Begin typing your search above and press return to search.

విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్ధి కొడాలి నానేనా...?

By:  Tupaki Desk   |   6 Sep 2022 5:54 PM GMT
విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్ధి కొడాలి నానేనా...?
X
వైసీపీ రెండేళ్లు ఎన్నికలు ఉందనగానే అన్నీ చక్కబెట్టుకుంటోంది. వచ్చే ఎన్నికల్లో కూడా ఎక్కువ ఎంపీలు ఎమ్మెల్యేల సీట్లను గెలవాలని వైసీపీ గట్టి పట్టుదలతో ఉంది. తాము చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే తిరిగి గెలిపిస్తాయని ధీమా కూడా వ్యక్తం చేస్తోంది. ఇదిలా ఉంటే వైసీపీకి ఎమ్మెల్యేల విషయంలో బెంగ లేదు కానీ ఎంపీ అభ్యర్ధుల కరవు మాత్రం చాలా గట్టిగానే ఉంది అంటున్నారు.

ఇక కొన్ని సీట్లలో అయితే జగన్ వేవ్ బలంగా వీచిన 2019 ఎన్నికల్లో సైతం అభ్యర్ధులు ఓడిపోయారు. అలాంటి సీటు విజయవాడ లోక్ సభ సీటు. ఇక్కడ 2014, 2019 ఎన్నికల్లో వరసగా వైసీపీ ఓడిపోతూ వస్తోంది. ఇక 2019లో చిత్రమేంటి అంటే విజయవాడ లోక్ సభ పరిధిలోని మొత్తం ఏడు అసెంబ్లీ సీట్లకు గానూ ఆరింటిని వైసీపీ గెలుచుకుంది. అలాంటి వైసీపీ ఎంపీ సీటు విషయానికి వచ్చేసరికి చతికిలపడింది.

దాంతో అక్కడ టీడీపీ అభ్యర్ధి కేశినేని నాని గెలిచారు. ఆయన అలా గెలవడం రెండవసారి కూడా. దాంతో వైసీపీకి విజయవాడ ఎంపీ సీటు ఒక పజిల్ గా మారిపోయింది. ఆ సీటుని ఎలాగైనా గెలుచుకోవాలన్న ఆరాటం ఉన్నా తగిన అభ్యర్ధి ఎవరా అన్న వేట మాత్రం ఇప్పటికీ సాగుతూనే ఉంది. అయితే ఇపుడు విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్ధి దొరికేశారు అని ఒక చర్చ అయితే సాగుతోంది.అలా ప్రచారం కూడా జరుగుతోంది.

ఇదిలా ఉంటే బలమైన అభ్యర్ధిని ఈసారి విజయవాడ ఎంపీ సీటుకు పోటీలో ఉంచడం ద్వారా ఎలాగైనా జెండా పాతాలని వైసీపీ అధినాయకత్వం చూస్తోంది. ఇక్కడ బలమైన సామాజికవర్గమే మొదటి నుంచి గెలుస్తోంది. అలా కనుక చూస్తే వైసీపీ కంటే ఆ సామాజికవర్గంలో గట్టి నేతలు పలువురు ఉన్నారు. అయితే వైసీపీకి ఉన్న ఏకైక నాయకుడు ఆ సామాజికవర్గం నుంచి ఆయనే అని అంతా అంటున్నారు.

ఆయన ఎవరో కాదు మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని. దాంతో ఇపుడు వైసీపీ హై కమాండ్ కొడాలి నాని మీద పూర్తి ఫోకస్ పెట్టింది అని అంటున్నారు. విజయవాడ సీటు ఈసారి గెలిచి తీరాలి అని పట్టుదలగా ఉన్న వైసీపీ హై కమాండ్ కొడాలి నానిని బరిలోకి దింపాలని చూస్తోంది అని అంటున్నారు. ఆయన అయితేనే కచ్చితంగా గెలిచి తీరుతారు, విజయవాడలో ఫస్ట్ టైమ్ వైసీపీ జెండా ఎగురుతుందని కూడా భావిస్తోంది.

కొడాలి నాని ఆషామాషీ వ్యక్తి కాదు ఆయన పక్కా ఫైర్ బ్రాండ్. పైగా ఆయనకు తన సొంత సామాజికవర్గంలో పార్టీలకు అతీతంగా ప్రత్యేకమైన పొలిటికల్ ఇమేజ్ ఉంది. ఉన్నది ఉన్నట్లుగా ముక్కు సూటిగా మాట్లాడే నాని అంటే చాలా మంది అభిమానిస్తారు. అలాగే ఆయనకు అటు బీసీలు, కాపులు ఇతర వర్గాలలోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెబుతున్నారు. దాంతో నాని కంటే బెస్ట్ చాయిస్ తమకు ఉండదని వైసీపీ హై కమాండ్ భావించడంతో తప్పులేదు. అది తప్పేట్లు కూడా లేదు.

కానీ ఇప్పటికే గుడివాడ నుంచి మరోసారి పోటీకి అంతా సిద్ధం చేసుకుంటున్న నానిని విజయవాడ నుంచి ఎంపీగా పోటీ చేయించాలని చూస్తే ఆయన ఒప్పుకుంటారా అన్న చర్చ కూడా ఉంది. మరోసారి గెలిచి వైసీపీ సర్కార్ అధికారంలోకి వస్తే మంత్రి కావాలని కొడాలి నాని ఆలోచిస్తుతున్నారు. ఇక ఆయన పూర్తిగా తన గుడివాడ రాజకీయాలకే పరిమితం అవుతాను అని కూడా మాజీ మంత్రి అయిన తరువాత పలుమార్లు చెప్పారు కూడా.

దాంతో ఆయన ఒక పట్టాన ఓకే అంటారా అన్నదే చర్చగా ఉంది. అయితే జగన్ చెబితే కనుక నాని కచ్చితంగా ఒప్పుకుంటారు అని వైసీపీ వర్గాలు అంటున్నారు. కొడాలి నాని కనుక ఒకసారి ఓకే అంటూ విజయవాడ బరిలోకి దిగితే ఆ పోటీయే వేరేగా ఉంటుంది అని కొత్తగా చెప్పాల్సింది లేదు. మొత్తానికి విజయవాడ ఎంపీ క్యాండిడేట్ కొడాలి అన్న వార్త మాత్రం రాజకీయ వర్గాలలో ప్రకంపలను సృష్టిస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.