Begin typing your search above and press return to search.

దసరా ముహూర్తం ఫిక్సయినట్లేనా ?

By:  Tupaki Desk   |   29 Sep 2022 4:33 AM GMT
దసరా ముహూర్తం ఫిక్సయినట్లేనా ?
X
కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనకు ముహూర్తం ఫిక్సయినట్లేనా ? రాబోయే దసరా పండుగ అంటే విజయదశమి అక్టోబర్ 5వ తేదీన జాతీయపార్టీ ప్రకటన చేయాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారట. ప్రాంతీయ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా అప్ డేట్ చేయాలని కేసీయార్ ఎప్పుడో నిర్ణయించుకున్నారు. అంటే ఇప్పటివరకు ప్రాంతీయ పార్టీగా ఉన్న టీఆర్ఎస్(తెలంగాణా రాష్ట్ర సమితి) తొందరలోనే బీఆర్ఎస్ (భారతీయ రాష్ట్ర సమితి)గా మారబోతోందనే ప్రచారం పెరిగిపోతోంది.

సరిగ్గా విజయదశమి రోజున కేసీఆర్ కీలకమైన సమావేశం పెట్టుకున్నారు. మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపీలు, ఎంఎల్సీలతో పాటు సీనియర్ నేతలందరినీ సమావేశానికి తప్పకుండా రావాలని ఇప్పటికే సమాచారం వెళిపోయిందట.

ఆరోజు పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిపబోతున్నారు. ఆ సమావేశంలో జాతీయ పార్టీ ఏర్పాటుకు అవసరమైన తీర్మానం చేయబోతున్నారు. అప్పుడే జెండా, అజెండాను అందరికీ కేసీయార్ వివరిస్తారని ప్రచారం మొదలైంది.

ముఖ్యమంత్రిగా ఉంటునే జాతీయ పార్టీ పెట్టి జాతీయ రాజకీయాల్లో బిజీగా ఉండాలని ఇప్పటికే కేసీయార్ నిర్ణయించుకున్నారు. జాతీయ రాజకీయాల్లో కీలకంగా ఉండాలంటే హైదరాబాద్ లో కూర్చుంటే సరిపోదనే అభిప్రాయానికి వచ్చారు.

హైదరాబాద్ తో పాటు ఢిల్లీలో కూడా ఇతర జాతీయ పార్టీల అధినేతలకు రెగ్యులర్ గా అందుబాటులో ఉండేందుకే ఢిల్లీలో పార్టీ ఆఫీసు నిర్మాణంలో స్పీడు పెంచారు. అయితే ఇటు హైదరాబాద్, అటు ఢిల్లీలో ఉంటు అందరికీ అందుబాటులో ఉండటం అనుకున్నంత ఈజీ కాదు.

ఎక్కడో ఒకచోట ఇబ్బందులు తప్పవు. ఈ విషయం కేసీయార్ కు అనుభవపూర్వకంగానే తెలిసొస్తుంది. ఇపుడు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. అందుకనే బెంగాల్లో పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలను ఎక్కువగా మేనల్లుడు అభిషేక్ బెనర్జీయే చక్కపెడుతున్నారు. కాబట్టి ముందు ముందు రాష్ట్రంలో వ్యవహారాలను కేటీయార్ చేతిలోకి వెళ్ళిపోయేందుకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయినా జాతీయ స్ధాయిలో కేసీయార్ తో కలిసేందుకు ముందుకొచ్చే నేతలున్నప్పటి సంగతి ఇదంతా. మరి చూడాలి చివరకు ఏమవుతుందో.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.