Begin typing your search above and press return to search.

కరోనా వేళ జగన్ తీసుకున్న తాజా నిర్ణయాన్ని గమనిస్తున్నారా కేసీఆర్?

By:  Tupaki Desk   |   7 May 2021 2:30 AM GMT
కరోనా వేళ జగన్ తీసుకున్న తాజా నిర్ణయాన్ని గమనిస్తున్నారా కేసీఆర్?
X
ఫోకస్ పెట్టటంలో కాస్త ఆలస్యం కావొచ్చు కానీ.. ఒకసారి పెట్టిన తర్వాత దాని లోతుల్లోకి వెళ్లిపోవటమే కాదు.. ప్రజలకు అవసరమైన అన్ని అవసరాల్ని తీర్చేలా ఎడాపెడా నిర్ణయాలు తీసుకోవటంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే తన మార్కును ప్రదర్శించారు. తెలంగాణ రాష్ట్రంతో పోలిస్తే.. రోజువారీగా చేపట్టే కోవిడ్ టెస్టుల్లో ఏపీ ముందున్న సంగతి తెలిసిందే. ఎక్కువ పరీక్షలు చేస్తే.. ఎక్కువ కేసులు బయటకు వస్తాయన్న భయానికి పోకుండా.. ఉన్నది ఉన్నట్లు చెబుదామన్నట్లుగా వ్యవహరిస్తున్న ధోరణి అందరిని ఆకర్షిస్తోంది.

కేసుల నమోదు ఎక్కువగా అవుతున్న వేళ.. అందుకు తగ్గ వైద్యసదుపాయాలు ఎలా కల్పించాలన్న అంశంపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు సీఎం జగన్. కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ ఎక్కువైపోతున్న వేళ.. పేదలు వైద్యం చేయించుకోవటానికి ఇబ్బంది పడుతున్న వేళ.. ఆయన అనూహ్య నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రభుత్వ ఆసుప్రతుల్లో కాకుండా.. ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకోవటానికి వీలుగా ఆయన తాజా మార్గదర్శకాల్ని విడుదల చేశారు.

ఆరోగ్య శ్రీ ఆసుపత్రుల్లో విధిగా 50 శాతం బెడ్లను ఆరోగ్య శ్రీ పేషెంట్ల. కు కేటాయించాలని పేర్కొన్నారు. ఒకవేళ యాభై శాతం కంటే ఎక్కువమంది పేషెంట్లు వచ్చినా.. వారికి బెడ్లను ఏర్పాటు చేసుకొని తప్పనిసరిగా చేర్చుకోవాలని స్పష్టం చేశారు. అంటేకాదు.. కలెక్టర్లు నోటిఫై చేసిన నాన్ ఎంప్యానెల్ ఆసుపత్రులూ ఆ బెడ్లను ఇవ్వాలని.. అందుకోసం ఆసుపత్రుల్ని తాత్కాలికంగా ఎంప్యానెల్ చేయాలని చెప్పారు. ఆరోగ్య శ్రీ కింద పూర్తి ఉచిత వైద్యం కోవిడ్ పేషెంట్లకు అందించాలని స్పష్టం చేశారు. ఇలా.. విపత్తు వేళ.. చేష్టలుడిగినట్లుగా ఉండిపోకుండా.. ఆసుపత్రులు విధిగా నిర్వర్తించాల్సిన విధుల గురించి స్పష్టం చేస్తున్న సీఎం తీరు ఇప్పుడు సంచలనంగా మారింది. మరి.. ఈ తరహా నిర్ణయాలు తెలంగాణలో ఎందుకు ఉండటం లేదన్న ప్రశ్న పలువురి నోట వినిపిస్తోంది.