Begin typing your search above and press return to search.

కోరికోరి.. కొవిడ్ నోట్లో తల.. కోహ్లికి పాటిజివ్..? బీసీసీఐ వార్నింగ్ అందుకేనా?

By:  Tupaki Desk   |   22 Jun 2022 1:30 PM GMT
కోరికోరి.. కొవిడ్ నోట్లో తల.. కోహ్లికి పాటిజివ్..? బీసీసీఐ వార్నింగ్ అందుకేనా?
X
పూర్తిగా ఫామ్ లో లేడు.. మెడపై ఒత్తిడి కత్తి వేలాడుతోంది.. విమర్శకులు అదేపనిగా నోటికి పనిచెబుతున్నారు.. ఇలాంటి సమయంలో కాస్తంతయినా సంయమనం పాటించాలి. కానీ, టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి కట్టుతప్పాడు. క్రమశిక్షణకు మారుపేరైన కోహ్లి ఎందుకనో దానిని కాస్త పక్కన పెట్టాడు. గతేడాది కొవిడ్ కారణంగా నిలిచిపోయిన ఇంగ్లండ్ తో ఐదో టెస్టు జరగబోయే ముందు టీమిండియా అభిమానులకు షాకిచ్చాడు. పూర్తిస్థాయిలో అధికారికంగా ప్రకటన రాలేదు కానీ.. కోహ్లికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు సమాచారం. 2-1తో ఆధిక్యంలో నిలిచి.. ఐదో (చివరి) టెస్టునూ గెల్చుకుంటే సిరీస్ వశం చేసుకునే సువర్ణావకాశం ఉన్న వేళ ఇది అనూహ్య సంఘటనే.

కొవిడ్ పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన వేళ...

ఇంగ్లండ్ లో మనదగ్గర కంటే ముందే కొవిడ్ నిబంధనలు ఎత్తేశారు. సహజంగానే అక్కడి ప్రజలు స్వేచ్ఛా ప్రియులు. దీంతో బహిరంగంగా తిరిగేందుకు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. గతంలో కొవిడ్ ఆంక్షల విషయంలోనూ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. అందుకే.. ఇంగ్లండ్ లో పలుసార్లు కొవిడ్ వేవ్ లు వచ్చాయి. అలాంటిచోట జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు ఇప్పటికీ ఆ దేశంలో రోజుకు 10 వేల కేసులొస్తున్నాయి. అయితే, వ్యాక్సినేషన్, కొవిడ్ తీవ్రత తగ్గడంతో టీమిండియా మేనేజ్ మెంట్ కఠినమైన బయో బబుల్ నిబంధనలు అమలు చేయడం లేదు.

దీంతో భారత క్రికెటర్లు ఇంగ్లాండ్‌లో స్వేచ్ఛగా విహరిస్తున్నారు. షాపింగ్‌, షికార్లకు వెళుతున్నారు. కొవిడ్‌ నిబంధనలు పాటించడం లేదు. అభిమానులకు కరచాలనం ఇస్తూ ఫొటో పోజులిస్తున్నారు. కోహ్లీతో పాటు కెప్టెన్ రోహిత్‌ శర్మ ఇలా దిగిన ఫొటోలు వైరల్‌ అయ్యాయి. మాస్క్ ధారణ వంటి కనీస జాగ్రత్తలు పాటించకుండా ఆటగాళ్లు బయటి ప్రదేశాలకు వెళ్లడంపై బీసీసీఐ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కొవిడ్‌ను తేలిగ్గా తీసుకోవద్దంటూ ఆ ఇద్దరి ఆటగాళ్లను హెచ్చరించాలని భావిస్తోంది. 'యూకేలో కొవిడ్‌ కేసులు చాలావరకూ తగ్గినప్పటికీ క్రికెటర్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. మాస్క్‌లు ధరించే బయట తిరగాలి' అని బీసీసీఐ కోశాధికారి అరుణ్‌ ధుమాల్‌ సూచించారు.

వైరస్ అంటుకుందా..?

ఇప్పటికే గాయం కారణంగా ఓపెనర్ కేఎల్ రాహుల్ దూరమయ్యాడు. ప్రధాన స్పిన్నర్ అశ్విన్ కొవిడ్ కు గురై ఆలస్యంగా బయల్దేరనున్నాడు. అయితే, అన్నిటికంటే పెద్ద షాకింగేమంటే.. లండన్‌లో షాపింగ్‌ అంటూ తిరిగి.. సెల్ఫీలకు పోజులిచ్చిన కోహ్లి కొవిడ్‌ బారిన పడ్డాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికిముందే కోహ్లి మాల్దీవుల్లో గడిపాడు. వచ్చే నెల 1న ఎడ్జ్‌బాస్టన్‌ లో ఐదో టెస్టు జరగనుంది. అంటే.. మరొక్క 9 రోజులే.

కరోనా సోకితే ఐదు రోజులు ఐసొలేషన్‌లో ఉండాల్సిందే. దీంతో టెస్టుకు అందుబాటులో ఉండడం కష్టమే. అందుకే కరోనా విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆటగాళ్లకు బీసీసీఐ సూచిస్తోంది. చివరి టెస్టు ఆడాల్సిన ఉన్న అశ్విన్‌ కొంచెం ఆలస్యంగా భారత జట్టులో చేరనున్నాడు. గతవారం కరోనా పాజిటివ్‌గా తేలిన అశ్విన్‌.. జట్టుతో పాటు ఇంగ్లాండ్‌ వెళ్లలేకపోయాడు. కొవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకున్నాడు. బుధవారం ఇంగ్లాండ్‌ బయల్దేరే అవకాశముందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఈనెల 24న లీసెస్టర్‌తో జరిగే నాలుగు రోజుల వార్మప్‌ మ్యాచ్‌కు అశ్విన్‌ అందుబాటులో ఉంటాడని పేర్కొన్నాయి.

అతడొక్కడికేనా..? ఇంకొందరికీనా..?

ప్రాక్టీస్‌ సందర్భంగా కోహ్లి కొద్ది రోజులుగా జట్టు సహచరులతో ఉన్నాడు. దీంతో భారత శిబిరంలోనూ కరోనా కలవరం మొదలైంది. ఒకవేళ అతడు కొవిడ్ బారిన పడ్డాడనన్నది నిజమైతే మిగతా జట్టులోనూ కలవరం తప్పదు. ఇక మంగళవారం ఉదయమే శ్రేయస్‌ అయ్యర్, రిషభ్‌ పంత్‌తో కలిసి లండన్‌ చేరుకున్న హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ వెంటనే లీసెస్టర్‌కు వెళ్లి జట్టుతో చేరాడు. ద్రవిడ్‌ పర్యవేక్షణలో టీమిండియా ఆటగాళ్లంతా సాధన చేశారు. శుక్రవారం నుంచి లీసెస్టర్‌షైర్‌ కౌంటీతో భారత్‌ నాలుగు రోజుల పూర్తి స్థాయి ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడనుంది. టెస్టు తుది జట్టులో స్థానం దక్కే ఆటగాళ్లే ఈ మ్యాచ్‌లోనూ బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి.