీఆర్ కు మించినోళ్లు ఎవరు? అని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర సాధనలో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యలతో పోలిస్తే.. బండి చేస్తున్న వ్యాఖ్యలు ఒక మూలకు వస్తాయా? అన్నది మరో ప్రశ్న. విపక్షంలో ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా మాట్లాడటమే కాదు.. దూకుడుగా వ్యవహరిస్తూ.. తనను ఎవరైనా అడ్డుకునే సమయంలో తెలంగాణ సెంటిమెంట్ తో ఉమ్మడి రాష్ట్ర పాలకుల వెన్నులో దడ పుట్టించిన కేసీఆర్.. ఇప్పుడు పాదయాత్ర చేసే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి విషయంలో వ్యవహరిస్తున్న తీరు సరికాదన్న మాట వినిపిస్తోంది.

పాదయాత్రకు బ్రేకులు వేయటం చాలా ప్రభుత్వాలు చేసే పనే. కానీ.. ఇలాంటి వాటితో బండి ఇమేజ్ మరింత పెరగటంతో పాటు.. తమ ప్రభుత్వం మీద ఉన్న సానుకూలత తగ్గుతుందన్న విషయాన్ని మర్చిపోకూడదంటున్నారు. ఒత్తిడి వేళ.. సరైన నిర్ణయాలు తీసుకోవాలే కానీ.. ఇలాంటి తొందరపాటు చర్యలతో రాష్ట్రంలో బీజేపీ ఇమేజ్ మరింత పెరుగుతుందన్న విషయాన్ని గుర్తించాలని చెబుతున్నారు. అన్నింటికి సిద్ధమై కేసీఆర్ సర్కారుపై బీజేపీ యుద్ధం చేస్తుందని.. ఆ ట్రాప్ లో పడటం ద్వారా కేసీఆర్.. బీజేపీని రాష్ట్రంలో మరింత బలపడేలా చేస్తున్నారన్న మాట వినిపిస్తోంది.

బండి యాత్రకు పోలీసులు చెక్ చెప్పొచ్చు. కానీ.. సహేతుకమైన కారణాలు చూపించి.. తమ వాదనలతో కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకుంటే.. కేసీఆర్ సర్కారు తప్పు చేసినట్లు అవుతుందన్న విషయాన్ని గులాబీ బాస్ ఎందుకు మిస్ అవుతున్నారు. పోలీసులు తీసుకుంటున్న నిర్ణయానికి ప్రభుత్వాధినేతగా తనకు సంబంధం ఏమిటన్న ప్రశ్నను సంధించొచ్చు. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదన్న మాటను కేసీఆర్ ప్రభుత్వంలో ప్రజలు మర్చిపోరు కదా?