Begin typing your search above and press return to search.

తమిళనాడు గవర్నర్ గా కృష్ణంరాజు ఖాయమా?

By:  Tupaki Desk   |   7 Jan 2021 1:07 PM GMT
తమిళనాడు గవర్నర్ గా కృష్ణంరాజు ఖాయమా?
X
టాలీవుడ్ సీనియర్ నటుడు, కేంద్ర మాజీ మంత్రి యువీ కృష్ణంరాజును తమిళనాడు కొత్త గవర్నర్‌గా నియమించే అవకాశం ఉందని న్యూ ఢిల్లీ నుంచి వార్తలు వెలువడుతున్నాయి. మరి ఇది ప్రచారమా? లేక నిజమా అన్నది తెలియాల్సి ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుందని.. త్వరలోనే ఉత్తర్వులు జారీ అవుతాయని ప్రచారం సాగుతోంది.

2017 అక్టోబర్ లో గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన బన్వారిలాల్ పురోహిత్ స్థానంలో కృష్ణరాజు నియమితులవుతారని బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ పట్ల విధేయత చూపినందుకు కృష్ణంరాజుకు ఇది నిజంగా పెద్ద గుర్తింపుగా ఏపీ బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి.. కృష్ణం రాజుకు కనుక పదవి ఇస్తే ఆంధ్రప్రదేశ్ బిజెపికి పెద్దపీట వేసినట్టుగా భావించాల్సి ఉందని శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. గవర్నర్ పదవి కృష్ణంరాజుకు ఖచ్చితంగా బహుమతి అనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసపురానికి చెందిన కృష్ణరాజు భారతీయ జనతా పార్టీతో చాలా కాలంగా పనిచేస్తున్నారు. గతంలో కేంద్రమంత్రిగానూ పనిచేశారు. ఏపీ బీజేపీ నేతలంతో మంచి సంబంధాలు కలిగి ఉన్నారు.

అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో విదేశాంగ వ్యవహారాలు, రక్షణ, ఆహారం, వినియోగదారుల వ్యవహారాల శాఖలను కృష్ణంరాజు నిర్వహించారు. కేంద్రమంత్రిగానే కాదు.. రాష్ట్ర మంత్రిగానూ పనిచేశారు.

కాంగ్రెస్ పార్టీలో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన కృష్ణరాజు 1991 లో నరసపురం నియోజకవర్గం అభ్యర్థిగా గెలిచారు. తరువాత బిజెపిలో చేరారు. 1998 ఎన్నికల్లో బీజేపీ తరుఫున కాకినాడ నుండి 1,65,000 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సలహా కమిటీ సభ్యుడయ్యాడు. 1999 లో జరిగిన మధ్యంతర ఎన్నికలలో, కాకినాడ నుండి తిరిగి ఎన్నికయ్యారు. లోక్సభలో బిజెపి పార్లమెంటరీ పార్టీ విప్ అయ్యారు. 2001 లో ఆయనను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకున్నారు.