Begin typing your search above and press return to search.

ఆ ఏపీ లేడీ లీడ‌ర్ కాషాయంలో అయినా ఉంటుందా... మ‌ళ్లీ జంపేనా..!

By:  Tupaki Desk   |   20 July 2019 5:27 AM GMT
ఆ ఏపీ లేడీ లీడ‌ర్ కాషాయంలో అయినా ఉంటుందా... మ‌ళ్లీ జంపేనా..!
X
ఏపీకి చెందిన ఆ మాజీ మహిళా ఎంపీ పేరుకు మాత్రమే బెస్ట్ పార్లమెంటేరియన్.. కానీ ప్రజలకు ఏమాత్రం అందుబాటులో లేని పొలిటీషియన్. పార్టీలు మారడం ఏదో ఒక వివాదంలో ఉండటం ఆమెకు కామన్. డిప్యూటీ కలెక్టర్ స్థాయి నుంచి పార్లమెంటు దాకా ఎదిగిన ఆమె అనతికాలంలోనే రాజకీయంగా ఫేడ‌వుట్ లీడ‌ర్ అయిపోయారు. పలుసార్లు పార్టీలు మారుతూ తప్పటడుగులు వేస్తూ చివరకు సొంత పార్టీ పెట్టి ఇప్పుడు కమలం గూటికి చేరిపోయారు. ఆమె ఎవరో కాదు అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత. డిప్యూటీ కలెక్టర్ గా పబ్లిక్ సర్వీస్ లో ఉన్న గీత 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎంపీగా లక్ష ఓట్ల పైచిలుకు భారీ మెజారిటీతో విజయం సాధించారు.

తనకున్న పరిచయాలతో వైసీపీలో సీటు తెచ్చుకుని ఎంపీగా పార్లమెంట్ గడప తొక్కారు. ఎంపీగా లోక్ సభలో జరిగిన 77 చర్చల్లో పాల్గొని 535 ప్రశ్నలు లేవనెత్తిన గీత 97 శాతం మార్కులు పొందారు. ఈ క్రమంలోనే ఆమె బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు సైతం సొంతం చేసుకున్నారు. అయితే తాను ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో లేరు అన్న విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. గీత పొలిటిక‌ల్ జ‌ర్నీ ఎప్పుడు వివాదాలతోనే నడిచింది. ముందుగా ఆమె ఎస్టీ కాదన్న వివాదం ఒకటి అయితే.. ఆమె భర్త కిడ్నాప్ కేసు.... ఆర్థిక విషయాల్లో ఆమె ఆరోపణలు ఎదుర్కొన్నారు.

వ‌రుస ఆరోప‌ణ‌ల‌తో ఆమెపై సొంత పార్టీలోనే తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. వైసిపి ఎంపీగా గెలిచిన ఆమె ఆ తర్వాత టిడిపికి దగ్గరయ్యారు. గీత సైకిల్ ఎక్కబోతున్న ప్రచారం జరుగుతున్న టైమ్ లోనే చంద్రబాబుపై విమర్శలు చేసి అందరికి షాక్ ఇచ్చారు. ఇక తాజా ఎన్నికల్లో ఏకంగా ఆమె జ‌న‌జాగృతి పార్టీ పెట్టి విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఇప్పుడు ఆమె రూటు మార్చేసి త‌న పార్టీని బీజేపీలో విలీనం చేసేశారు.

ఆంధ్రప్రదేశ్, భారతదేశం అభివృద్ధి చెందాలంటే అది బిజెపి వ‌ల్లే అని ప్రవచనాలు పలుకుతున్న గీత ఈ పార్టీలో అయిన ఉంటారా లేదా ? మళ్లీ మ‌రో పార్టీలోకి జంప్ చేస్తారా అన్నది చూడాల్సి ఉంది. ఏదేమైనా ఉత్తరాంధ్రలో వికసించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న కమలానికి గీత కలిసొస్తుందా ? లేదా కాషాయం గీత‌కు క‌లిసొస్తుందా ? అన్నది భవిష్యత్తులో తేలిపోనుంది