Begin typing your search above and press return to search.

కోమటిరెడ్డి వెంకటరెడ్డి రిటైర్ మెంట్ ప్రకటిస్తున్నారా?

By:  Tupaki Desk   |   7 Nov 2022 6:30 AM GMT
కోమటిరెడ్డి వెంకటరెడ్డి రిటైర్ మెంట్ ప్రకటిస్తున్నారా?
X
వ్రతం చెడ్డా ఫలితం దక్కని వైనంగా మారింది కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిస్థితి. అటు తమ్ముడు ఓడిపోయాడు. ఇటు అన్న ఉన్న పార్టీకి డిపాజిట్ దక్కలేదు. మధ్యలో విజయాన్ని టీఆర్ఎస్ కాజేయడంతో ఈ బ్రదర్స్ కు ఇప్పుడు తడిగుడ్డే దిక్కైంది. ఎన్నో కుట్రలు, కుతంత్రాలకు వేదికైన మునుగోడులో బీజేపీ తరుఫున పోటీచేసిన రాజగోపాల్ రెడ్డిని గెలిపించేందుకు.. కాంగ్రెస్ లో ఉన్న ఎంపీ వెంకటరెడ్డి చేయని ప్రయత్నం లేదంటారు. ఫోన్ కాల్స్ చేస్తూ తమ్ముడిని గెలిపించాలని ఆయన చేసిన కాల్స్ కాకరేపాయి. కాంగ్రెస్ లోనే ఉంటూ కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించిన వెంకటరెడ్డి తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇప్పుడు మునుగోడులో తమ్ముడు గెలవలేదు. కాంగ్రెస్ కు డిపాజిట్ గల్లంతైంది. దీంతో ముఖ్యంగా రాజకీయాల్లో బలంగా ఉండి శాసించిన వెంకటరెడ్డి రాజకీయ భవిష్యత్తుకు సమాధి పడిందనే చెప్పాలి.

తమ్ముడి కోసం సొంత కాంగ్రెస్ నే కాలదన్నేలా కుట్రలు చేసిన వెంకటరెడ్డి రాజకీయాల్లో చెడ్డ పేరు తెచ్చుకున్నారు. ఆయనను కాంగ్రెస్ వెలివేసే ప్రమాదం ఉంది. మొత్తంగా బ్యాడ్ అయిపోయి రాజకీయంగా ఎవరూ నమ్మని స్థితికి వెంకటరెడ్డి దిగజారారు. అటు కాంగ్రెస్ లో భవిష్యత్ ఉండక ఇటు బీజేపీలో చేరుదామన్న పిలుపు రాక కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా మారిపోయింది. .

మునుగోడుతో తొడగొట్టిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తను ఓడడమే కాదు.. అన్నయ్య వెంకటరెడ్డి రాజకీయ భవిష్యత్ ను ఇరకాటంలో పెట్టేశారు. 18వేల కాంట్రాక్ట్ కోసమే ఆయన చేరారని టీఆర్ఎస్ చేసిన ప్రచారం కూడా ఆయన ఓటమికి దారితీసింది. ఇక బీజేపీ ఇస్తామన్న ఆ అతిపెద్ద కాంట్రాక్ట్ కూడా ఓటమితో ఇస్తారో లేదో..

రాజగోపాల్ రెడ్డికి ఎలాగూ సొంతంగా గెలిచే పరిస్థితి లేదు. అన్నయ్య వెంకటరెడ్డి మీదనే ఆధారపడ్డాడు. అయితే వెంకటరెడ్డి ఈ మునుగోడులో కాంగ్రెస్లో ఉండి బీజేపీలోని తమ్ముడిని గెలిపించుకోలేకపోయాడు. దీంతో ఆయన పరపతి అంతా పడిపోయింది.

అటు కాంగ్రెస్ షోకాజ్ నోటీసులు ఇచ్చి సాగనంపే చర్యలు చేపట్టారు. ఇటు బీజేపీలో తమ్ముడిని గెలిపించుకోలేకపోయిన ఆయనకు సరైన ఆహ్వానం, ట్రీట్ మెంట్ ఉండదు. ఇక అధికార టీఆర్ఎస్ పైనే ఈ బ్రదర్స్ ఇద్దరూ పోరాడారు. సో అందులోకి ఎంట్రీ ఉండదు.

మొత్తంగా మునుగోడు ఎన్నికలతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి తేలిపోయారు. ఆయన నిండా మునిగిపోయారు. ఇక వెంకటరెడ్డి రాజకీయ భవిష్యత్ కష్టమేనని.. ఆయన రిటైర్ మెంట్ ప్రకటించి వ్యాపారాలు చూసుకోవడం తప్ప రాజకీయాల్లో రాణించడం కష్టమేనంటున్నారు. ఆయనను ఏ పార్టీ నమ్మే పరిస్థితి లేదంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.