Begin typing your search above and press return to search.

ప్రధాని కావాలనుకునే కేసీఆర్ 'పీఎం మోడీ'ని కలవకపోవటమా?

By:  Tupaki Desk   |   12 Nov 2022 4:33 AM GMT
ప్రధాని కావాలనుకునే కేసీఆర్ పీఎం మోడీని కలవకపోవటమా?
X
సవాలచ్చ ఉండొచ్చు. అయితే మాత్రం దేశ ప్రధాని రాష్ట్రానికి.. అందునా అధికారిక కార్యక్రమానికి హాజరవుతున్న వేళ.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కచ్ఛితంగా హాజరు కావాల్సిందే. అయితే.. మోడీతో పోరుకు సై అంటున్న కేసీఆర్ మాత్రం అందుకు భిన్నంగా.. ప్రధాని మోడీని కలిసేందుకు.. ఆయనకు ఎదురుపడేందుకు ఏ మాత్రం ఆసక్తి చూపటం లేదని చెప్పాలి. రామగుండం ఎరువుల కర్మాగారాన్ని జాతి ప్రజలకు అంకితం ఇచ్చేందుకు తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న ప్రధానిని సీఎం కేసీఆర్ కలిసేందుకు ఎలాంటి ఆసక్తి చూపటం లేదన్నది తెలిసిందే.

ఆ మాటకు వస్తే.. రాజకీయంగా తేడాలు ఉండొచ్చు కానీ.. రాష్ట్రానికి వస్తున్న ప్రధానిని కలవటం అన్నది మంచి పద్దతిగా చెబుతున్నారు. ఇందుకు.. తెలంగాణకు ఇరుగున ఉన్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తీరును ప్రస్తావిస్తున్నారు. స్టాలిన్ కాంగ్రెస్ కు స్నేహితుడే కాదు.. ప్రధాని నరేంద్ర మోడీ భావజాలాన్ని.. ఆయన రాజకీయాన్ని ఏ మాత్రం అంగీకరించని ముఖ్యమంత్రి. తమిళనాడు ప్రయోజనాల కోసం కోట్లాడే స్టాలిన్.. అదే సమయంలో రాష్ట్రానికి వచ్చిన ప్రధానమంత్రిని సాదరంగా ఆహ్వానించటం.. ఆయన వెంట ఉండటం.. ఆయనకు ఇవ్వాల్సిన గౌరవ మర్యాదల విషయంలో ఏ మాత్రం లోటు లేకుండా చూసుకోవటం చేస్తారు.

మరి.. స్టాలిన్ తీరుకు భిన్నంగా సీఎం కేసీఆర్ మాత్రం తనకు పొసగని మోడీతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఇష్టపడటం లేదు. ఇప్పటికే మూడుసార్లు మోడీకి ముఖం చూపించని సీఎం కేసీఆర్.. ఈసారి అదే సీన్ ను రిపీట్ చేయనున్నారు. అయితే.. ఇంతకు ముందు వచ్చిన సందర్భాలు వేరు.. ఈసారి వేరు అన్నది మర్చిపోకూడదు. గతంలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనటానికి.. అనధికారిక కార్యక్రమాల్లో పాల్గొనటానికి ప్రధాని మోడీ తెలంగాణకు వస్తే.. ఈసారి మాత్రం అధికారిక కార్యక్రమం. కానీ.. దానికి డుమ్మా కొట్టాలన్నట్లుగా సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవటం ఆసక్తికరంగా మారింది.

ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోవాలన్న ఆశ పడుతున్న కేసీఆర్.. అందుకు తగ్గట్లుగా వ్యవహరించటం లేదన్న విషయాన్ని ఆయన మర్చిపోతున్నారంటున్నారు. నిజానికి కేసీఆర్ కు ఉన్న బలం.. ఆయనకు మిగిలిన రాజకీయ పార్టీలతో ఉన్న అనుబంధంతో పోల్చినప్పుడు ప్రదానమంత్రి అయ్యే అవకాశాలు చాలా తక్కువ.

అయినప్పటికీ.. ప్రధాని రేసులోకి తనకు తానుగా వచ్చిన కేసీఆర్.. తాను అందుకు తగ్గట్లు వ్యవహరిస్తున్న భావన కలిగించాల్సిన బాధ్యత ఉంది. తాను ఏ కుర్చీలో అయితే కూర్చోవాలనుకుంటున్నానో.. ఇప్పుడు అదే కుర్చీలో ఉన్న ప్రముఖుడ్ని ఖాతరు చేయకపోవటం ఎలాంటి సందేశాన్ని ఇచ్చినట్లు అవుతుంది? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

రాజకీయాల్లో శాశ్విత మిత్రుడు.. శాశ్విత శత్రువు ఉండరు. అలాంటప్పుడు మోడీని కలిసేందుకు ఇష్టపడని కేసీఆర్.. రానున్న రోజుల్లో ఈ తీరు తన ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తుందన్న విషయాన్ని ఎందుకు గుర్తించనట్లు?


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.